Chandrababu, Revanth: ఇద్దరు సీఎంల భేటీ.. చర్చించే అంశాలు ఇవే..!
ABN , Publish Date - Jul 05 , 2024 | 05:06 PM
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), రేవంత్‌రెడ్డి (Revanth Reddy) రేపు(శనివారం) ప్రజా భవన్ వేదికగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), రేవంత్‌రెడ్డి (Revanth Reddy) రేపు(శనివారం) ప్రజా భవన్ వేదికగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరు సీఎంల భేటీలో ఏ అంశాలపై చర్చ సాగనుందనేది ఆసక్తికరంగా మారింది. సీఎంల భేటీకి ప్రగతి భవన్‌లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై వీరిద్దరూ భేటీ కావటం ఇదే తొలిసారి.
ప్రధానంగా షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. విద్యుత్తు సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశముంది. దాదాపు రూ.24 వేల కోట్లు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ.. రూ.7 వేల కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోంది. విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్‌కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైన విషయం తెలిసిందే. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల పంపిణీకి పడిన చిక్కుముడి కూడా వీడిపోయింది.
ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థలు ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోం శాఖ షీలాబీడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవని స్పష్టం చేసింది. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. పదో షెడ్యూలులో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి.వీటితో పాటు పలు అంశాల మీద సీఎంలు చర్చించే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ భేటీలో రెండు రాష్ట్రాల సీఎంలతో పాటు.. ఇంకా ఎవరెవరు పాల్గొంటారు.. అజెండా ఏంటి అనేదానిపై మాత్రం మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
UK Elections 2024: నన్ను క్షమించండి.. రిషి సునాక్ కీలక ప్రకటన..
Amarnath Yatra: ఒక్కరోజులోనే హైదరాబాద్ టూ అమర్‌నాథ్ యాత్ర.. ఖర్చు, జర్నీ విశేషాలివే..
Read Latest Telangana News And Telugu News