Share News

Revenue Dept : జగన్‌ చేసిన భూ గాయాలు

ABN , Publish Date - Feb 05 , 2025 | 03:41 AM

ఇది జగన్‌ సర్కారు చేసిన ‘భూగాయం!’ దీనిని మాన్పేందుకు కూటమి సర్కారు నానా తంటాలు పడుతోంది.

Revenue Dept : జగన్‌ చేసిన  భూ గాయాలు

  • ‘జగనన్న భూ రక్ష’ కాదు.. రైతులపై కక్ష

  • తప్పుల తడకగా సాగిన భూముల రీ సర్వే

  • వందేళ్ల తర్వాత సర్వే అంటూ వివాదాల ఉచ్చు

  • విస్తీర్ణం, హద్దులు, సర్వే నంబర్లు తలకిందులు

  • అడ్డగోలుగా రికార్డుల తయారీ

  • సరిదిద్దుకోవడానికి రైతుల పాట్లు

  • బాధితులను వేధిస్తున్న కొందరు సిబ్బంది

  • రికార్డులు సరిచేయడానికి కాసులు డిమాండ్‌

  • పరిష్కారం చూపని అప్పీళ్ల వ్యవస్థ

  • దిద్దుబాటు చర్యలకు వెల్లువలా వినతులు

ఇది జగన్‌ సర్కారు చేసిన ‘భూగాయం!’ దీనిని మాన్పేందుకు కూటమి సర్కారు నానా తంటాలు పడుతోంది. వేలకొద్దీ వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించడం ఎలాగో తెలియక తల పట్టుకుంటోంది.

కొన్నిచోట్ల అసలు యజమానులను మార్చేశారు. ఇంకొన్ని చోట్ల సర్వే నంబర్లను ఎత్తేశారు. మరికొన్ని చోట్ల విస్తీర్ణం తగ్గించేశారు. ఇదీ వైఎస్‌ జగన్‌ హయాంలో జరిగిన తంతు! తప్పులు చేసింది రెవెన్యూ సిబ్బంది! శిక్ష అనుభవిస్తున్నది.. రైతులు! సమస్య పరిష్కరించాల్సిన సర్వే, రెవెన్యూ శాఖలు ఏడు నెలలు గడిచినా మీనమేషాలు లెక్కిస్తున్నాయి. 6,880 గ్రామాల్లో సభలు నిర్వహించగా, 2.80 లక్షల ఫిర్యాదులు రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

భూమినే మాయం చేశారు

ఈ రైతు పేరు లక్కిరెడ్డి రాఘవరెడ్డి. కడప జిల్లా పాయలకుంట్ల గ్రామానికి చెందిన రాఘవరెడ్డికి వేమకుంట రెవెన్యూ.. సర్వే నంబరు 82/3, 4,6లలో 4.44 ఎకరాల భూమి ఉంది. 20 ఏళ్ల నుంచి ఆయన సాగు చే సుకుంటున్నారు. ఆయన పేరిట పట్టాదారు పాసు పుస్తకాలు, అడంగళ్‌, 1బీలు ఆన్‌లైన్‌లో నమోదై ఉన్నాయి. రీసర్వేలో 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఆయన భూమిని ఆన్‌లైన్‌ నుంచి తొలగించారు. ఆ భూమిని బంజరుగా మార్చారు. సర్వే మా కొంప ముంచిందని రాఘవరెడ్డి వాపోతున్నారు. తప్పును సరి చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Untitled-5 copy.jpg


(అమరావతి/ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

వందేళ్ల తర్వాత రీ సర్వే చేస్తున్నామని గొప్పగా చెప్పారు! వివాదాలన్నీ మటుమాయమవుతాయని ఊరించారు! ‘జగనన్న భూ రక్ష’ అంటూ హడావుడి చేశారు. చివరికి అది భూరక్ష కాదు... రైతులపై కక్ష అని తేలిపోయింది. హేతుబద్ధత, శాస్త్రీయత లేకుండా చేసిన భూముల సర్వేతో రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల రైతుల భూముల సరిహద్దులు, సర్వేనంబర్లు తలకిందులయ్యాయి. వాటిని పరిష్కరించేందుకు మండల స్థాయిలో అప్పీళ్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని జగన్‌ సర్కారు గొప్పలు చెప్పినా ఆచరణలో ఫలితమివ్వలేదు. తను దిగిపోయేనాటికి రీ సర్వే పూర్తి కావాలని నాడు జగన్‌ ఒత్తిడి తెచ్చారు. దీనిపై ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండకూడదని ఆంక్షలు పెట్టారు. అయితే, ఆయనది హడావుడిగానే మిగిలిపోయింది. సమస్యలేవీ పరిష్కరించలేకపోయారు. ఆ సమస్యలే రైతులను అప్పటినుంచీ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.


