Khammam: ఆ ఐదు పంచాయతీలు ఇవ్వాలని ఏపీని అడుగుతాం..
ABN , Publish Date - Jun 30 , 2024 | 03:06 AM
భద్రాచలం మండలం నుంచి ఏపీలో కలిసిన ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని ఆంఽధ్రప్రదేశ్‌ను కోరతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన చట్టం హామీల అమలు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై జరిగే ఉమ్మడి చర్చల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు.
విభజన చట్టంపై ఉమ్మడి చర్చల్లో ప్రస్తావిస్తాం : తుమ్మల
ఖమ్మం, జూన్ 29(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భద్రాచలం మండలం నుంచి ఏపీలో కలిసిన ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని ఆంఽధ్రప్రదేశ్‌ను కోరతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన చట్టం హామీల అమలు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై జరిగే ఉమ్మడి చర్చల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి తుమ్మల శనివారం విలేకరులతో మాట్లాడారు. భద్రాచలం మండలానికి చెందిన ఐదు పంచాయతీలు ఏపీలో కలవడం వల్ల.. భద్రాచలం పట్టణంలో చెత్త వేయడానికి కూడా స్థలం లేకుండా పోయిందన్నారు.
ఆ ఐదు పంచాయతీలు పోలవరం ముంపు పరిధిలో లేవని, భద్రాచలం మండలంలో ఉండడంతో నాడు వాటిని ఏపీలో కలిపారని గుర్తు చేశారు. భద్రాచలం పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందాలంటే ఆ ఐదు పంచాయతీల అవసరం ఉందని స్పష్టం చేశారు. కాగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతంలో తాను ప్రతిపాదించిన జాతీయ రహదారులకు కేంద్ర ప్రభుత్వం రూ.655కోట్లు మంజూరు చేసిందని మంత్రి తుమ్మల వెల్లడించారు. తద్వారా ఖమ్మం జిల్లాలో అన్ని రహదారులు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. నిధుల మంజూరుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
రహదారుల కోసం మంజూరైన నిధులకు సంబంధించి డీపీఆర్ సిద్ధం చేసిన తర్వాత టెండర్లు పిలుస్తామని ప్రకటించారు. కొత్తగూడెం పట్టణానికి మూడువైపులా 25కి.మీ. పొడవున రింగ్‌రోడ్డు రాబోతుందని చెప్పారు. భద్రాచలం పట్టణంలో ఆరు లేన్ల రహదారి, కిన్నెరసాని బ్రిడ్జికి అనుసంధానంగా మరో వంతెన, ఖమ్మం రింగ్‌రోడ్డు పనులు, జిల్లాలో మరిన్ని రహదారుల అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తుమ్మల వివరించారు.