Hyderabad: బ్రాండెడ్ బీర్ల కొరత..
ABN , Publish Date - May 30 , 2024 | 05:44 AM
ఏటా వేసవిలో బీర్లకు భారీ డిమాండ్ ఉంటుంది. సాధారణ రోజుల కంటే దాదాపు రెట్టింపు వినియోగం ఉంటుంది. దానికి అనుగుణంగా ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు రూపొందించుకోవాలి. రెండు షిఫ్టుల్లో జరుగుతున్న బీరు ఉత్పత్తిని మూడు షిఫ్టుల్లో జరిగేలా చూసుకోవాలి. ఇందుకోసం బెవరేజె్‌సలకు అనుమతివ్వాలి. కానీ, ఈ ఏడాది ఎక్సైజ్ శాఖ ఇదేమీ చేయలేదు. ఫలితంగా రాష్ట్రంలో వేసవిలో ఏ జిల్లాలో చూసినా బ్రాండెడ్ బీర్ల కొరత భారీగా ఉంది.
ఉత్పత్తిలో మూడో షిఫ్టుకు అనుమతివ్వని ఎక్సైజ్ శాఖ
కొత్త బ్రాండ్ల పర్మిషన్ వైపే మొగ్గు
‘సోం’కే కాదు.. టాయిట్,
మౌంట్ ఎవరెస్ట్, ఎగ్జోటికాకూ అనుమతి
డిమాండ్ ఉన్న వాటి సరఫరా అంతంతే
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 357 వైన్ షాపులున్నాయి. వీటిలో రెండు నెలల నుంచి బ్రాండెడ్ బీర్లు దొరకడమే లేదు. వచ్చినా అది అతి తక్కువగానే.
నల్లగొండ జిల్లాలో కింగ్‌ఫిషర్ బీరుతో పాటు ప్రముఖ బ్రాండ్లకు చెందిన బీర్ల కొరత తీవ్రంగా ఉంది. వేసవిలో అందరూ అధికంగా కోరే కేఎఫ్ లైట్ కోసం జిల్లాలోని దుకాణదారులు 100 కార్టన్లకు ఇండెంట్ పెడితే బెవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చింది 10 కార్టన్లే.
హైదరాబాద్, మే 29(ఆంధ్రజ్యోతి): ఏటా వేసవిలో బీర్లకు భారీ డిమాండ్ ఉంటుంది. సాధారణ రోజుల కంటే దాదాపు రెట్టింపు వినియోగం ఉంటుంది. దానికి అనుగుణంగా ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు రూపొందించుకోవాలి. రెండు షిఫ్టుల్లో జరుగుతున్న బీరు ఉత్పత్తిని మూడు షిఫ్టుల్లో జరిగేలా చూసుకోవాలి. ఇందుకోసం బెవరేజె్‌సలకు అనుమతివ్వాలి. కానీ, ఈ ఏడాది ఎక్సైజ్ శాఖ ఇదేమీ చేయలేదు. ఫలితంగా రాష్ట్రంలో వేసవిలో ఏ జిల్లాలో చూసినా బ్రాండెడ్ బీర్ల కొరత భారీగా ఉంది. మరోవైపు మూడో షిఫ్టులో ఉత్పత్తికి బదులుగా.. కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వడంపై దుమారం రేపుతోంది. ఒక్క సోం డిస్టలరీస్‌కే కాక.. మరికొన్ని బ్రాండ్లకూ అనుమతిచ్చినట్లు తాజాగా తేలింది. ఇలా ఇచ్చిన బ్రాండ్లలో టాయిట్ (కర్ణాటక), మౌంట్ ఎవరెస్ట్ (మధ్యప్రదేశ్)తో పాటు హైదరాబాద్‌కు చెందిన ఎగ్జోటికా ఉన్నాయి. మూడు నెలల పాటు కృత్రిమ కొరత సృష్టించి.. దాన్ని సాకుగా చూపి కొత్త బ్రాండ్లకు గేట్లు ఎత్తారని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.
కాగా, ఉమ్మడి ఏపీలో 2012 వేసవిలో బీర్ల కొరత ఏర్పడగా.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితి తలెత్తింది. అసలు వేసవి తొలినుంచే కొరత తీవ్రంగా ఉంది. వాస్తవానికి ఈ సమయంలో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండే కింగ్ ఫిషర్, ఇతర బ్రాండ్‌ల లైట్ బీర్లు ఎక్కువగా అమ్ముడవుతాయి. దీనికితగ్గట్లే మద్యం దుకాణదారులు ఇండెంట్లు పెడతారు. వీటి ఆధారంగా ఎక్సైజ్ శాఖ ఉత్పత్తిదారుల నుంచి సరఫరా చేస్తుంటుంది. అయితే, ఈసారి ఇండెంట్లలో ఐదో వంతు కూడా ఇవ్వలేదు. మరోవైపు వచ్చిన కొద్దిపాటి సరుకును దుకాణదారులు.. బెల్ట్ షాపులకు తరలిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మద్యం దుకాణాల్లో రూ.150-160కి విక్రయించాల్సిన వాటిని బెల్ట్ షాపుల్లో రూ.200 పైగా ధరకు విక్రయిస్తున్నారు. దీనిని నియంత్రించాల్సిన ఎక్పైజ్ ఉన్నతాధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్పైజ్ శాఖ రాష్ట్ర ఖజానాకు ఎక్కువ ఆదాయాన్ని అందిస్తుంది. మిగతా నెలలతో పోలిస్తే జనవరి నుంచి మే వరకు ఐదు నెలల్లో ఈ శాఖకు ఆదాయం అధికంగా వస్తుంది.
ఆఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 1.10 నుంచి 1.20 లక్షల బ్రాండెడ్ బీర్లు అమ్ముడవుతుంటాయి. వేసవిలో ఇది 2.40 లక్షలకు చేరుతుంది. కానీ, ఈసారి వేసవికి సంబంధించి అధికారుల ప్రణాళిక లేమి స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ప్రముఖ బ్రాండ్లకు సంబంధించి ఆరు ఉత్పత్తి సంస్థలున్నాయి. 8 గంటలకు ఒక షిఫ్టు చొప్పున బీర్ల ఉత్పత్తి జరుగుతుంది. వర్షాకాలం, చలికాలంలో రోజుకు ఒక షిఫ్టు చొప్పున, వేసవి ప్రారంభమైతే రెండు.. డిమాండ్‌ను బట్టి మూడో షిఫ్టుకు అనుమతివ్వాలి. కొన్నేళ్లుగా ఇలానే చేస్తున్నారు. దీంతో బీర్ల తయారీ నిరంతరంగా సాగుతుంది. ఈసారి ఎక్పైజ్ శాఖ రెండు షిఫ్టులకే అనుమతివ్వడంతో డిమాండ్-సరఫరా మధ్య వ్యత్యాసం పెరిగింది. డిమాండ్‌కు సరిపడేలా మూడో షిఫ్టుకు అనుమతి ఇవ్వకపోవడంతోనే లోటు ఏర్పడిందని అర్థమవుతోంది. బ్రాండెడ్ బీర్లు అందుబాటులో లేకపోవడంతో మద్యం ప్రియులు బ్రీజర్ కొనుగోలు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఎన్నడూ లేని స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా బ్రీజర్ విక్రయాలు రెండింతలు పెరిగాయి.
అన్ని జిల్లాల్లోనూ కొరతే..
నిజామాబాద్ జిల్లాలో 102 వైన్ షాపులుండగా.. గతేడాది మే నెలలో 3.30 లక్షల బీర్లు అమ్ముడయ్యాయి. ఎండల తీవ్రతతో ఈ నెలలో కనీసం 4.50 లక్షల బీర్ల డిమాండ్ ఉండగా.. సరఫరా చేసింది మాత్రం 2.32 లక్షలే. నిరుటి కంటే 1.20 లక్షల బీర్లు అదనంగా సరఫరా చేయాల్సి ఉండగా.. 2.18 లక్షల బీర్లు తక్కువగా సరఫరా చేశారు.
సంగారెడ్డి జిల్లాలో 101 వైన్ షాపులు 34 బార్లున్నాయి. నిరుడు మే నెలలో రూ.138 కోట్ల విక్రయాలు జరగగా.. ఈసారి ఆదాయం రూ. 160 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. ఈ నెల 29 వరకు రూ.126 కోట్ల మద్యం మాత్రమే అమ్ముడయింది.
అదిలాబాద్ జిల్లాలోనూ బ్రాండెడ్ బీర్ల కొరత తీవ్రంగానే ఉంది. ముఖ్యంగా కేఫ్ లైట్, స్ర్టాంగ్, ఆల్ర్టా, 5000, నాకౌట్, బడ్‌వైజర్, ఖజురహో సరఫరా అంతంతమాత్రమే. స్టాక్ ఆధారంగా అధికారులు వైన్‌షా్‌పలు, బార్‌లకు సమానంగా పంపిణీ చేస్తున్నారు. టిన్‌లు, చిన్న బీర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రముఖ బ్రాండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో.. వచ్చిన వాటిని వైన్ షాపుల యజమానులు బెల్ట్ షాపులకు చేరవేస్తున్నారు.
యాదాద్రి జిల్లాలో 82 మద్యం దుకాణాలు ఉన్నాయి. కేఎఫ్ లైట్, స్ర్టాంగ్, చిన్న బీర్ల కొరత తీవ్రంగా ఉంది, మిగతావి సరఫరా అవుతున్నా డిమాండ్ మేరకు రావడం లేదు. ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని యాజమానులు ఆరోపిస్తున్నారు. బ్రాందీ, విస్కీ, రమ్, వోడ్కా కొన్నిచోట్ల అందుబాటులో ఉంటే.. మరికొన్నిచోట్ల లేదు. జనగామ జిల్లాలో బ్రాండెడ్ బీర్ల కొరత ఉంది. నెల రోజుల నుంచి కింగ్‌ఫిషర్ లైట్, స్ర్టాంగ్, బడ్‌వైజర్, నాకౌట్, 5000లను చాలా తక్కువగా సరఫరా చేస్తున్నారు. లిక్కర్‌లో ఓసీ బ్రాండ్‌కూ కొరత ఉంది. షాపుల యజమానులు ఆర్డర్ పెట్టినప్పటికీ డిపోల నుంచి సరఫరా లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని లిక్కర్ డిపోనకు వస్తున్న బీర్లు దుకాణాల అవసరాలకు సరిపోవడం లేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో గతంలో రెండు రోజులకు 100 కాటన్ల వరకు వస్తుండగా.. ఇప్పుడు 20 కాటన్ లు మాత్రమే వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇదివరకు 20 వేల కేసుల బీర్లు వచ్చేవని.. ఇప్పుడు 400 మాత్రమే వస్తున్నాయని నిర్వాహకులు చెప్పారు. కరీంనగర్ జిల్లాలో నాలుగు నెలల నుంచి బీర్ల కొరత అధికంగా ఉంది. ఒక్కో షాపులో 35 నుంచి 70 పెట్టెల అమ్మకాలు జరుగుతాయి. అయితే, 30 నుంచి 35 పెట్టెల బీర్లను మాత్రమే మద్యం డిపో నుంచి అందజేస్తున్నారు.