Share News

Hyderabad: కిషన్‌ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నం..

ABN , Publish Date - Jun 23 , 2024 | 04:19 AM

నీట్‌ను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌, వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో బర్కత్‌పురలోని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి ఇంటిని ముట్టడికి యత్నించారు.

  Hyderabad: కిషన్‌ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నం..

  • అడ్డుకున్న పోలీసులు.. పలువురి అరెస్ట్‌.. నీట్‌లో అక్రమాలపై విద్యార్థుల ఆందోళన

  • న్యాయ విచారణ జరిపించాలి: ఆర్‌.కృష్ణయ్య

  • బీసీ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ

బర్కత్‌పుర/తార్నాక, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): నీట్‌ను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌, వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో బర్కత్‌పురలోని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి ఇంటిని ముట్టడికి యత్నించారు. కేంద్ర మంత్రి నివాసముంటున్న లెజెండ్‌ అపార్ట్‌మెంట్‌ గేటును తోసుకొని దూసుకెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. డబ్బు కోసమే నీట్‌లో అక్రమాలకు పాల్పడ్డారంటూ విద్యార్థి, యువజన సంఘాల నేతలు ఫేక్‌ నోట్లను పైకి ఎగురవేసి నిరసన తెలిపారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో పాటు పలువుర్ని పోలీసులు అరెస్ట్‌ చేసి నల్లకుంట పీఎ్‌సకు తరలించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత విడుదల చేశారు.


కిషన్‌ రెడ్డి అపాయింట్‌మెంట్‌ కోరితే ఇవ్వలేదని, దాంతో ఆయన ఇంటిని ముట్టడించేందుకు వెళ్లామని బల్మూరి చెప్పారు. నీట్‌లో అక్రమాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. శనివారం బర్కత్‌పుర ఆర్టీసీ బస్‌ డిపో వీధిలో బీసీ సంక్షేమ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌ విద్యార్థులతో కలిసి ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన గ్రంథాలయం ఆవరణలో నిరాహార దీక్ష చేపట్టారు. ప్రధాని మోదీ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమన్నారు. ఓయూ ప్రొఫెసర్లు కాశీం, కొండ నాగేశ్వర్‌రావు విద్యార్థులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. నీట్‌లో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. పోలీసుల అత్యుత్సాహం వల్ల ఆందోళనలో ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌ గాయపడ్డారని తెలిపారు.

Updated Date - Jun 23 , 2024 | 04:19 AM