Kaleshwaram: మేడిగడ్డ ఎగువనరాతికట్ట!
ABN , Publish Date - May 21 , 2024 | 04:25 AM
ప్రాణహితకు వర్షాకాలం వచ్చే వరద తగ్గుముఖం పట్టాక మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన తాత్కాలికంగా రాతికట్ట కట్టి, నదీ ప్రవాహాన్ని లక్ష్మీ పంప్‌హౌ్‌సకు మళ్లించి, అన్నారం బ్యారేజీలోకి ఎత్తిపోయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రస్తుతం నీటిని నిల్వ చేసే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
2.5 మీటర్ల ఎత్తుతో తాత్కాలికంగా..
గ్యాబియన్ వాల్ పద్ధతిలో
నదీ ప్రవాహంలో నిర్మాణం
ప్రాణహిత నీటిని మళ్లించి పంపింగ్
నెలలో 3 బ్యారేజీల మరమ్మతు పూర్తి
డిసెంబరులోగా మేడిగడ్డ వద్ద పంపింగ్
అన్నారం, సుందిళ్లలో వానాకాలంలోనే
పరిస్థితిపై రెండేసి సంస్థలతో పరిశీలన
హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): ప్రాణహితకు వర్షాకాలం వచ్చే వరద తగ్గుముఖం పట్టాక మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన తాత్కాలికంగా రాతికట్ట కట్టి, నదీ ప్రవాహాన్ని లక్ష్మీ పంప్‌హౌ్‌సకు మళ్లించి, అన్నారం బ్యారేజీలోకి ఎత్తిపోయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రస్తుతం నీటిని నిల్వ చేసే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్యాబియన్ వాల్ పద్ధతిలో ఇనుప వల మధ్యలో రాళ్లను కూర్చి 2.5 మీటర్ల ఎత్తుతో ఈ కట్టను నిర్మిస్తారు. మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగిపోయి, మరమ్మతులు, బ్యారేజీ పునరుద్ధరణ ఇప్పట్లో కుదిరే పని కాకపోవడంతో రాతి గోడ నిర్మాణం నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సీజన్‌లో మేడిగడ్డ ఎగువన ఉన్న పంప్‌హౌ్‌సల నుంచి పంపింగ్‌ను యుద్ధప్రాతిపదికన చేపట్టి, నీటిని ప్రాజెక్టు పరిధిలోని జలాశయాల్లో నింపి, తాగు, సాగు నీటి అవసరాలకు అందించనున్నారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మూడు బ్యారేజీల పరిస్థితిపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) ఇచ్చిన మధ్యంతర నివేదికను ఈ సమావేశంలో చర్చించారు. ఏటా గోదావరి బేసిన్‌లో నవంబరు దాకా భారీగా వరదలు ఉంటాయని అధికారులు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో బ్యారేజీల పరిస్థితి ఏమిటి? వాటి పునరుద్ధరణకు ఏం చేయాలి? అనే విషయమై ఏకకాలంలో మూడు కేంద్ర సంస్థలతో అధ్యయనం చేయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఢిల్లీకి చెందిన కేంద్ర మృత్తిక, ఇతర భూపదార్థాల పరిశోధన కేంద్రం(సీఎ్‌సఎంఆర్‌ఎస్), పుణెలోని కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్), హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఏ) ఈ అధ్యయనాలు చేపడతాయి.
