Share News

Pharma Clusters: సమీకృత గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్లు 9 జిల్లాలు.. 20 వేల ఎకరాలు

ABN , Publish Date - Aug 09 , 2024 | 02:54 AM

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సమీకృత గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్ల ప్రాజెక్టు పట్టాలెక్కింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 20 వేల ఎకరాల్లో ఒకేచోట హైదరాబాద్‌ ఫార్మా సిటీని ఏర్పాటు చేసేందుకు గత సర్కారు చర్యలు తీసుకోగా.. ఆ ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది.

Pharma Clusters: సమీకృత గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్లు 9 జిల్లాలు.. 20 వేల ఎకరాలు

  • అన్నీ ఓఆర్‌ఆర్‌కు 50-60 కి.మీ. లోపలే

  • కొడంగల్‌ నుంచి ప్రారంభించిన ప్రభుత్వం

  • దుద్యాలలో 1,373 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్‌

  • త్వరలో నల్లగొండ, మెదక్‌ జిల్లాల్లోనూ

హైదరాబాద్‌, వికారాబాద్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సమీకృత గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్ల ప్రాజెక్టు పట్టాలెక్కింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 20 వేల ఎకరాల్లో ఒకేచోట హైదరాబాద్‌ ఫార్మా సిటీని ఏర్పాటు చేసేందుకు గత సర్కారు చర్యలు తీసుకోగా.. ఆ ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. భూ సేకరణ ఇబ్బందులు, ఫార్మా పరిశ్రమలతో కాలుష్య సమస్యలపై స్థానికుల అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యామ్నాయంగా వేర్వేరుచోట్ల సమీకృత గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. జనవరిలో జరిగిన బయో ఏసియా అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికను ప్రకటించారు. గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేసేందుకు వికారాబాద్‌, మెదక్‌, నల్లగొండ జిల్లాలను ఎంపిక చేసింది.


ఒక్కో క్లస్టర్‌లో మూడు నుంచి నాలుగు ఫార్మా విలేజ్‌లు ఉంటాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియకు సీఎం నియోజకవర్గం కొడంగల్‌ నుంచి తొలి అడుగులు పడ్డాయి. వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాల్లో 1,373 ఎకరాల్లో ఫార్మా క్లస్టర్‌ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. తొలుత లగచర్లలో 632.26 ఎకరాల సేకరణకు గురువారం నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ భూములను 580 మంది రైతుల నుంచి సేకరించనున్నారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వికారాబాద్‌ జిల్లా 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారులకు అతి సమీపంలో ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తే పారిశ్రామికవేత్తలు ముందుకువస్తారని, తద్వారా ఆ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.


  • ఒక్కో జిల్లాలో 2వేల ఎకరాల్లో

ప్రభుత్వం పేర్కొన్న పది ఫార్మా క్లస్టర్లు ఔటర్‌ రింగు రోడ్డుకు 50-60 కి.మీ. లోపల ఏర్పాటు కానున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉంటే ఫార్మా కంపెనీలకు రవాణాకు అత్యంత అనుకూలంగా ఉంటుందని సర్కారు ఆలోచిస్తోంది. ప్రతి జిల్లాలోని ప్రతి క్లస్టర్‌ 1000-2000 ఎకరాల్లో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం 10 క్లస్టర్లను 20వేల ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు.


గుర్తించిన జిల్లాల్లో వికారాబాద్‌తో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండలు ఉన్నాయి. వికారాబాద్‌ అనంతరం మెదక్‌, నల్లగొండలలో భూసేకరణ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. భూములు ఇచ్చిన రైతులకు నివాసానికి 125 చదరపు అడుగుల స్థలంతో పాటు పరిశ్రమల్లో ఇంటికో ఉద్యోగం ఇవ్వనున్నారు. భూమి ధరను ప్రభుత్వం నిర్ణయించనుంది.

Updated Date - Aug 09 , 2024 | 02:54 AM