Share News

Mahakumbhamela : మహా కుంభమేళాలో.. ఐఐటీ బాబా..

ABN , Publish Date - Jan 14 , 2025 | 02:31 PM

మహాకుంభామేళాకు వచ్చిన కొందరు సాధువులు తమ విచిత్ర వేషధారణ, ఆహార్యం, అలవాట్లతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు 'IIT బాబా'గా పేరుగాంచిన ఒక సన్యాసి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఐఐటీ బాంబేలో ఎయిర్ స్పేస్ అండ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివి మసాని గోరఖ్ బాబాగా ఎలా మారాడన్న విషయం అంతటా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 Mahakumbhamela : మహా కుంభమేళాలో.. ఐఐటీ బాబా..
IIT Baba at MahaKumbha Mela

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళా ఘనంగా ఆరంభమైంది. తొలిరోజు నుంచే ఇందులో పాల్గొనేందుకు భారతదేశం నుంచే కాక ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు హాజరవుతున్నారు. త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించేందుకు సాధువులు, నాగసాధువులు, అఘోరాలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మహాకుంభం ప్రారంభమైనప్పటి నుంచి కోటి మందికి పైగా ప్రజలు స్నానాలు చేసినట్లు అంచనా. మహాకుంభానికి వచ్చిన కొందరు సాధువులు తమ విచిత్ర వేషధారణ, ఆహార్యం, అలవాట్లతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు 'IIT బాబా'గా పేరుగాంచిన ఒక సన్యాసి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అతడు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్‌గా మారింది. ఐఐటీ బాంబేలో ఎయిర్ స్పేస్ అండ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివిన మసాని గోరఖ్ బాబాగా ఎలా మారాడన్న విషయం అంతటా ఆసక్తిని రేకెత్తిస్తోంది.


హర్యానాకు చెందిన ఐఐటీ బాబా అసలు పేరు అభయ్ సింగ్. అభయ్ సింగ్ ఐఐటీ బాంబేలో నాలుగేళ్లు ఎయిర్ స్పేస్ అండ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివారు. ఇంజినీరింగ్ చదివే సమయంలోనే జీవితానికి అర్థం వెతికే క్రమంలో కొన్ని ఫిలాసఫీ కోర్సులు, పోస్ట్ మాడర్నిజం, సోక్రటీస్, ప్లేటో గురించి చదివానని మీడియాకు వెల్లడించాడు. తరువాత ఆర్ట్స్‌పై ఆసక్తితో డిజైనింగ్‌లో మాస్టర్స్ చేసినా.. ఆధ్యాత్మిక జ్ఞానం పెంచుకోవాలనే జిజ్ఞాసతో బాబాగా మారాడు. శివునికి తన జీవితాన్ని అంకితం చేశాడు. ఐఐటీలో ఇంజినీరింగ్ చదివి బాబాగా మారిన ప్రయాణం, ఆధ్యాత్మిక రహస్యాల గురించి ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా వివరించడంతో 'IIT బాబా' వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


ఐఐటీ బాంబేలో చదివి..

ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, 'IIT బాబా' తన జీవితానికి సంబంధించిన అనేక రహస్యాలను గురించి చెప్పాడు. ముంబైలో ఐఐటీ చదివే సమయంలో ఏదో చేయాలనే తపన ఉన్నా అర్థం కాలేదని, డిజైనింగ్ మాస్టర్స్ పూర్తి చేశాక సన్యాసిగా మారాలని నిశ్చయించుకున్నట్లు తెలిపాడు. సన్యాసిగా ఉండటమే తన జీవితంలో బెస్ట్ స్టేజ్ అని సమాధానమిచ్చాడు. "జ్ఞానాన్ని అనుసరించండి. మీరు ఎంత దూరమైనా వెళ్లినా చివరికి మీరు ఈ ప్రదేశానికి రావాలి." అని సందేశమిస్తున్నాడు. ఐఐటీ బాబాకు ఫోటోగ్రఫీ అంటే కూడా చాలా ఇష్టం.


ఫోటోగ్రఫీలో కూడా మనశ్శాంతి దొరక్క..

ఇంజినీరింగ్ చేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఫోటోగ్రఫీ చేయాలి అని భావించి ట్రావెల్ ఫోటోగ్రఫీకి శ్రీకారం చుట్టాడు ఐఐటీ బాబా. ఈ వృత్తిలో ఉంటే నిత్యం ప్రయాణాలు చేయవచ్చు. ఎక్కడెక్కడికైనా వెళ్లవచ్చు. సంపాదన, ఆనందం పొందుతూ కలల జీవితాన్ని గడపవచ్చని భావించాడు. అయినా, అనుకున్న విధంగా మనశ్శాంతి పొందలేక చివరికి బాబా అయ్యానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం త్రివేణి సంగమంలో మహాకుంభమేళాకు హాజరుకావడాన్ని ఆస్వాదిస్తున్నట్లు పేర్కొన్నాడు.

Updated Date - Jan 14 , 2025 | 02:33 PM