Share News

TG Assembly: రేవంత్‌ను మించి... శాసససభలో 5.45 గంటలు మాట్లాడిన అక్బరుద్దీన్‌

ABN , Publish Date - Aug 03 , 2024 | 04:08 AM

శాసనసభ సమావేశాలు వాడీవేడిగా సాగాయి. అధికార, ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్టు సభలో తలపడ్డాయి. జూలై 23న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం వరకు రెండ్రోజుల విరామ దినాలతో కలిపి తొమ్మిది రోజుల పాటు సాగాయి.

TG Assembly: రేవంత్‌ను మించి...  శాసససభలో 5.45 గంటలు మాట్లాడిన అక్బరుద్దీన్‌

  • ప్రధాన ప్రతిపక్ష నేత స్పీచ్‌.. నిల్‌

హైదరాబాద్‌, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): శాసనసభ సమావేశాలు వాడీవేడిగా సాగాయి. అధికార, ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్టు సభలో తలపడ్డాయి. జూలై 23న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం వరకు రెండ్రోజుల విరామ దినాలతో కలిపి తొమ్మిది రోజుల పాటు సాగాయి. ఈ తొమ్మిది రోజుల్లో మొత్తం 65.33 గంటల పాటు సభ కార్యకలాపాలు నడిచాయి. శాసనసభ బిజినెస్‌ రూల్‌ 13 ప్రకారం శాసనసభ సాధారణ సమయం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 2 గంటల వరకు ఉంటుంది. ఈ లెక్కన సభ జరిగిన సమయాన్ని లెక్కిస్తే 16 రోజుల పాటు సమావేశాలు జరిగాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యాలయం శుక్రవారం సాయంత్రం ఓ బులెటిన్‌ విడుదల చేసింది.


బులెటిన్‌ ప్రకారం.. ఈ సమావేశాల్లో ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ అందరి కంటే అత్యధికంగా 5.41 గంటల పాటు సభలో మాట్లాడారు. సభానాయకుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 4.54 గంటలు పాటు ప్రసంగించారు. మొత్తం 9 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో ఒకే రోజు సభకు వచ్చిన ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌.. అసలు మైకే ముట్టుకోలేదు. సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు 2.35 గంటలు, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి 1.26 గంటల పాటు మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షం నుంచి అత్యధికంగా కేటీఆర్‌ 2.56 గంటల పాటు మాట్లాడగా, హరీశ్‌ రావు 2.16 గంటలు ప్రసంగించారు. మాజీ మంత్రి జగదీ్‌షరెడ్డి 1.10 గంటలు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి 1.7 గంటల పాటు మాట్లాడారు.


  • కేసీఆర్‌ ఇలా వచ్చి అలా వెళ్లారు: దుద్దిళ్ల

శాసనసభకు తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకూ పద్దులపై మాట్లాడే అవకాశం ఇచ్చామని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీథర్‌బాబు వెల్లడించారు. సభ వాయిదా అనంతరం సీఎల్పీ మీడియాహాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ ను ప్రవేశపెట్టిందని, మొత్తం 38 శాఖల డిమాండ్లను అసెంబ్లీ ఆమోదించిందని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు 17 గంటలకు పైగా అసెంబ్లీలో చర్చను నిర్వహించామని, అందులో 24 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారని అన్నారు.


ఐదు ప్రభుత్వ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపిందని, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశామని వెల్లడించారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారన్నారు. కేంద్ర బడ్జెట్‌, ఎస్సీ వర్గీకరణపై ఆయన తన వాణి వినిపిస్తారని ఆశించానని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వడంలో ప్రతిపక్షం విఫలమైందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు క్రియాశీలకంగా చర్చల్లో పాల్గొన్నారన్నారు. అసెంబ్లీలో ఆమోదించడం ద్వారా జాబ్‌ క్యాలెండర్‌ కు చట్టబద్థత కల్పించామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Updated Date - Aug 03 , 2024 | 04:08 AM