Hyderabad: చిన్న చిన్న సమస్యలపై పేచీలు వద్దు..
ABN , Publish Date - Jul 07 , 2024 | 03:49 AM
ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, భావోద్వేగాలు వ్యాపించేందుకు తావులేకుండా విభజన సమస్యలను పరిష్కరించుకుందామని తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు నిర్ణయించారు.
మనోభావాలూ దెబ్బతినకుండా పరిష్కరిద్దాం
ముందు రెండైనా చక్కదిద్దితే సానుకూలత
70 అంశాలు.. అధికారుల స్థాయిలోనే 50
మిగతా 20 మంత్రుల కమిటీల ద్వారా..
అప్పటికీ ఇంకా అవసరమైతే కేంద్రం వద్దకు..
సీఎంలు రేవంత్, చంద్రబాబు ఏకాభిప్రాయం
ఒకేసారి సమస్యలన్నీ తీరిపోతాయని అనుకోవద్దు. ఒక్కోదానిని నెమ్మదిగా పరిష్కరించుకుంటూ వెళ్లాలి. ఇక సమస్యలు తీరవు అన్న వాతావరణం ఉండొద్దు. సకాలంలో పరిష్కారం కాక.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు చాలా నష్టపోయాయి.
ఇకమీదటనైనా సాగదీయొద్దు.
- సమావేశంలో చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 6(ఆంధ్రజ్యోతి): ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, భావోద్వేగాలు వ్యాపించేందుకు తావులేకుండా విభజన సమస్యలను పరిష్కరించుకుందామని తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు నిర్ణయించారు. చిన్న చిన్న సమస్యలపై పేచీ పడకుండా, పూర్తి సుహృద్భావ వాతావరణంలో ముందుకెళ్లాలన్న అభిప్రాయానికి వచ్చారు. ముందుగా కొన్ని విషయాలను చక్కదిద్దితే, రెండు రాష్ట్రాల్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందనే భావన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రెండింటినైనా పరిష్కరించి ముందుకెళ్లాలని సీఎంలు అధికారులను ఆదేశించారు.
కాగా, అధికారులు, మంత్రుల స్థాయి కమిటీలతో పరిష్కారం కాని సమస్యలుంటే.. కేంద్రం వద్దకు తీసుకెళ్లాలన్న ప్రతిపాదనను తెచ్చారు. శనివారం ప్రజాభవన్‌లో గంటా 45 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన సీఎంల సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. రెండు రాష్ట్రాల మధ్య పరిష్కరించుకోవాల్సిన 70 అంశాలను గుర్తించారు. ఇందులో 50 సమస్యలను ఉన్నతాధికారుల స్థాయిలో తేల్చేయవచ్చని, మిగతావాటిని మంత్రుల కమిటీలతో పరిష్కరించాలని నిర్ణయించారు. అప్పటికీ కాకపోతే.. కేంద్రం వద్దకు వెళ్దామన్న ఆలోచనకు వచ్చారు.
ఎవరికీ ఇబ్బంది రావొద్దు..
కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో తాము భాగస్వాములమైనందున, కేంద్రం వద్దకు వెళ్లాల్సి వస్తే.. తాను తీసుకెళ్తానంటూ చంద్రబాబు చెప్పగా రేవంత్ అంగీకరించారు. ‘నాకు తెలంగాణ, ఏపీ ప్రజల మనోభావాలు తెలుసు. వాటిని దెబ్బతీయొద్దు. ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకూడదు. పూర్తి సమ్మతంతో సమస్యలను పరిష్కరించుకుందాం’’ అని బాబు సూచించారు. దీంతోనే సమస్యల పరిష్కారానికి మంత్రులు, అధికారుల కమిటీలను వేద్దామంటూ రేవంత్ ప్రతిపాదించారు. దీనికి బాబు ఆమోదం తెలిపారు. ఈ కమిటీల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను తామే (సీఎంలు) ఆమోదించాలన్న నిర్ణయానికి వచ్చారు. 50 సమస్యలపై చర్చించేందుకు రెండు వారాల్లో అధికారుల కమిటీ భేటీ కావాలని ఆదేశించారు. ఆ తర్వాత మంత్రుల కమిటీ కూడా సమావేశమవుతూ సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుందని సీఎంలు పేర్కొన్నారు. ‘‘ఒకేసారి సమస్యలన్నీ తీరిపోతాయని అనుకోవద్దు. ఒక్కోదానిని నెమ్మదిగా పరిష్కరించుకుంటూ వెళ్లాలి. ఇక తీరవు కావు అన్న వాతావరణం ఉండకూడదు. సకాలంలో పరిష్కారం కాక.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు చాలా నష్టపోయాయి,. ఇకమీదటనైనా సాగదీయొద్దు’’ అని అభిప్రాయపడ్డారు.
మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుదాం: బాబు
మాదకద్రవ్యాలు పెద్ద మహమ్మారిలా మారాయని ఇద్దరు సీఎంలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణలో ఉక్కుపాదం మోపుతున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారు. పూర్తిగా నిర్మూలించేందుకు ఆంధ్రప్రదేశ్ సహకారం కావాలని కోరారు. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణకు గంజాయి స్మగ్లింగ్ అవుతోందని.. కలిసి పనిచేస్తే డ్రగ్స్‌ను నిరోధించవచ్చని ప్రతిపాదించారు. దీనికి చంద్రబాబు అంగీకరించారు. ‘‘డ్రగ్స్‌ను ఎక్కడైనా నిర్మూలించాల్సిందే. దీనిని కలిసికట్టుగా ఎదుర్కొందాం’’ అని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం అదనపు డీజీల స్థాయిలో ఒక సమన్వయ కమిటీని వేయాలని నిర్ణయించారు.
మీ స్ఫూర్తితో మళ్లీ జల సంరక్షణ: రేవంత్
సమావేశం అనంతరం చంద్రబాబు, ఏపీ మంత్రులకు రేవంత్‌రెడ్డి ప్రజాభవన్‌లో రాత్రి భోజనం ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంలోనూ సీఎంలు పలు అంశాల గురించి మాట్లాడుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై చంద్రబాబు ఆరా తీశారు. ఇప్పటికే నగరానికి రీజనల్ రింగ్ రోడ్డు వచ్చిందని, దీనికి, ఔటర్ రింగు రోడ్డుకు మధ్యలో రేడియల్ రోడ్లు నిర్మించాలని నిర్ణయించామని రేవంత్ చెప్పారు. ‘‘మీరు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు జల సంరక్షణకు పలు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు 1,500 అడుగుల లోతుకెళ్లినా బోర్లలో నీరు పడడం లేదు. అందుకే మళ్లీ జల సంరక్షణ చేపట్టాలని నిర్ణయించాం. ఈ దిశగా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడతాం’’ అని రేవంత్ వివరించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు, వరద పోటెత్తి హైదరాబాద్‌లో ఎక్కడికక్కడ నీరు నిలుస్తోందని, దీని పరిష్కారానికి కూడా తగిన చర్యలు చేపట్టాలనుకుంటున్నట్లు తెలిపారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు గురించి చంద్రబాబు ఆరా తీశారు. ఇప్పటికే ఈ పనులు చేపట్టామని, మూసీ పరివాహక ప్రాంతాన్ని మొత్తం సుందరీకరిస్తామని రేవంత్ బదులిచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం గురించి బాబు అడగ్గా, ఈ పథకం బాగా కొనసాగుతోందని, మహిళల నుంచి అభినందనలు వస్తున్నాయని రేవంత్ చెప్పారు. కాగా, కార్మిక సంక్షేమ నిధి సమస్యను అధికారుల కమిటీ పరిష్కరిస్తుందని సీఎంలు స్పష్టం చేశారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏపీలో కలిపిన ఐదు గ్రామాలు, విద్యుత్తు బకాయిలు, ఇతర సంస్థలకు సంబంధించిన పంపకాల వ్యవహారాలను అధికారుల కమిటీ పరిశీలించి, ఆమోదయోగ్య ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంది.