Share News

Hyderabad: తెలంగాణలో.. వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం..

ABN , Publish Date - Jun 21 , 2024 | 04:37 AM

‘‘బీజేపీకి తెలంగాణలో 8 మంది ఎంపీలు.. 8 మంది ఎమ్మెల్యేలున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో 88 స్థానాల్లో విజయం సాధించి, రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేయడం ఖాయం’’ అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఉద్ఘాటించారు.

Hyderabad: తెలంగాణలో.. వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం..

  • రాష్ట్రంలో 88 స్థానాల్లో గెలుపే లక్ష్యం.. కార్యకర్తలందరికీ నా సెల్యూట్‌

  • కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి.. కేంద్ర మంత్రులకు సన్మానం

  • భాగ్యలక్ష్మి దేవాలయాన్ని గోల్డెన్‌ టెంపుల్‌గా మారుస్తాం: బండి సంజయ్‌

హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ‘‘బీజేపీకి తెలంగాణలో 8 మంది ఎంపీలు.. 8 మంది ఎమ్మెల్యేలున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో 88 స్థానాల్లో విజయం సాధించి, రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేయడం ఖాయం’’ అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఉద్ఘాటించారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలందరికీ సెల్యూట్‌ అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 8 మంది ఎంపీలను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ‘సెల్యూట్‌ తెలంగాణ’ పేరిట గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రానికి తొలిసారి వచ్చిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ని.. ఎంపీలుగా విజయం సాధించిన ఈటల రాజేందర్‌, డీకే అరుణ, ఎం.రఘునందన్‌రావు, నగేశ్‌, ధర్మపురి అర్వింద్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలను ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. 8 మంది ఎమ్మెల్యేలను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హోదాలో కిషన్‌రెడ్డి సన్మానించారు.


ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ కార్యకర్తల కృషి, పట్టుదల, దశాబ్దాల పోరాటాల ఫలితంగా రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, మరో 8 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారని.. నమ్మిన సిద్ధాంతం, దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన నందరాజ్‌గౌడ్‌, బాలరాజ్‌యాదవ్‌, పాపయ్యగౌడ్‌, చంద్రారెడ్డి, జయానంద్‌, జితేందర్‌రెడ్డి, మైసయ్యగౌడ్‌ వంటివారికి ఈ విజయాలను అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డి, బండిసంజయ్‌ ఒకప్పుడు సాధారణ కార్యకర్తలే. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాజకీయ ఓనమాలు దిద్దుకున్న కిషన్‌రెడ్డి వరుసగా రెండోసారి కేంద్ర మంత్రి అయ్యారు. సాధారణ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించిన బండి సంజయ్‌ ఢిల్లీలోని జాతీయ పార్టీ కార్యాలయంలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు.


కార్పొరేటర్‌ స్థాయి నుంచి కేంద్ర మంత్రి అయ్యారు’’ అని వివరించారు. పార్టీ ఒంటరిగా ఎదగలేదని, ఐదేళ్ల క్రితం విమర్శలను ఎదుర్కొని.. ఒంటరిగా 4 ఎంపీ స్థానాలను సాధించి, సత్తా చాటిందన్నారు. బండి సంజయ్‌ నేతృత్వంలో ఉప ఎన్నికలతోపాటు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 స్థానాలను సాధించి, బీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయంగా ఎదిగిందని గుర్తుచేశారు. కిషన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిదేసి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వచ్చాయన్నారు. ‘‘రాబోయే ఐదేళ్లు మనకు విషమ పరీక్ష. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు పెద్దపీట వేయాలి. పాత-కొత్త కలయికలతో పార్టీని విస్తరించాలి. బీఆర్‌ఎస్‌ పనైపోయింది. ఇక కాంగ్రె్‌సను ఎదుర్కొందాం’’ అని పిలుపునిచ్చారు.


కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం

అంతకు ముందు బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న కిషన్‌రెడ్డి, ఆయన సతీమణి కావ్య, బండి సంజయ్‌కి రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్‌ తదితర ముఖ్యనేతలు ఘనస్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కిషన్‌రెడ్డి, సంజయ్‌ని గజమాలలతో సత్కరించారు. అనంతరం కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.


భాగ్యలక్ష్మి ఆలయాన్ని..

‘గోల్డెన్‌ టెంపుల్‌’గా మారుస్తాం: బండి

చార్మినార్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాతనగరంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని ‘గోల్డెన్‌ టెంపుల్‌’గా మారుస్తామని ప్రకటించారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి దయవల్లే బీజేపీ తెలంగాణలో 8 ఎంపీ సీట్లను గెలిచిందన్నారు. అమ్మవారి దయవల్లే ఆనాడు ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతమైందని గుర్తుచేశారు. ‘‘కార్పొరేటర్‌ కేంద్ర మంత్రి కావొచ్చని.. చాయ్‌వాలా ప్రధాని కావొచ్చని చాటిన ఏకైక పార్టీ బీజేపీనే. ఇంత గొప్ప అవకాశాలను కల్పించే బీజేపీ తెలంగాణలో తిరుగులేని శక్తిగా మారి, అధికారంలోకి వచ్చేదాకా పోరాడతా. నా చివరి రక్తపు బొట్టు వరకు పార్టీ కోసం పనిచేస్తా’’ అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Updated Date - Jun 21 , 2024 | 04:37 AM