Share News

Hyderabad : లిఫ్ట్ ఇవ్వమని జాలిగా అడుగుతారు.. పోన్లే పాపమని ఇచ్చారో..

ABN , Publish Date - Jan 06 , 2025 | 09:49 AM

చీకటి పడగానే బస్టాండ్లు లేదా బస్టాప్‌లలో చేతిలో సంచితో వాలిపోతారు. ఎక్కాల్సిన బస్సు రానట్టుగా ఎదురుచూస్తూనే ఉంటారు. తర్వాత రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను అర్జెంటుగా పనుంది దయచేసి సాయం చేయండని అడుగుతారు. ఒంటరి మహిళ కదా.. పోన్లే పాపమని బండెక్కించుకున్నారో.. అంతే సంగతులు..

Hyderabad : లిఫ్ట్ ఇవ్వమని జాలిగా అడుగుతారు.. పోన్లే పాపమని ఇచ్చారో..
Asking Lift At Nights

చీకటి పడగానే బస్టాండ్లు లేదా బస్టాప్‌లలో చేతిలో సంచితో వాలిపోతారు. ఎక్కాల్సిన బస్సు రానట్టుగా ఎదురుచూస్తూనే ఉంటారు. తర్వాత రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను ఆపి అర్జెంటుగా పనుంది దయచేసి సాయం చేయండని అడుగుతారు. ఆ మాటలకు కరిగిపోయి పోన్లే పాపం ఒంటరి మహిళ అని బండెక్కించుకున్న కాసేపటికే అసలు పథకం అమలు చేస్తారు. ముందుగా మాటల్లోకి దించి ఎలాంటి వ్యక్తి అని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. పరువు కోసం తాపత్రయపడే వారని తెలిస్తే కొద్ది దూరం వెళ్లగానే డబ్బు ఇవ్వమని బెదిరిస్తారు. లేకపోతే వేధిస్తున్నావని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసి పరువు తీస్తామని గొడవకు దిగుతారు. మీద పడి జేబుల్లో ఉన్న డబ్బు, ఒంటిపై ఉన్న నగలు దోచేస్తారు. ఒకవేళ వలపు వలకు లొంగే తరహా అని తెలిస్తే ఇంకో తరహాలో ప్రవర్తిస్తారు. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లగానే పని మొదలుపెడతారు. కవ్వించే మాటలు, చేతలతో మభ్యపెట్టి లొంగదీసుకుని చెప్పిన చోటుకు రమ్మంటారు. అలా నమ్మి ఒంటరిగా గడిపేందుకు హోటళ్లకు వెళితే.. బంధువులకు యాక్సిడెంట్ అయింది. ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని చెప్పి డబ్బు గుంజుతారు. తాజాగా ఈ ముఠాలోని ఇద్దరు కిలాడీ లేడీలను అరెస్టు చేశారు లాలాగూడ పోలీసులు.


బైక్‌పై వెళ్తున్న వారినే లక్ష్యంగా చేసుకుని.. కొత్త తరహా దోపిడీకి తెరతీశారు కొందరు కిలేడీలు. రాత్రవగానే నగర శివారు ప్రాంతాల్లో చేరి వాహనదారులను లిఫ్ట్ అడుగుతూ..కొద్ది దూరం వెళ్లగానే ఏదో రకంగా బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. జాలిపడి లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఇలా ఇప్పటివరకూ జేబులు గుల్ల చేసుకున్న పురుషులు ఎందరో. డిసెంబర్ 31వ తేదీన అబిడ్స్‌కు చెందిన ఓ వ్యాపారి ఇలాంటి మహిళ నుంచి తప్పించుకునేందుకు నుంచి రూ.1.50 లక్షల నగదు, బంగారు గొలుసు ఇచ్చాడు. ఒక మహిళ కుటుంబీకుల ఎదుటే గొడవ సృష్టించడంతో పరువు పోతుందని భయపడి రూ.5లక్షలు ఇచ్చి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. బంజారాహిల్స్, కేబీఆర్‌ పార్క్‌, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్‌ మార్గ్ వద్ద ఎక్కువగా ఇలాంటి మహిళలు బైక్, కారులో వెళ్తున్న వారిని టార్గెట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.


ఇలాగే లిఫ్ట్ అడిగి డబ్బులు వసూళ్లు చేస్తున్న భాగ్య, లలితలను లాలాగూడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరు సికింద్రాబాద్ పరిధిలో ఒకరి నుంచి రూ.3.30 లక్షలు.. మరొకరి నుంచి రూ.2 లక్షలు కొట్టేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. చిలకలగూడ, వారాసిగూడ ప్రాంతాల్లోనూ మరో 10 మందిని ఇదే రీతిలో మోసానికి గురయినట్లు భావిస్తున్నారు. మధ్యవయసుకు చెందినవారే లక్ష్యంగా ఈ ముఠాకు చెందిన 10 మంది మహిళలు నగర, శివారు ప్రాంతాల్లో తిరుగాడుతున్నట్లు పోలీసులు తెలిపారు.


ఈ విషయంలో జాగ్రత్త..

పేదింటి మహిళలు, యువతులను ముఠాలో చేర్చుకుంటూ నగరంలోని కొందరు పాత నేరస్థులే ఈ తరహా దోపిడీ పాల్పడుతున్నట్లు సమాచారం. ఇలాంటి మహిళలు దుకాణాలు, హోటళ్లకు వెళ్లి సరకులు, శుభకార్యాలకు భోజనాలు అందించాలని ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారు. తర్వాత రాత్రుళ్లు ఫోన్ కాల్ ద్వారా ముగ్గులోకి దించి హోటళ్లకు రమ్మని చెబుతారు. పొరపాటున వెళితే అత్యాచారానికి పాల్పడ్డారనో, మీ నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో పెడతామనో బెదిరిస్తారు. అలా చేయకూడదంటే అడిగినంత డబ్బివ్వాలని డిమాండ్ చేస్తారు. కాబట్టి, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.

Updated Date - Jan 06 , 2025 | 10:31 AM