Share News

TG: ఎండలు.. పిడుగులు!

ABN , Publish Date - Jun 03 , 2024 | 05:05 AM

మాడు పగిలే ఎండ.. ఉక్కిరిబిక్కిరి చేసిన వాన! రెండూ ఒకేరోజు విరుచుకుపడటంతో ఆ కష్టనష్టాలు అన్నీఇన్నీకావు! ఎండదెబ్బకు ఇబ్బందిపడ్డ జనం పిడుగుపాట్ల శబ్దాలకూ వణికిపోయారు! వడదెబ్బ కొందరి ప్రాణాలు తీస్తే.. సాయంత్రానికి ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన చెట్లను కూకటివేళ్లతో పెకిలించి.. విద్యుత్తుస్తంభాలను పడగొట్టి.. ఇళ్లపై రేకులను గల్లంతు చేసి.. క్షణాల్లో లోతట్టు కాలనీలను జలమయంచేసి భీతావహ పరిస్థితిని సృష్టించింది.

TG: ఎండలు.. పిడుగులు!

  • మధ్యాహ్నం దాకా మాడు పగిలే ఎండ

  • తర్వాత ఉరుములు, మెరుపులతో జోరువాన

  • భిన్నవాతావరణ పరిస్థితితో జనం ఉక్కిరిబిక్కిరి

  • సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో 44.2 డిగ్రీలు

  • వడదెబ్బకు వేర్వేరు చోట్ల 10 మంది మృతి

  • జడివానకు కూలిన చెట్లు.. ఇళ్ల పైకప్పులు గల్లంతు

  • మంచిర్యాల జిల్లాలో పిడుగుపడి 8 మేకల మృతి

  • హైదరాబాద్‌ జీడిమెట్లలో 4.6 సెం.మీ. వర్షం

  • రాష్ట్రానికి నాలుగు రోజుల్లో నైరుతి

  • నేడు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు

  • దక్షిణ భారతంలో కుండపోతలే

  • ఉత్తరాదికీ మండే ఎండల నుంచి ఉపశమనం

  • గణనీయంగా పడిపోయిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు

  • మరింత చురుకుగా రుతుపవనాలు: స్కైమెట్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): మాడు పగిలే ఎండ.. ఉక్కిరిబిక్కిరి చేసిన వాన! రెండూ ఒకేరోజు విరుచుకుపడటంతో ఆ కష్టనష్టాలు అన్నీఇన్నీకావు! ఎండదెబ్బకు ఇబ్బందిపడ్డ జనం పిడుగుపాట్ల శబ్దాలకూ వణికిపోయారు! వడదెబ్బ కొందరి ప్రాణాలు తీస్తే.. సాయంత్రానికి ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన చెట్లను కూకటివేళ్లతో పెకిలించి.. విద్యుత్తుస్తంభాలను పడగొట్టి.. ఇళ్లపై రేకులను గల్లంతు చేసి.. క్షణాల్లో లోతట్టు కాలనీలను జలమయంచేసి భీతావహ పరిస్థితిని సృష్టించింది. భిన్న వాతావరణ పరిస్థితులతో ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న బీభత్సమిది. మండుతున్న ఎండల మఽఽధ్యే జోరుగా వర్షం పడింది. ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌, వాంకిడి, బెజ్జూరు, సిర్పూర్‌ (టి), పెంచికలపేట, చింతనమాలెపల్లి, దహెగాం మండలాల్లో భారీ వర్షం పడింది. ఆసిఫాబాద్‌ మండలం జెండాగూడలో ఓ ఇంటిపై రేకులు ఎగిరిపోయా యి. వాంకిండి మండలంలోని పలుగ్రామాల్లో ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి.


ఊర్లో వాగుపై వేసిన తాత్కాలిక రోడ్డు ప్రవాహానికి కొట్టుకుపోయింది. బెజ్జూరు మండలంలో విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, చెన్నూరు, అన్నారం, కన్నెపల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. మంచిర్యాల జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలం నాగ్వారం సమీపంలో వాగు ఉధృతికి ఓ కారు కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు వాహనం లోపల ఉన్న నలుగురిలో వెంటనే ఇద్దరు సురక్షితంగా బయటపడగా.. కారును కాపాడుకునే క్రమంలో మరో ఇద్దరు ప్రవాహ తీవ్రతకు కొట్టుకుపోయి. చెట్టును పట్టుకొని ఒడ్డుకు చేరారు. బంట్వారం మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. బంట్వారం బస్టాండ్‌ వరద నీటితో నిండిపోయింది. అనంతగిరి ఘాట్‌రోడ్డులో భారీ వర్షానికి చెట్లు విరిగిపడగా రాకపోకలకు ఇబ్బంది కలిగింది.


యాదాద్రి జిల్లా బీఎన్‌ తిమ్మాపూర్‌, వీరవెల్లి, ముస్త్యాలపల్లి, చీమలకొండూరు గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు పడిపోయాయి. హనుమకొండ జిల్లాలో హనుమకొండ, కాజీపేట, వరంగల్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం తీవ్రతకు పలుచోట్ల విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగింది. కాగా, సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో సోమవారం 44.2, దొంగల ధర్మారంలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైం ది. అయితే సాయంత్రానికి మెదక్‌, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నల్లగొండ జిల్లా మనుగోడు మండలం గుడపూర్‌లో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 10 మంది మృతిచెందారు. మంచిర్యాల జిల్లా మొక్కంపల్లిలో పిడుగుపాటుకు 8 మేకలు మృతిచెందాయి.


హైదరాబాద్‌లో కాలనీల్లోకి వరద

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఈదురు గాలుల తీవ్రతకు గ్రేటర్‌ పరిధిలో 10 చెట్లు కూలిపోయాయి. జీడిమెట్లలో అత్యధికంగా 4.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్‌ అయింది. కాలనీల్లోకి వరద నీరు చేరి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెట్ల కొమ్మలు విద్యుత్తు తీగలపై పడటంతో పలుచోట్ల చీకట్లు నెలకొన్నాయి.


దేశవ్యాప్తంగా ఈ వేసవిలో వడదెబ్బకు 56 మంది మృతి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌ : ఈ వేసవిలో వడదెబ్బకు దేశవ్యాప్తంగా మొత్తం 56 మంది మృతి చెందారు. వారిలో 46 మంది ఒక్క మే నెలలోనే మరణించారు. కేంద్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్‌లో 14 మంది చనిపోగా మహారాష్ట్రలో 11 మంది, ఆంధ్రప్రదేశ్‌లో ఆరుగురు, రాజస్థాన్‌లో ఐదుగురు మృతి చెందారు. అయితే. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, ఢిల్లీలో నమోదైన వడదెబ్బ మృతుల వివరాలను గణాంకాల్లో చేర్చలేదని సమాచారం.


మరో 4 రోజుల్లో నైరుతి

రాష్ట్రం వైపు నైరుతి వచ్చేస్తోంది. జూన్‌ 6-8 మధ్య రాష్ట్రంలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర సంచాలకులు డాక్టర్‌ కే. నాగరత్న తెలిపారు. జూన్‌ 11 నాటికి తెలంగాణ వ్యాప్తంగా విస్తరించే అవకాశాలున్నాయని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఫ్రీమాన్‌సూన్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయని వివరించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజిగిరి జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Updated Date - Jun 03 , 2024 | 09:04 AM