Suryapet: గురుకుల విద్యార్థినులపై ప్రిన్సిపాల్ వేధింపులు!
ABN , Publish Date - Jul 05 , 2024 | 04:35 AM
ప్రిన్సిపాల్ తమపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఓ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ విద్యార్థినులు రాస్తారోకోకు దిగారు. ఆ మహిళా ప్రిన్సిపాల్‌ను వెంటనే మార్చాలంటూ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఈ ఘటన సుర్యాపేట జిల్ల్లా కేంద్రం సమీపంలోని బాలెంలలోని డిగ్రీ కళాశాలలో జరిగింది.
వసతుల గురించి అడిగితే దుర్భాషలు, దెబ్బలు
ఎక్కువ మాట్లాడితే భోజనం పెట్టబోమని వేధింపులు
ప్రిన్సిపాల్‌ను తొలగించాలని విద్యార్థినుల రాస్తారోకో
సూర్యాపేట రూరల్, జూలై 4: ప్రిన్సిపాల్ తమపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఓ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ విద్యార్థినులు రాస్తారోకోకు దిగారు. ఆ మహిళా ప్రిన్సిపాల్‌ను వెంటనే మార్చాలంటూ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఈ ఘటన సుర్యాపేట జిల్ల్లా కేంద్రం సమీపంలోని బాలెంలలోని డిగ్రీ కళాశాలలో జరిగింది. దాదాపు 400 మంది విద్యార్థినులు కళాశాల ఎదుటనున్న మట్టిరోడ్డుపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వసతిగృహాంలో సరైన భోజనం పెట్టడం లేదని వాపోయారు. కనీస వసతులు కూడా కల్పించడం లేదని, అదేమని అడిగితే ప్రిన్సిపాల్ సరోజ తమను దుర్భాషలాడుతోందని, ఒక్కోసారి చేయి కూడా చేసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మీకు సీట్లిచ్చి భోజనం పెడుతున్నామని, ఎక్కువ మాట్లాడితే ఆహారం కూడా పెట్టబోమని ప్రిన్సిపాల్ వేధించారని చెప్పారు. కళాశాలలో జరిగిన విషయాలు బయటికి చెబితే మీ పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డారని విద్యార్థినులు తెలిపారు. కొద్దిరోజులుగా వేధింపులను ఎక్కువవ్వడంతో విసుగెత్తి ఆందోళన చేపట్టాల్సి వచ్చిందన్నారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్(ఆర్‌సీవో) అరుణకుమారి అక్కడికి చేరుకుని విద్యార్థినులతో చర్చించారు. ప్రిన్సిపాల్‌ను తాత్కాలికంగా తొలగించి, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని, విచారణ కమిటీ ఏర్పాటు చేసి అధికారులకు నివేదిక అందిస్తామన్నారు.