Chinna Jeeyar Swamy: ఆలయాల సంరక్షణపై హైందవ సంఘాల డిక్లరేషన్
ABN , Publish Date - Jan 05 , 2025 | 06:03 PM
Chinna Jeeyar Swamy: ఆలయాలు బాగుంటేనే మనం బాగుంటామని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి తెలిపారు. ఆలయాలకు కావాల్సిన నిర్ణయాలు ఎవరు చేయాలని ప్రశ్నించారు.
విజయవాడ: ఆలయాల ఆస్తులు, ఆచారాలు నాశనమైపోతున్నాయని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం, కేసరపల్లి లైలా గ్రీన్ మెడోస్ ప్రాంగణంలో ఇవాళ (ఆదివారం) హైందవ శంఖారావం (Hindu Sankharavam) సభ జరిగింది. ఈ సభలో వీహెచ్‌పీ (VHP) జాతీయ ప్రతినిధులు, బీజేపీ నేతలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి మాట్లాడారు. ఆలయాలు బాగుంటేనే మనం బాగుంటామని చెప్పారు. మన ఆలయాలకు గతంలో 15 లక్షల ఎకరాలు ఉండేదని చెప్పారు. ఐసుగడ్డ మాదిరిగా కరుగుతూ 4.50 లక్షల ఎకరాలు మాత్రమే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాలకు కావాల్సిన నిర్ణయాలు ఎవరు చేయాలని ప్రశ్నించారు.
ఆఫీసుల్లో కూర్చునే అధికారులు చేయాలా అని నిలదీశారు. ఆలయాల్లో పూజ ఎంతసేపు చేయాలో ఆఫీసర్ చెప్పాలా...ధర్మాధికారి చెప్పాలా..?? అని ప్రశ్నించారు. ఆలయాలను కట్టుకునే మనం వాటిని నడపలేమా అని అడిగారు. ‘మా ఆలయాలను మేమే నిర్వహించుకుంటాం... అధికారులు అవసరం లేదు’’ అని స్పష్టం చేశారు. ఆలయాల్లో కమిటీలన్నీ రాజకీయంతో నిండిపోతున్నాయిని ఆరోపించారు. ఆలయాల ఆస్తులు తిరిగి వాటికే వచ్చేలా చేయాలని కోరారు. ఆలయాల్లో జరిగే ఆరాధనలు.. సంప్రదాయాల్లో అధికారుల ప్రమేయం ఉండకూడదని షరతు విధించారు. దేవుడి వద్ద వీఐపీ దర్శనాలేంటి అని ప్రశ్నించారు. తిరుపతి వంటి ఆలయాల్లో డబ్బున్నవాళ్లకు వీఐపీ దర్శనాలు, డబ్బులేని వారికి రోజుల తరబడి నిరీక్షణలా అని ఆందోళన వ్యక్తం చేశారు. దేవుడి దర్శనానికి నిబంధనలు పెట్టబట్టే మతమార్పిడులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఆలయాల్లో నిబంధనలు.. సాంప్రదాలను పాటించలేని వారు పక్కకు తొలగాలని హెచ్చరించారు. ఆక్రమణల్లో ఉన్న ఆలయాల ఆస్తులను స్వాధీనం చేయాలని కోరారు. అలా జరగనప్పుడు ఆలయాలు చేయిచాచి అడగనవసరం లేదని చెప్పారు. ఆలయాల్లో దర్శనం టిక్కెట్లతో అవసరం ఉండదన్నారు. మన ఆలయాలను మళ్లీ మన పవర్ ఫుల్ సెంటర్లుగా మార్చుకోవాలని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి పేర్కొన్నారు.
