Share News

Transunion CIBIL: భారీగా రుణాలు తీసుకుంటున్న మహిళలు.. ఆ విషయంలో ఎప్పుడూ అలర్ట్.. నీతి ఆయోగ్..

ABN , Publish Date - Mar 05 , 2025 | 06:13 PM

Niti Aayog Report Women Loans : భారతదేశంలో రుణాలు తీసుకునే మహిళల సంఖ్య ఏటా 22% చొప్పున పెరిగింది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోని మహిళలు భారీ మొత్తంలో వ్యక్తిగత రుణాలు తీసుకుని వీటి కోసమే వెచ్చిస్తున్నారని నీతీ ఆయోగ్ వెల్లడించింది.

Transunion CIBIL: భారీగా రుణాలు తీసుకుంటున్న మహిళలు.. ఆ విషయంలో ఎప్పుడూ అలర్ట్.. నీతి ఆయోగ్..
Women Borrowers Cibil-Niti Aayog Report

Niti Aayog Report Women Loans : ఇప్పుడు బ్యాంకు రుణాలు తీసుకోవడంలో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు మహిళలు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం, గత ఐదు సంవత్సరాల్లో భారతదేశంలో రుణాలు తీసుకునే మహిళల సంఖ్య వార్షిక రేటు 22 శాతం పెరిగింది. వ్యాపారాల కంటే వ్యక్తిగత రుణాలే ఎక్కువగా తీసుకుంటున్నారని.. సొంతంగా వీటి కోసం ఖర్చు చేస్తున్నట్లు.. నీతి ఆయోగ్‌లో వుమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ప్లాట్‌ఫామ్‌ (డబ్ల్యూఈపీ), ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్, మైక్రోసేవ్‌ కన్సల్టింగ్‌ (ఎంఎస్‌సీ) ఫ్రమ్‌ బారోవర్స్‌ టు బిల్డర్స్‌: వుమెన్స్‌ రోల్‌ ఇన్‌ ఇండియాస్‌ ఫైనాన్షియల్‌ గ్రోత్‌ స్టోరీ’ పేరుతో రూపొందించిన సంయుక్త నివేదికలో తెలిపాయి.


ఈ విషయంలో ఎప్పుడూ అలర్ట్‌..

నీతి ఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రమణ్యం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. బ్యాంకు నుండి రుణాలు తీసుకునే మహిళలు ప్రధానంగా సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. అయినప్పటికీ ఈ మహిళల్లో చాలామంది క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకునే విషయంలో నిరంతరం అప్రమత్తమంగా ఉండటం విశేషం. నివేదిక ప్రకారం, 2019 నుంచి డిసెంబర్ 2024 మధ్య దాదాపు 2.7 కోట్ల మంది మహిళలు తమ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేసుకున్నారు. బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే మహిళల సంఖ్య పెరిగింది. క్రెడిట్ స్కోర్‌లను తనిఖీ చేసే యువతుల రేటు ఏటా దాదాపు 56 శాతం పెరుగుతోంది. 2023లో క్రెడిట్ స్కోరును పర్యవేక్షించుకున్న వారి సంఖ్య 17.89% కాగా, 2024కు 19.43 శాతానికి పెరిగింది.


వ్యక్తిగత రుణాలకే ప్రాధాన్యం..

2024లో మహిళలు ఫైనాన్స్ వ్యాపారాలకు కేవలం మూడు శాతం రుణాలు మాత్రమే తీసుకున్నారు. మొత్తంగా చూస్తే వ్యాపార ప్రయోజనాల కోసం తెరిచిన రుణ ఖాతాల సంఖ్య 2019 నుండి 4.6 రెట్లు పెరిగింది. ఇదిలా ఉంటే 42 శాతం మంది వ్యక్తిగత రుణాలు, కన్స్యూమర్ డ్యూరబుల్ రుణాలు, గృహ రుణాలు పొందగా..38 శాతం బంగారు రుణాల కోసం తీసుకున్నారు. మహిళా రుణగ్రహీతలలో 60 శాతం మంది పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారేనని నివేదిక పేర్కొంది. తీసుకున్న రుణాలను ఖర్చు చేయటంలో.. చెల్లించే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని.. నిత్యం క్రెడిట్ స్కోరు పర్యవేక్షించుకుంటూ అప్రమత్తంగా ఉన్నారని తెలిపింది. 2023తో పోల్చుకుంటే దేశంలోని మహిళల్లో ఆర్థిక విషయాల పట్ల అవగాహన పెరిగింది. ఆర్థికంగా పురుషులతో సమానంగా మహిళలు వృద్ధి సాధిస్తున్నారనేందుకు ఇదే సూచన.


ఉత్తరాది మహిళలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో రుణాలు అందుకున్న మహిళల శాతం అధికంగా ఉంది. దేశవ్యాప్తంగా 2.7 కోట్ల మంది మహిళా రుణగ్రహీతలుండగా, దక్షిణాది మహిళల వాటా 1.02 కోట్లు. అత్యధిక వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్‌)లో మాత్రం ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్ తదితర రాష్ట్రాలు ముందున్నాయి.


Read Also: షోరూంలో కార్ లేదా బైక్ కొంటున్నారా.. ఈ ఛార్జీలు ఎప్పుడూ చెల్లించకండి..

కుంభకోణం రూ.64 కోట్లు.. దర్యాప్తుకు రూ.250 కోట్లు.. మళ్లీ వార్తల్లోకి బోఫోర్స్ కేసు..

Home Schooling : స్కూల్‌కి నో నో.. ఇంటి వద్దే చదువులు.. మారుతున్న తల్లిదండ్రుల ఆలోచనా విధానం.. ఎందుకిలా జరుగుతోంది?

Updated Date - Mar 05 , 2025 | 06:33 PM