HARISH RAO:అందుకే కౌషిక్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.. హరీష్‌రావు షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jan 14 , 2025 | 11:23 AM
HARISH RAO: పోలీసులు తన పని తాను చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వినియోగించుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని.. 23శాతం క్రైమ్ రేట్ పెరిగిందని అన్నారు.. NCRB రిపోర్టు ప్రకారం హైదరాబాద్ ఎల్లో జోన్‌లో ఉందని... ఇదే పద్ధతి కొనసాగితే హైదరాబాద్ రెడ్ జోన్లకు వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు.
హైదరాబాద్(కోకాపేట): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిను రేవంత్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం పట్ల హరీష్‌రావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో హరీష్‌రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజకీయ ప్రేరేపిత కేసుల్లో తొందరపాటు పనిచేయదని తెలంగాణ డీజీపీ ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. బెయిలబుల్ సెక్షన్స్‌లో అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణమని హరీష్‌రావు ధ్వజమెత్తారు.
కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు..
ఇలాంటి కేసుల్లో నాయకులు చెబితే వినడం కాదు, చట్టాలకు లోబడి పని చేయాలని సూచించారు. బెయిలబుల్ కేసులని తెలిసి రాత్రంతా ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. బెయిలబుల్ సెక్షన్లకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పిందని.. కానీ కావాలనే పండుగ పూట డెకాయిట్ నో, టెర్రరిస్ట్ నో అరెస్ట్ చేసినట్లుగా పెద్ద సంఖ్యలో పోలీసులు వెళ్లి అరెస్టు చేయడం దుర్మార్గమని విరుచుకుపడ్డారు. పొలిటికల్ మోటివ్ కేసుల్లో ఎలా వ్యవహరించాలో అనేదానిపై పోలీసులకు డైరెక్షన్ ఇవ్వాలని డీజీపీని కోరుతున్నానని అన్నారు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ పండుగ అని కూడా చూడకుండా అరెస్టులు చేయడం మానుకోవాలని సూచించారు. కౌశిక్ రెడ్డి మీద 28 కేసులు ఉన్నాయి. అరెస్టు చేయాలని అంటున్నారు. అసలు ఈ కేసులు ఎవరు పెట్టారని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం రాకముందు కౌశిక్ రెడ్డి మీద ఒక్క కేసు కూడా లేదని గుర్తుచేశారు. రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించింది మీరు కాదా అని నిలదీశారు. 28 కేసులు మీరు పెట్టినవే కదా అని ప్రశ్నించారు. కలెక్టర్ ఆహ్వానం మేరకు కౌశిక్ రెడ్డి మీటింగ్‌కు వెళ్లారని... పిలవని పేరంటానికి ఆయన వెళ్లలేదని స్పష్టం చేశారు. మీటింగ్‌లో సభ్యుడిగా నువ్వే పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ను ప్రశ్నించాడు. ఇందులో తప్పేముందని హరీష్‌రావు అన్నారు.
రేవంత్ ప్రభుత్వానిది కక్ష సాధింపు.
