Jaggareddy : మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన రిలాక్స్‌గా ఉన్నా.. జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jul 07 , 2024 | 06:29 PM
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు చాలా ప్రశాంతంగా ఉన్నానని, తాను ఇప్పుడు రిలాక్స్ అవుతున్నానని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు.
సంగారెడ్డి: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు చాలా ప్రశాంతంగా ఉన్నానని, తాను ఇప్పుడు రిలాక్స్ అవుతున్నానని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా తాను ఓడిపోయానని బాధపడొద్దని చెప్పారు. సంగారెడ్డిలో ఘనంగా జగ్గారెడ్డి జన్మదిన కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు, జగ్గారెడ్డి అభిమానులు భారీ ప్రదర్శన నిర్వహించి కేట్ కట్ చేశారు. కార్యకర్తలు, నేతలు వేలాదిగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఈరోజు (ఆదివారం) జగ్గారెడ్డి తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి పనులు చేసుకుందామని చెప్పారు. సంగారెడ్డి ప్రజల కోసం అభివృద్ధిలో జవాబుదారీగా ఉంటానని మాటిచ్చారు. రెండు నెలల తర్వాత ప్రతి సోమవారం సంగారెడ్డిలోని రాంనగర్లో తన ఇంటి వద్ద అందుబాటులో ఉంటానని వివరించారు. కార్యకర్తలు ఎవరూ గాంధీ భవన్‌కు రావొద్దని వస్తే తాను కలవలేను, మాట్లాడలేనని తెలిపారు. తన కూతురికి పెళ్లి చేయాలి.. కొడుకు బిజినెస్ పెడతానని డబ్బులు అడుగుతున్నాడని చెప్పారు. అప్పులు తీర్చడానికే తన జీవితం సరిపోతుందని అన్నారు. ఈ ఇరవై ఏళ్లలో సంగారెడ్డిలో బోనాలు, దసరా ఉత్సవాల కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.