Share News

Supreme Court: మాతో ఆటలొద్దు!

ABN , Publish Date - Aug 22 , 2024 | 04:16 AM

ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని కోరుతూ పిటిషన్‌ వేసిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.

Supreme Court: మాతో ఆటలొద్దు!

  • రాజకీయ కక్షలకు కోర్టులను వేదిక చేసుకోవద్దు

  • వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్లపై సుప్రీంకోర్టు ఫైర్‌

  • ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబును

  • నిందితుడిగా చేర్చాలన్న పిటిషన్‌ తిరస్కరణ

  • సీబీఐ దర్యాప్తునకూ నిరాకరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని కోరుతూ పిటిషన్‌ వేసిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆధార రహిత అంశాలను తీసుకొచ్చి తమతో ఆటలాడొద్దని హెచ్చరించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆయన వేసిన మరో పిటిషన్‌ను కూడా తోసిపుచ్చింది. ఈ మేరకు జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.


ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని ఆళ్ల గతంలో ఏసీబీ కోర్టులో ప్రైవేటు కంప్లయింట్‌ దాఖలు చేశారు. కోర్టు దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఏసీబీని ఆదేశించింది. దీనిపై చంద్రబాబు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు ఆదేశాలను కొట్టివేస్తూ హైకోర్టు 2016 డిసెంబరు 9న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఆళ్ల సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేశారు. దాంతో పాటు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని మరో పిటిషన్‌ వేశారు.


ఈ రెండు వ్యాజ్యాలు బుధవారం విచారణకు రాగా.. ఈ కేసులో ఇప్పటికే రెండు చార్జిషీట్లు దాఖలయ్యాయని, జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలూ లేవని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా, న్యాయవాదులు గుంటూరు ప్రభాకర్‌, ప్రమోద్‌ కుమార్‌, ప్రేరణ విచారణకు హాజరయ్యారు. తొలుత ఆళ్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే రూ.5 కోట్లు, ఓటు వేయకుండా గైర్హాజరైతే రూ.2 కోట్లు ఇస్తామని చంద్రబాబు తరఫున అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బేరసారాలు జరిపారని.. దీనికి సంబంధించి కాల్‌ రికార్డింగులు ఉన్నాయని తెలిపారు.


ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో వేరే కేసులు కూడా ఉన్నాయని చెబుతూ ఆ జాబితాను ధర్మాసనానికి అందజేశారు. అయితే లూథ్రా అభ్యంతరం తెలిపారు. ఆ కేసులకు, ఇప్పుడు వాదనలు జరుగుతున్న వ్యాజ్యాలకు సంబంఽ దం లేదన్నారు. కేసుల జాబితాను పరిశీలించిన తర్వాత పిటిషనర్‌ ఆళ్లపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కోర్టులను వేదిక చేసుకోవద్దని హెచ్చరించింది. ఆధార రహిత అంశాలను తీసుకొచ్చి కోర్టుతో ఆటలాడుకోవద్దని తీవ్ర వాఖ్యలు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలూ కనిపించడం లేదని పేర్కొంది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఆళ్ల వేసిన ఎస్‌ఎల్‌పీని డిస్మిస్‌ చేసేందుకు ధర్మాసనం సంసిద్ధత వ్యక్తంచేయగా.. దానిని ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన తరఫు న్యాయవాది తెలిపారు.

Updated Date - Aug 22 , 2024 | 04:16 AM