Share News

Teenmaar Mallanna: పట్టభద్రుల ఎమ్మెల్సీగా మల్లన్న..

ABN , Publish Date - Jun 08 , 2024 | 04:32 AM

ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ బీఆర్‌ఎ్‌సకు భంగపాటు తప్పలేదు. సిటింగ్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోయింది.

Teenmaar Mallanna: పట్టభద్రుల ఎమ్మెల్సీగా మల్లన్న..

  • కాంగ్రెస్‌ అభ్యర్థిని వరించిన విజయం

  • నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో వీడిన ఉత్కంఠ

  • ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత కూడా మల్లన్నకే ఆధిక్యం

  • సీఈవో అనుమతితో విజేతగా ప్రకటించిన ఆర్వో.. సిటింగ్‌ సీటును కోల్పోయిన బీఆర్‌ఎస్‌

నల్లగొండ, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ బీఆర్‌ఎ్‌సకు భంగపాటు తప్పలేదు. సిటింగ్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోయింది. శానసమండలి నల్లగొండ- ఖమ్మం- వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కుమార్‌ విజయం సాధించారు. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు అనంతరం కూడా ప్రధాన ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగు రాకేశ్‌రెడ్డి కంటే భారీ ఆధిక్యంలో ఉండడంతో మల్లన్నను విజేతగా ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థులతోపాటు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్‌ తర్వాత కూడా మల్లన్న దాదాపు 18 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కానీ, కోటా ఓటు లభించకపోవడంతో ఈసీ ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్న తర్వాత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి హరిచందన.. మల్లన్నను విజేతగా ప్రకటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరపున జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.


ఈ స్థానానికి మే 27న పోలింగ్‌ జరగ్గా.. బుధవారం ఉదయం కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 4,63,839 ఓట్లకు 3,36,013 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 25,824 ఓట్లు చెల్లకుండా పోయాయి. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యేటప్పటికి కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 1,22,813 ఓట్లు దక్కగా, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 1,04,248, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 43,318, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌కు 29,697 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యంలో ఎవరికీ ‘కోటా’ ఓటు 1,55,095 రాకపోవడంతో ఎలిమినేషన్‌ పద్ధతిలో ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టారు. శుక్రవారం రాత్రి వరకు మూడో స్థానంలో ఉన్న ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్‌ ప్రక్రియ కొనసాగగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న దాదాపు 18వేల ఓట్లతో ముందంజలో ఉన్నారు. కోటా ఓటు రాకపోవడంతో ఎన్నికల నిబంధనల ప్రకారం మల్లన్నను విజేతగా ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)ని కోరుతూ రిటర్నింగ్‌ అధికారి దాసరి హరిచందన లేఖ పంపారు. చివరకు సీఈవో అనుమతితో ఎమ్మెల్సీగా మల్లన్న గెలుపొందినట్లు ఆర్వో ప్రకటించారు.


బీఆర్‌ఎస్‌ ఆశలు గల్లంతు

స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కుమార్‌, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేట్‌ అయితే... వారి బ్యాలెట్లలో తమకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు అధికంగా వస్తాయని భావించిన బీఆర్‌ఎస్‌ ఆశలు గల్లంతయ్యాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి బీజేపీ క్యాడర్‌తో సన్నిహిత సంబంధాలు ఉండడం, ఆయన ఇటీవలి వరకు బీజేపీలో క్రియాశీలకంగా పని చేసి ఉన్న నేపథ్యంలో బీజేపీకి మొదటి ప్రాధాన్య ఓటేసిన ఓటర్లలో సింహభాగం ద్వితీయ ప్రాధాన్య ఓటును రాకేశ్‌రెడ్డికి వేస్తారని భావించారు. అయితే, ఆ ఓట్లు రాకేశ్‌కు ఏకపక్షంగా పడలేదు. రాకేశ్‌తో సమానంగా మల్లన్నకు ఓట్లు దక్కాయి. చివరి వరకూ ఆధిక్యంలో ఉన్న మల్లన్ననే విజయం వరించింది.


మూడో ప్రయత్నంలో ఎమ్మెల్సీగా ఎన్నిక

జర్నలిస్టుగా, ప్రశ్నించే గొంతుకగా చిరపరిచితుడైన తీన్మార్‌ మల్లన్న ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో ఎమ్మెల్సీగా విజయం సాధించారు. 2015లో మొదటిసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆయన బరిలో నిలి చి ఓటమిపాలయ్యారు. ఆతర్వాత 2021లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి బీఆర్‌ఎ్‌సకు బలమైన పోటీ ఇచ్చారు. మూడో ప్రయత్నంలో ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉండి విజయం సాధించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో నేరుగా కొట్లాడిన క్రమంలో మల్లన్నపై 59వరకు కేసులు నమోదయ్యాయి.


ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : మల్లన్న

విజయం ఖాయం కావడంతో రాత్రి పది గంటల సమయంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లన్న కౌంటింగ్‌ హాల్‌ బయటకు వచ్చి విజయసంకేతం చూపారు. ద్వితీయ ప్రాఽధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత కూడా తాను 18వేల పైచిలుకు మెజార్టీతో ఉన్నానని, లాంఛనాలు పూర్తయ్యాక అధికారికంగా ప్రకటిస్తారని వెల్లడించారు. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రకటన రాకముందే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు జరుపుకోగా, సోషల్‌మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది.


నైతిక విజయం నాదే: రాకేశ్‌రెడ్డి

తాను సాంకేతికంగా ఓడినా, నైతికంగా తనదే గెలుపని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ చట్టసభలో అడుగుపెట్టలేకపోయినా ప్రజల తరుపున ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటానని ప్రకటించారు. తన గెలుపుని అన్ని రాజకీయ పార్టీలు కోరుకున్నాయని, జేడీలక్ష్మీనారాయణవంటి మేధావులు తనకు మద్దతు ఇచ్చారని తెలిపారు. వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. 12ఏళ్లుగా ప్రజల కోసం పనిచేస్తున్నానని, బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఎన్నికలో పోరాటపటిమ చూపారని కొనియాడారు.

Updated Date - Jun 08 , 2024 | 04:32 AM