Nitin Gadkari: భూసేకరణ తర్వాతే ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం
ABN , Publish Date - Aug 09 , 2024 | 03:29 AM
భూసేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
ఇప్పటికే రూ.17 వేల కోట్లు మంజూరు: నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): భూసేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్ కోసం ఇప్పటికే రూ.17వేల కోట్లు మంజూరు చేశామని ఆయన వెల్లడించారు. గురువారం లోక్‌సభలో ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం భూసేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరిస్తామని చెప్పిందని గుర్తు చేశారు.
ప్రభుత్వం మారిన తర్వాత కొత్త సీఎం భూసేకరణను త్వరగా పూర్తి చేస్తామన్నారని తెలిపారు. హైదరాబాద్- విజయవాడ రహదారి నిర్మాణంపై అనేక వివాదాలు ఉన్నాయని, దానిపై తరచూ ప్రమాదాలు జరగుతుండడం దురదృష్టకరమని అన్నారు. ఆ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీఇచ్చారు. జాతీయ రహదారి- 65 ఆధునికీకరణ కోసం టెండర్లను పిలిచామని వెల్లడించారు. ఒకటి రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని నితిన్ గడ్కరీ తెలిపారు.