ఉన్నది చెడగొట్టి...

తెలుగుదేశం ప్రభుత్వం 2019కి ముందు రాష్ట్రంలోని భూములకు యూనిక్‌ ఐడీ ఇవ్వాలని భావించింది. అంటే, భూమి ఆక్షాంశాలు, రేఖాంశాలను నిర్దిష్టంగా తెలిపేలా ఓ నంబర్‌ ఇవ్వాలనుకున్నారు. దానికి భూదార్‌ అని పేరుపెట్టారు. ఇందుకోసం కేంద్రంతో మాట్లాడి ప్రాజెక్టును మంజూరు చేయించారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ సత్యనారాయణ నేతృత్వంలో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని అనుకున్నారు. ఎన్నికల తర్వాత జగన్‌ సర్కారు వచ్చి భూదార్‌ను అటెక్కించారు. రాష్ట్రంలో ఉన్న భూముల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని రైతులకు కొత్త ఆశలు కల్పించి 2020 డిసెంబరులో పైలెట్‌ ప్రాజెక్టును అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో కరోనాకాలంలో చేసిన పైలెట్‌ ప్రాజెక్టు విఫలమయింది. 1600 ఎకరాల భూమి ఉన్న ఈ గ్రామంలోనే రీ సర్వేసరిగ్గా చేయలేకపోయారు. విమర్శలను సానుకూలంగా స్వీకరించి సమస్యలను పరిష్కరించే అలవాటులేని జగన్‌, మొండిగా రాష్ట్రం అంతా రీ సర్వేచేయాలని, అందులోనూ మూడేళ్లలోనే పూర్తిచేయాలని ఆదేశించారు. రీ సర్వేచేయడం తప్పుకాదు. కానీ, దాన్ని ఆగమేఘాలమీద, తక్కువ సమయంలో పూర్తిచేయాలని టార్గెట్‌ విధించడమే తప్పు. దీంతో సర్కారు ఒత్తిడి భరించలేక సర్వే ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఓఐ) కూడా రీ సర్వేనుంచి పక్కకు తప్పుకొంది. అయినా సర్వే అధికారులపై ఎనలేని ఒత్తిడి తీసుకొచ్చి హడావుడిగా ఎనిమిది వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేయించారు. సర్కారు ఒత్తిడి భరించలేక సర్వే, రెవెన్యూ అధికారులు రీ సర్వే మాన్యువల్‌ను పాటించలేదు.


రూల్స్‌ ఇలా.. చేసింది అలా..

సర్వే-సరిహద్దుల చట్టం ప్రకారం రైతులకు నోటీసులు ఇచ్చి వారి సమక్షంలోనే భూములు కొలవాలి. ఆ తర్వాత సర్వే నివేదికపై వారి ఆమోదం తీసుకోవాలి. అభ్యంతరాలు వస్తే సావధానంగా పరిష్కరించాలి. చివరిగా గ్రామంలో సర్వే పూర్తయినట్లుగా ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలి. అయితే, జగన్‌ సర్కారు తొందరపాటు చర్యలు, ఒత్తిళ్లతో అధికారులు ఈ ప్రొసీజర్‌ అమలు చేయలేకపోయారు. నేలవిడిచి సాము చేశారు. చెట్లకింద కూర్చొని రికార్డులు తయారుచేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. డ్రోన్‌ సర్వేలు ఫలితమివ్వలేదు. అయినా రైతులకు నోటీసులు ఇచ్చి సర్వే చేసినట్లుగా తప్పుడు నివేదికలు పుట్టించారు. ఆ తర్వాత జగన్‌, ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి ఫొటోలతో హడావుడి రీ సర్వే రికార్డులు ముద్రించారు. రైతులకు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారు. వాటిని చూసిన రైతులు గగ్గోలు పెట్టారు. తమ భూమిని తగ్గించారని, సరిహద్దులు మార్చేశారని రైతులు ఆందోళనకు గురయ్యారు. మండలాల్లో ఏర్పాటు చేసిన అప్పీల్స్‌ వ్యవస్థ రైతుల పిటిషన్ల పరిష్కారాన్ని మిథ్యగా మార్చేసింది. పిటిషన్లు కన్నెత్తి చూడకుండానే పరిష్కరించినట్లుగా సెటిల్‌ చేశారు. దీంతో రైతుల్లో మరింత ఆగ్రహావేశాలు పెరిగిపోయాయి. దాని ఫలితం ఎన్నికల్లో జగన్‌ బాగా చవిచూశారు.

పరిష్కారమైతే ఇన్ని ఫిర్యాదులెలా?

1.90 లక్షల ఫిర్యాదులు పరిష్కరించామని రెవెన్యూశాఖ చెబుతోంది. కానీ ఆ లెక్క తప్పు అని రెవెన్యూ సదస్సుకు వచ్చిన పిటిషన్లు చెబుతున్నాయి. రీ సర్వే అనంతరం వచ్చిన సమస్యలను పరిష్కరించలేదని రైతులు రెవెన్యూ సదస్సుల్లో తిరిగి ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు ఈ సమస్యలే ఇటు రైతుకు, అటు సర్కారుకు పెద్ద సవాల్‌గా మారాయి. న్యాయమైన పరిష్కారం చూపించకపోతే అది మరో సమస్యకు దారితీసేప్రమాదం ఉందని రెవెన్యూ నిపుణులు, సీనియర్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు.


రెవెన్యూ సృష్టించిన చిక్కులెన్నో....

సర్వే సరిహద్దుల చట్టం ప్రకారం రైతులకు లిఖితపూర్వక నోటీసులు ఇచ్చి, ఆ తర్వాత వారి సమక్షంలోనే భూములు కొలవాలి. ఆ తర్వాత జరిగిన సర్వేను రైతు ఆమోదించాలి. కొలవడానికి ముందు, ఆ తర్వాత రైతుల సంతకాలు తీసుకోవాలి. కానీ రీ సర్వేలో అలా జరగలేదు. రైతుల ప్రమేయం లేకుండానే రీ సర్వే చేసినట్లుగా అడ్డగోలుగా రికార్డులు తయారుచేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలను ఉద్దేశ్యపూర్వకంగా సృష్టించారు. తమ భూమి విస్తీర్ణం తగ్గించారని, పక్క రైతు ఖాతాలో కలిపారని రైతులు ఫిర్యాదు చేస్తే ఇప్పుడు తామేం చేయలేమంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. తాము చేసిన తప్పులను సరిదిద్దడానికి కూడా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. రీ సర్వే పేరిట రెవెన్యూ, సర్వే అధికారులు తప్పులు చేసి వాటిని రైతులు భరించాలనడం తీవ్రమైన అంశం. ఈ సమస్యపై ప్రభుత్వం కఠినంగా స్పందించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

పరిష్కారం ఎలా?

ఈ సమస్యకు తిరిగి ఆ రైతు సమక్షంలో భూములు సర్వేచేసి పరిష్కరించడం లేదా పాత రికార్డునే పునరుద్ధరించడమే ప్రభుత్వం ముందున్న మార్గాలని అధికారవర్గాలు చెబుతున్నాయి. పాత రీ సర్వే సమస్యలు పరిష్కారం కాకముందే కూటమి సర్కారు కొత్తగా 600 పైచిలుకు గ్రామాల్లో కొత్తగా మరోసారి రీ సర్వే పైలెట్‌ ప్రాజెక్టు ప్రారంభించింది. పాత సమస్యలను పరిష్కరించాకే కొత్త ప్రాజెక్టులు అమలు చేయాలన్న సూచనలు ఉన్నాయి.


భూమి విస్తీర్ణం తగ్గించారు

కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణానికి చెందిన కొశిరెడ్డి రాజాకు సర్వే నంబర్లు 735/1, 735/2లో 2.13 ఎకరాల భూమి ఉంది. రీసర్వేలో మాత్రం 1.49 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు చూపించారు. దీన్ని సరిచేయాలని రెండున్నరేళ్లుగా ఇప్పటికి పదికి పైగా ఫిర్యాదులు ఇచ్చారు. ఇప్పటివరకూ దానిపై పరిశీలన జరగలేదు. సర్వే నంబరు 643/1లో 30 సెంట్లు మాత్రమే భూమి ఉంటే, ఇతరులతో కలిపి జాయింట్‌ ఎల్‌పీఎం కింద 1.89 ఎకరాలు ఉన్నట్లు చూపించారు. తనకు ప్రత్యేకంగా ఎల్‌పీఎం కేటాయించి తన భూమి విస్తీర్ణాన్ని ప్రత్యేకంగా నమోదు చేయాలని కోరినా ఇప్పటివరకూ చేయలేదు.

