Raghunandan Rao: చంద్రబాబుతో కలిసి కేసీఆర్ ఆ పని చేయలేదా..?
ABN , Publish Date - Feb 12 , 2024 | 10:12 PM
పార్లమెంట్ ఎన్నికల తర్వాత అల్లుడు తూర్పుకు, కొడుకు పడమరకు పోతారని.. ఇక బీఆర్ఎస్ ఫాంహౌస్‌కు పరిమితం అయిందని బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు(Raghunandan Rao) అన్నారు.
సిద్దిపేట జిల్లా: పార్లమెంట్ ఎన్నికల తర్వాత అల్లుడు తూర్పుకు, కొడుకు పడమరకు పోతారని.. ఇక బీఆర్ఎస్ ఫాంహౌస్‌కు పరిమితం అయిందని బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు(Raghunandan Rao) అన్నారు. సోమవారం గజ్వేల్ పట్టణంలో బీజేపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి గజ్వేల్, దుబ్బాక, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఈటల రాజేందర్, రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ... మాజీ సీఎం కేసీఆర్ కాలుకు సర్జరీ జరిగిందని.. ఆయనకు నడవడం రాకున్నా.. నీళ్ల కోసం నల్గొండకు పోతాడట ఇది చాలా విడ్డురంగా ఉందన్నారు. పదేళ్ల నుంచి ఆంధ్రకు నీళ్లు పోయేది కేసీఆర్‌కు గుర్తులేదా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు రెండు ఒక్కటేనని, నాణానికి ఒక వైపు బొమ్మ, మరోవైపు బొరుసు ఉంటాయన్నారు. నీళ్ల మంత్రిగా గత ప్రభుత్వంలో ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు కాదా...? అని ప్రశ్నించారు.
2015వ సంవత్సరంలో సీఎంగా ఉన్న కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతీ వద్ద సంతకం చేయలేదా...? అని నిలదీశారు. ‘‘299 టీఎంసీలు తెలంగాణకు, 511 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కని నువ్వు నీ మామ సంతకం చేసిన కాగితం నేను పంపిస్తా హరీష్.. గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా వద్దకు రా’’ అని సవాల్ విసిరారు. 2015లో సంతకం పెడితే తొమ్మిదేళ్లకు హరీశ్ రావు నిద్ర లేచారని ఎద్దేవా చేశారు. ‘నేను కొట్టినట్లు చేస్తా నువ్వు ఏడ్చినట్ల చేయి అన్నట్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ముచ్చట్లు’’ ఉన్నాయన్నారు. హరీష్ రావు అసెంబ్లీలో బాగా కొట్లాడారని.. అందుకే కాంగ్రెస్ జైల్‌కు పంపిందనే సింపతీని హరీష్ క్రియేట్ చేసుకుంటున్నారని అన్నారు. 2019లో ‘కారు సార్ ఢిల్లీలో సర్కార్’ అని అన్నారని.. దాన్ని ప్రజలు తిరస్కరించిన ఆయనకు బుద్దిరాలేదని రఘునందన్ రావు మండిపడ్డారు.
కాంగ్రెస్ హామీలు అమలు చేయడం లేదు: ఈటల రాజేందర్
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 6 గ్యారెంటీలను ఇచ్చి అమలు చేయడం లేదని మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు మళ్లీ ఇప్పుడేమో.. 17 ఎంపీ స్థానాలు ఇస్తే హామీలు నెరవేరుస్తామని అంటున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌లో తనకు ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పారు. కొమురవెల్లి ఆలయ ప్రాంతంలో రైల్వే స్టేషన్ నిర్మాణానికి మధ్య ప్రదేశ్ సీఎం వస్తారని ఈటల రాజేందర్ చెప్పారు.