MLA Anil :మరోసారి తెరపైకి నయీం ఆస్తుల వివాదం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jan 12 , 2025 | 01:12 PM
MLA Anil Kumar Reddy: బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే చూస్తు ఊరుకోమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఫైళ్ల శేఖర్ రెడ్డి 100 ఎకరాల వెంచర్లలో అసైన్డ్ భూములను, కాలువలను కబ్జా చేశారని ఆరోపించారు.
యాదాద్రి : బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తన స్థాయిని మరిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అడ్డగోలు మాటలతో తమ కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టారని ధ్వజమెత్తారు. ఇవాళ(ఆదివారం) భువనగిరి పట్టణంలో జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా స్థాయిని మరిచి మాట్లాడితే మా యూత్ కాంగ్రెస్ ఊరుకోదని హెచ్చరించారు. పైళ్ల శేఖర్ రెడ్డి తాను అడ్డుపడకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరేవారని అన్నారు. బీఆర్ఎస్ మొదటి ఐదేళ్ల పాలనలో భువనగిరిలో నయీమ్ ఆగడాలు జరిగాయని ఆరోపించారు. నయీమ్‌కు సంబంధించిన ఆస్తులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. నయీమ్ అనుచరులు చాలామంది బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైళ్ల శేఖర్ రెడ్డి 100 ఎకరాల వెంచర్లలో అసైన్డ్ భూములను, కాలువలను కబ్జా చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే చూస్తు ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. భువనగిరిలో కబ్జాలు జరిగితే అన్ని పార్టీల వారు ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.