ఎందుకు తగ్గిందంటే చెప్పట్లేదు

పశ్చిమగోదావరి జిల్లా యండగండికి చెందిన పీవీఎస్‌ గోపాలకృష్ణంరాజుకు గ్రామంలో 10.20 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి 500, 501 సర్వే నంబర్లలో విస్తరించి ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రీసర్వే నిర్వహించారు. రెండు సర్వే నంబర్లలోనూ 39 సెంట్లు తక్కువగా వచ్చింది. అలాగే గోపాలకృష్ణంరాజు తల్లి పుల్లాయమ్మ పేరుతో 75 సర్వే నంబర్‌లో ఐదెకరాలుంటే, రీ సర్వేలో 20 సెంట్లు తగ్గిందని చెప్పారు. దాని సరిహద్దులో ఉన్న భూమిలో 22 సెంట్లు ఎక్కువగా ఉందని తేల్చారు. ఇలా గోపాలకృష్ణంరాజు కుటుంబం రీ సర్వేలో 59 సెంట్లు కోల్పోయింది. అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. ఎందుకు తగ్గిందో చెప్పలేకపోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇటువంటి ఉదంతాలు కోకొల్లలు.


ఫిర్యాదులు ఇవ్వడమేగానీ...

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామంలో కాపు లక్ష్మి అనే మహిళా రైతు వైసీపీ ప్రభుత్వ హయాంలో సర్వే నంబరు 6/3లోని 940 ఖాతా నంబరులో 90 సెంట్లు భూమిని పసుపులేటి అంజయ్య వద్ద కొనుగోలు చేశారు. తొలుత ‘మీ భూమి పోర్టల్‌’లో సుబ్బారావు పేరు నమోదైంది. భూముల రీసర్వే అనంతరం మళ్లీ పాత ఖాతాదారు అయిన అంజయ్య పేరు మీద 1.05 ఎకరాల భూమిని అధికారులు ఎక్కించారు. దీనిని మార్పు చేయాలని సుబ్బారావు అప్పటి నుంచీ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కాలేదు. ఇటీవల కూటమి ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆన్‌లైన్‌లో తన పేరు ఎక్కించాలని మరోసారి ఫిర్యాదు చేశారు.

వేరే పేర్లు వచ్చి చేరాయి

రీసర్వేలో తప్పులు దొర్లడంతో విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం రైతులు ఆందోళన చెందుతున్నారు. తునివలస, నర్సాపురం, బుడ్డివలస, రేవిడి, మద్ది గ్రామాల్లో చాలా తప్పులు దొర్లాయని అంటున్నారు. రెవెన్యూ అధికారులు నిర్వహించిన గ్రామ సదస్సుల్లో వందల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. మద్ది గ్రామంలో కాళ్ల అప్పలసూరి భూములకు సంబంధించి రీసర్వే జరగ్గా, అతని పాస్‌ పుస్తకంలో సర్వే నంబరు 37/9, సర్వే నంబరు 57/4లో కలిపి 26 సెంట్లు నమోదు కాలేదు. సర్వే నంబరు 57/13, 14లో 35 సెంట్లకుగాను 32 సెంట్లు నమోదు చేశారు. మిగిలిన 3 సెంట్లు అతని రికార్డుల్లో లేదు. ఇదే గ్రామంలో వై.లక్ష్మికి సర్వే నంబరు 38/10లో 22 సెంట్లు ఉండగా, 19 సెంట్లు నమోదైంది.


రీ సర్వే తప్పులపై నేడు సమీక్ష

జగన్‌ ప్రభుత్వంలో జరిగిన భూముల రీ సర్వేలో వచ్చిన తప్పులపై లక్షల ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయు. వాటి పరిష్కారంకోసం మండలస్థాయిలో అప్పీళ్ల వ్యవస్థ ఏర్పాటుచేసినా అది సమస్యలకు పరిష్కారం చూపలేదు. దీంతో రీ సర్వే తప్పులు రైతులను కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ సమస్యపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది. జగన్‌ జమానాలో మండలస్థాయి రీ సర్వే అప్పీళ్ల అధికారులు ఏం చేశారు? ఏం చేయలేకపోయారన్న అంశాలపై సమీక్ష చేయనుంది. బుధవారం అమరావతి పరిధిలో అప్పీల్‌ అధికారులతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. 600 మండలాల డీటీలు హాజరుకానున్నారు. అదనపు సీసీఎల్‌ఏ, సర్వే డైరెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. ఇప్పటికే 8,680 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయి. 2.80 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. నెలరోజుల పాటు జరిగిన రెవెన్యూ సదస్సుల్లోనూ రీ సర్వేకు సంబంధించి లక్షకుపైగా పిటిషన్లు వచ్చాయి. రైతుల విన్నపాల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం

శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 05 , 2025 | 03:41 AM