ఒక కౌశిక్ రెడ్డి కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. పార్టీ మారిన పదిమంది శాసనసభ్యులను ప్రతి ఒక్కరూ అడుగుతూనే ఉంటారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి, బీఆర్ఎస్ పార్టీ బట్టలిప్పుతా అని సంజయ్ అంటే ఎలా ఊరుకుంటారని నిలదీశారు. నువ్వే పార్టీ తరుపున మాట్లాడుతున్నావని సంజయ్‌ను అడిగారు. ఇలా ప్రశ్నించడంలో కౌశిక్ రెడ్డి తప్పేం లేదని అన్నారు. దీనికి మూడు కేసులు పెడతారా. ఒక సంఘటన మీద ముగ్గురు వేర్వేరు ఫిర్యాదులు తీసుకుని కేసులు పెడతారా అని ప్రశ్నించారు. రేవంత్ కక్ష సాధింపు చర్యలకు ఇది నిదర్శనం కాదా? అని అడిగారు. ఒకే కేసులో మూడు ఎఫ్‌ఐఆర్‌లు పెట్టి, రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెట్టడం కక్ష సాధింపే కదా అని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో రాజకీయ కుట్రలో భాగంగా పెట్టిన కేసులు ఇవని చెప్పారు. ఒక్కరోజైనా కౌశిక్ రెడ్డిని జైల్లో పెట్టాలనే పగా, ప్రతికారం, కుట్రతో చేసిన అరెస్టే తప్ప మరొకటి కాదని అన్నారు. న్యాయస్థానాల మీద తమకు నమ్మకం ఉందని... కౌశిక్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం చాలా సంతోషమని చెప్పారు. ఇలాంటి చర్యలు ఇప్పటికైనా మానుకోవాలని డీజీపీని అప్పీల్ చేస్తున్నానని అన్నారు. పండుగ పూట పోలీసులను కూడా ఇబ్బందులు పెట్టడం, టెన్షన్ పెట్టడం సరికాదన్నారు. మీ కింది స్థాయి పోలీసులను, అధికారులను కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పాడని ఈ రకంగా అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే సంజయ్.. కౌశిక్ రెడ్డిని కూడా నెట్టారని ఆయనపై ఎందుకు కేసు నమోదు చేయలేదని హరీష్‌రావు ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం..
కౌశిక్ రెడ్డి మీదనే ఎందుకు కేసు నమోదు చేశారని నిలదీశారు. మీ పక్షపాత వైఖరి స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. రేవంత్ రెడ్డి ఏడాది పాలన పగా, ప్రతీకారంతోనే కొనసాగుతున్నదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, పోలీసులు చేయాల్సిన పని రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటమని చెప్పారు. పోలీసులు తన పని తాను చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వినియోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని.. 23శాతం క్రైమ్ రేట్ పెరిగిందని అన్నారు. NCRB రిపోర్టు ప్రకారం హైదరాబాద్ ఎల్లో జోన్‌లో ఉందని... ఇదే పద్ధతి కొనసాగితే హైదరాబాద్ రెడ్ జోన్‌లోకి వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు. తెలంగాణకు పెట్టుబడులు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హోంమంత్రిగా కూడా ముఖ్యమంత్రినే ఉండి తన బాధ్యతలు నిర్వర్తించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు. ఇప్పటికైనా కక్షపూరిత రాజకీయాలు మానుకొని పరిపాలనపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. మంత్రులు, మీడియా ముందు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తానని బహిరంగంగా సంజయ్ ప్రకటించారని గుర్తుచేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే సంజయ్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే సంజయ్‌ను అనర్హుడిగా ప్రకటించే బాధ్యత స్పీకర్ మీద ఉందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఎలా అంటారని హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం..
చర్యలు తీసుకోవాల్సింది పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలపైన అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా సంజయ్‌ను తమ పార్టీలోకి తీసుకోవద్దని చెబుతున్నాడు కదా అన్నారు. ఇంతకంటే స్పీకర్‌కి ఆధారాలు ఏం కావాలన్నారు. స్పీకర్ తక్షణమే ఎమ్మెల్యే సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని గుర్తుచేశారు. తెలంగాణ హైకోర్టులో అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉండటంతో ఆలస్యం అవుతుందని సుప్రీంకోర్టుకు వెళ్లామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నామన్నారు. త్వరలోనే సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వస్తాయని... న్యాయం నిలబడుతుందని స్పష్టం చేశారు. అనర్హత వేటు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పడుతుందని చెప్పారు. నిజాయితీ ఉంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచి సంజయ్ మాట్లాడాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Kaushik Reddy: కౌశిక్ రెడ్డికి బెయిల్
Harish Rao: కేటీఆర్, హరీష్‌రావును చుట్టుముట్టిన పోలీసులు.. అసలు కారణమిదే
Karimnagar: కౌశిక్‌రెడ్డి అరెస్ట్!
Harish Rao: రైతులు, కూలీలకు కాంగ్రెస్ కుచ్చుటోపీ!
Read Latest Telangana News and Telugu News