దేవాదాయశాఖను రద్దుచేయాలి: కమలానంద భారతీ స్వామిజీ
మనం నిర్మించుకున్న ఆలయాలపై ప్రభుత్వాల పెత్తనమేంటి అని శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీ స్వామిజీ ప్రశ్నించారు. దేవాదాయశాఖను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. సినిమాలకు మాదిరి కౌంటర్లు, టిక్కెట్లు పెట్టి ఆలయాల్లో దైవదర్శనాన్ని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దేవాదాయ , ధర్మాదాయ శాఖ దుర్మార్గమైనదని మండిపడ్డారు. మన రాష్ట్రంలోని దేవాలయాల బోర్డుల్లో హిందూ అనే పదాన్ని తీసేశారని ఆరోపించారు. హిందూ సమాజమంతా దేవాలయాలను ప్రశ్నించాలని అన్నారు. ప్రభుత్వమే దేవాలయాల భూములను కబ్జాచేసి ప్రభుత్వ కార్యాలయాలు,గోడౌన్లు నిర్మించిందని విమర్శించారు. దేవాలయంలో ఒక దేవుడుంటే 20 హుండీలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. హుండీలు పెట్టి భక్తులను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దేవాదాయ , ధర్మాదాయ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని అన్నారు. దశావతారాల్లో ఏడు అవతారాల ఆలయాలు ఉన్నది మన రాష్ట్రంలోనే అని గుర్తుచేశారు. ఏపీని రాష్ట్రప్రభుత్వం దేవభూమిగా ప్రకటించాలని కోరారు. ఏడు అవతారాల ఆలయాలను కలుపుతూ కారిడార్ ఏర్పాటు చేయాలని కమలానంద భారతి స్వామి డిమాండ్ చేశారు.
డిక్లరేషన్‌లో కీలక అంశాలివే...
విజయవాడ: హైందవ శంఖారావంలో విశ్వహిందూ పరిషత్ డిక్లరేషన్ ప్రకటించింది. హిందూ దేవాలయాలకు పూర్తి స్వయంప్రతిపత్తి కలిపిస్తూ చట్టసవరణ చేయాలని డిమాండ్ చేశారు. హిందు ఆలయాల ఆస్తులు, వ్యవస్థలపై దాడులు సరికాదని చెప్పారు. అన్యాయంగా, చట్టవిరుద్ధంగా దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వినాయకచవితి, దసరా వేడుకలకు ప్రభుత్వం నుంచి ఆర్థికభారం, అక్రమ ఆంక్షలు తగవు అని చెప్పారు. హిందూ దేవదేవతల శోభాయాత్రల మార్గాలు, తేదీలు, విధానాలపై అక్రమ ఆంక్షలు తగవని అన్నారు. ఆలయాల్లో పూజ, ప్రసాద, కైంకర్య సేవలు అత్యంత భక్తిశ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించాలని తెలిపారు. హిందూ ఆలయాల్లో అన్యమత ఉద్యోగులను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. ట్రస్టు బోర్డులో హిందూ ధర్మంపై భక్తిశ్రద్ధలు ఉండే భక్తులను మాత్రమే సభ్యులుగా నియమించాలని కోరారు. రాజకీయేతర ధార్మిక వ్యక్తులను ట్రస్టుబోర్డుల్లో చోటు కల్పించాలన్నారు. హిందూ దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుప్రకారం అన్యాక్రాంతమైన ఆస్తులను స్వాధీనం చేసుకుని ఆలయాలకు తిరిగి అప్పగించాలని కోరారు. ఆలయాల నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు దారి మళ్లించరాదని చెప్పారు. హైందవశంఖారావంలో డిక్లరేషన్‌పై చినజీయర్ స్వామిజీ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Purandeswari : దేవాలయాలపై దాడులు పెరిగాయి
Sankharavam: శంఖారావం సభలో పాల్గొననున్న వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధులు, బీజేపీ నేతలు..
Renu Desai: తెలుగు సినిమా పరిశ్రమపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..
Minister Lokesh: గాడి తప్పిన పాలనను సరిచేస్తున్నాం: మంత్రి నారా లోకేష్
Read Latest AP News and Telugu News