Hydra: అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరో కీలక నిర్ణయం
ABN , Publish Date - Jan 24 , 2025 | 07:36 PM
Hydra: అక్రమ నిర్మాణాలపై దూకుడుగా ఉన్న హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్మాణాలపై ప్రజల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తుండటంతో మరో అడుగు వేసింది.

హైదరాబాద్: అమీన్‌పూర్ మున్సిపాలిటీలో సమగ్ర సర్వేకు హైడ్రా సిద్ధమైంది. రహదారులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జాలపై హైడ్రా అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. అమీన్‌పూర్ మున్సిపాలిటీలో ఆక్రమణలపై నిగ్గు తేల్చే పనిలో హైడ్రా అధికారులు ఉన్నారు. తమ కాలనీలోని పార్కులు, రహదారులతో పాటు కొన్ని ప్లాట్లను పక్కనే ఉన్న గోల్డెన్ కీ వెంచర్స్ వారు ఆక్రమించారంటూ హైడ్రాకు వెంకటరమణ కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 152, 153లో ఉన్న వెంకటరమణ కాలనీలో హైడ్రా అధికారులు సర్వే చేశారు. పార్కులు, రహదారులు కబ్జాకు గురైనట్లుగా నిర్ధారణకు హైడ్రా అధికారులు వచ్చారు.
వెంకటరమణ కాలనీలోకి చొరబడి గోల్డెన్ కీ వెంచర్స్ ఆక్రమణలకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణ చేశారు. ఈ విషయంలో మరింత లోతైన సర్వే చేయించేందుకు హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియా , ఏడీ సర్వే సంయుక్త ఆధ్వర్యంలో జాయింట్ సర్వే చేసేందుకు హైడ్రా అధికారులు ప్రయత్నం చేశారు. అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని వెంకటరమణ కాలనీకి ఆనుకుని పలు కాలనీల నుంచి కూడా హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇలా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో సమగ్ర సర్వే చేసేందుకు హైడ్రా అధికారులు సిద్ధమయ్యారు. అందరి సమక్షంలో పారదర్శకంగా జరిగే ఈ సర్వేలో భాగస్వామ్యం కావాలని హైడ్రా అధికారులు కోరారు. హైడ్రా సర్వే అంటూ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులను గోల్డెన్ కీ వెంచర్స్ నిర్వాహకులతో పాటు.. పలువురు ఆక్రమణదారులు తప్పుదోవ పట్టిస్తున్నారు.
వారి ఆక్రమణలు కప్పి పుచ్చుకోడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఎవరూ బలి కావద్దని హైడ్రా అధికారులు సూచించారు. ఇప్పటికే పలు ఆరోపణల నేపథ్యంలో గోల్డెన్ కీ వెంచర్స్ ఆస్తులను ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసిన విషయం విధితమే. అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని ఆర్టీసీ కాలనీ, రంగారావు వెంచర్, చక్రపురి కాలనీ వాసులు కూడా ఏమైనా కబ్జాలుంటే ఫిర్యాదు చేయాలని.. ఈ సమగ్ర సర్వేలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తామని హైడ్రా అధికారులు చెప్పారు. అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని కాలనీ వాసులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని.. ఏమైనా ఫిర్యాదులుంటే హైడ్రా కార్యాలయానికి వచ్చి నేరుగా ఫిర్యాదు చేయాలని హైడ్రా అధికారులు సూచించారు.