Share News

Harishrao: కాంగ్రెస్ ఎగవేత, కోతల ప్రభుత్వం.. సీఎం రేవంత్‌పై హరీష్‌రావు విసుర్లు

ABN , Publish Date - Aug 10 , 2024 | 08:48 PM

కాంగ్రెస్ ఎగవేత... కోతల ప్రభుత్వమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. తన నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చిన ఎల్లప్పుడూ వారి సేవలోనే ఉంటానని తెలిపారు. పెన్షన్‌లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు బంగారం మాటలకే పరిమితమైందని హరీ‌ష్‌రావు విమర్శించారు,

Harishrao: కాంగ్రెస్ ఎగవేత, కోతల ప్రభుత్వం.. సీఎం రేవంత్‌పై హరీష్‌రావు విసుర్లు
Harishrao

సిద్దిపేట జిల్లా: కాంగ్రెస్ ఎగవేత... కోతల ప్రభుత్వమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harishrao) ఆరోపించారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో 217 మందికి 49 లక్షల 91 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ... తన నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చిన ఎల్లప్పుడూ వారి సేవలోనే ఉంటానని తెలిపారు. పెన్షన్‌లు, రైతుబంధు, కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలు బంగారం మాటలకే పరిమితమైందని హరీష్‌రావు విమర్శించారు.


రూ. 4వేల పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పెన్షన్ రాక రెండు నెలలు అయిందని చెప్పారు. ఆడపిల్ల పెళ్లికి ఇచ్చే కళ్యాణలక్ష్మి చెక్కులు రాక 8నెలలు అవుతుందని అన్నారు. మోసపు మాటలతో అధికారంలోకి వచ్చి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని తీవ్ర విమర్శలు గుప్పించారు. గ్రామాల్లో చెత్త పేరుకు పోతుందన్నారు. ట్రాక్టర్ డీజిల్‌, సఫాయ్ కార్మికులకు డబ్బులు లేవని హరీష్‌రావు అన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం తీరు చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా ఉందని విమర్శించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు, ఎస్సీ, ఎస్టీ , బీసీ రెసిడెన్షియల్ హాస్టళ్లల్లో పని చేసే కార్మికులకు ఎనిమిది నెలలుగా జీతాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో కుక్కల దాడులు పెరిగిపోయాయని అన్నారు. వసతి గృహల్లో ఎలుకల బెడద ఉందని చెప్పారు. పారిశుధ్య నిర్వహణ సరిగా లేక దోమలు, ఈగలతో డెంగ్యూ సీజనల్ వ్యాధులతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Aug 10 , 2024 | 08:58 PM