ఈ మూడు సంస్థలతో బ్యారేజీలకు సంబంధించి భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలు చేయించాలని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) ఇప్పటికే చెప్పింది. ఒక్కో బ్యారేజీని ఏకకాలంలో రెండేసి కేంద్ర సంస్థలతో విడివిడిగా అధ్యయనం చేయిస్తారు. వాటితో పాటుగా మూడు బ్యారేజీల్లో లీకేజీలను అరికట్టడానికి, డ్యామేజీ మరింత పెరగకుండా చూడటానికి తాత్కాలిక మరమ్మతులను చేపడతారు. అధ్యయనం, మరమ్మతులు సమాంతరంగా చేపట్టి, నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. తద్వారా మేడిగడ్డ ఎగువన తక్కువ సమస్యలు ఉన్న సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నెల రోజుల్లోనే నీటి నిల్వకు సిద్ధమవుతాయి. అన్నారం, సుందిళ్లలో సీపేజీల కట్టడికి సిమెంట్/ కాంక్రీట్ మిశ్రమంతో చర్యలు చేపడితే వానాకాలంలోనే వాటి నుంచి నీటిని పంపింగ్ చేసే అవకాశం దొరుకుతుందని అధికారులు చెప్పారు. మేడిగడ్డలో బ్యారేజీ ఎగువ భాగంలో తాత్కాలికంగా కట్టను కట్టి, వచ్చిన వరదను వచ్చినట్లే పంప్‌హౌ్‌సలోకి మళ్లించి, పంపింగ్ చేస్తే ప్రయోజనం ఉంటుందని అధికారులు ప్రతిపాదించగా ఎంత ఖర్చవుతుందని మంత్రులు ఆరా తీశారు. గ్యాబియన్ రాక్‌వాల్ పద్ధతిలో తక్కువ ఖర్చుతో దీన్ని పూర్తి చేయవచ్చని అధికారులు చెప్పారు. కేంద్ర ఆనకట్టల భద్రత సంస్థ సలహా తీసుకొని అక్టోబరు లేదా నవంబరులో వరద తగ్గుముఖం పట్టగానే గ్యాబియన్ వాల్ పద్థతిలో కట్ట నిర్మాణ పనులు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. సాధారణంగా మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసే అవసరం డిసెంబరులో వస్తుంది. సుందిళ్ల, అన్నారం బ్యారేజీల మరమ్మతులు వచ్చే నెల రోజుల్లోనే పూర్తి చేయాలని నిర్ణయించినందున డిసెంబరులో ఎత్తిపోతలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆనకట్టల భద్రత జాతీయ సంస్థ నివేదికను పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించారు. పెద్దగా సమస్యలు లేని సుందిళ్లలో ఇప్పటికే మరమ్మతులు మొదలయ్యాయి.
ఖర్చంతా నిర్మాణ సంస్థలదే
బ్యారేజీల మరమ్మతుల బాధ్యత నిర్మాణ సంస్థలదేనని మంత్రివర్గం స్పష్టం చేసింది. 2019 జూన్‌లో మూడు బ్యారేజీలు ప్రారంభం కాగా... అదే సంవత్సరం వచ్చిన వరదలకు బ్యారేజీలు దెబ్బ తిన్నాయని, 2019 నవంబరులోనే లోపాలు బయట పడ్డాయని నీటిపారుదల శాఖ అధికారులు మంత్రివర్గానికి నివేదించారు. అధ్యయనం ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని, మరమ్మతుల ఖర్చు నిర్మాణ సంస్థలు భరించేలా చూడాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. నిర్మాణ సంస్థలు ముందుకు రాకున్నా మరమ్మతుల ప్రక్రియ ఆగకూడదని స్పష్టం చేసింది.
కమిటీ సమన్వయం చేసుకోవాలి
జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నివేదిక అమలు కోసం వేసిన ఆరుగురు ఉన్నతాధికారుల కమిటీ బ్యారేజీల అధ్యయనం, మరమ్మతుల ప్రక్రియను సమన్వయం చేసుకుంటూ అమలు చేయాలని మంత్రివర్గం నిర్దేశించింది. ఒక్కో బ్యారేజీని రెండేసి సంస్థలతో అధ్యయనం చేయించడం వల్ల రెండు నివేదికల సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చని భావించారు.
అవసరమైన పత్రాలివ్వండి: మంత్రివర్గం
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిటీకి అవసరమైన పత్రాలన్నీ అందించాలని మంత్రివర్గం నీటి పారుదల శాఖకు స్పష్టం చేసింది. గతేడాది అక్టోబరులో జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ నివేదికతో పాటు తాజాగా అందించిన మధ్యంతర నివేదికను, కాగ్ రిపోర్టుతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మధ్యంతర నివేదికను కమిషన్‌కు అందించి, విచారణకు పూర్తి సహకారం అందించాలని మంత్రివర్గం అధికారులకు సూచించింది. విచారణ నివేదిక చేతికి అందాక దోషులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
అన్నారం పంప్‌హౌస్ వద్ద రక్షణగోడ
పెద్దపల్లి, మే 20 (ఆంధ్రజ్యోతి): అన్నారం (సరస్వతి) పంప్‌హౌస్ నీట మునగకుండా రక్షణ గోడ(సేఫ్టీ వాల్)ను నిర్మిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా ఈ గోడను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్నారం పంప్‌హౌ్‌సను రిజర్వాయర్ గరిష్ఠ నీటి మట్టం కన్నా తక్కువ ఎత్తులో నిర్మించారు. దీంతో 2022లో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వచ్చిన వరద పంప్‌హౌ్‌సలోకి చేరింది. భవిష్యత్తులో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా 950మీటర్ల సేఫ్టీ వాల్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 650 మీటర్ల మేర నిర్మాణం పూర్తి కాగా, నెల రోజుల్లో పనులన్నీ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే, సుందిళ్ల బ్యారేజీ అప్‌స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్‌లో అక్కడక్కడ పడిన రంధ్రాలను పూడ్చివేసేందుకూ చర్యలు చేపట్టారు.