Share News

ఆదాయం సమకూర్చుతున్నా చిన్నచూపు..

ABN , Publish Date - Feb 02 , 2025 | 04:16 AM

కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్‌డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయి.

ఆదాయం సమకూర్చుతున్నా చిన్నచూపు..

కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్‌డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయి. స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో రాష్ట్రం వాటా 5 శాతంగా ఉన్నా ఆమేరకు నిధులు కేటాయించలేదు. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో రూ.26 వేల కోట్లు కేంద్రానికి వెళ్లాయి. గతంలో కంటే 12% పెరిగింది. అయినా రాష్ట్రంపై చిన్నచూపు చూశారు. బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చినా మోదీ ప్రభుత్వం ద్రోహం చేసింది.

- దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, మంత్రి


ఇది గాడిద గుడ్డు బడ్జెట్‌

17.jpg

తెలంగాణకు కేంద్రం గాడిదగుడ్డు బడ్జెట్‌ ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందని చెప్పి బడ్జెట్లో వివక్ష చూపడం అన్యాయం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల.. తెలుగుగింటి కోడలై ఉండి కూడా తెలంగాణపై ప్రేమ చూపలేదు. ఇది బిహార్‌ ఎన్నికల బడ్జెట్‌లాగానే ఉంది. ఎన్నికల సమయంలో తెలంగాణకు ప్రధాని మోదీ, బీజేపీ నేతలు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

- మహే్‌షకుమార్‌ గౌడ్‌, టీపీసీసీ చీఫ్‌


తెలంగాణకు మళ్లీ ద్రోహం

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మళ్లీ ద్రోహం చేసింది. బడ్జెట్‌ను బీజేపీ రాజకీయ సాధనంగా వాడుకుంటోంది. త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు నిధులు మళ్లిస్తూ.. ఎన్నికలు లేని రాష్ట్రాలకు మొండిచేయి చూపుతోంది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టప్రకారం ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ధన్‌ ధాన్య కృషి యోజనలో తెలంగాణ రైతులను విస్మరించింది. బీజేపీని తెలంగాణ ప్రజలు ఎప్పటికి క్షమించరు.

-ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మంత్రి


బీజేపీ మ్యానిఫెస్టోలా ఉంది

తెలంగాణకు ప్రాధాన్యతనివ్వాలని సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో కలిసి కోరినా కేంద్రం మళ్లీ మొండిచెయ్యి చూపింది. బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలా సీతారామన్‌ ఐదుసార్లు బిహార్‌ పేరును ప్రస్తావించారు కానీ ఒక్కసారైనా తెలంగాణ పేరు వినిపించలేదు. కేంద్ర బడ్జెట్‌.. బీజేపీ మ్యానిఫెస్టోలా ఉంది.

-మల్లు రవి, ఎంపీ


మిరప బోర్డు ఎందుకివ్వరు?

కేంద్రం బిహార్‌కు మఖానా బోర్డు ఇచ్చినప్పుడు తెలంగాణకు మిరప బోర్డు ఎందుకివ్వదు? కొత్తగూడెంకు విమానాశ్రయం ఇవ్వాల్సి ఉన్నా బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే లేదు. బీజేపీకి అయోధ్య రాముడిపై ఉన్న ప్రేమ భద్రాద్రి రామయ్యపై ఎందుకు లేదు? నిధులు ఎందుకు ఇవ్వదు?

-ఆర్‌. రఘురామిరెడ్డి, ఎంపీ


పార్లమెంటులో పోరాడతాం

సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణకు ప్రాముఖ్యత ఇవ్వాలని కోరినా పట్టించుకోకపోవడం సరికాదు. కాంగ్రెస్‌ ఎంపీలందరం పార్లమెంటు వేదికగా పోరాడతాం.

-సురేష్‌ షెట్కార్‌, ఎంపీ


తెలంగాణపై కేంద్రం వివక్ష స్పష్టం

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై వివక్ష స్పష్టంగా కనిపించింది. బీజేపీకి అండగా ఉన్న ఏపీకి రూ.23 వేల కోట్లు కేటాయించి, తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు మంది ఉన్నా సాధించిందేమీ లేదు.

-కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి


ఇది కార్పొరేట్‌ అనుకూల బడ్జెట్‌

ఇది కార్పొరేట్‌ అనుకూల బడ్జెట్‌. సామాన్యులకు లబ్ధి చేకూర్చే ఏ పథకం ప్రకటించలేదు. తెలంగాణ ఊసే లేదు. ప్రజా వ్యతిరేక బడ్జెట్‌పై నిరసనలకు పిలుపునిచ్చాం. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా రావాల్సిన నిధులు రాబట్టలేకపోయారు.

-జాన్‌ వెస్లీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి


కిసాన్‌ క్రెడిట్‌ కార్డుపై గొప్పలే!

కేంద్ర బడ్జెట్‌ రైతులను నిరాశకు గురిచేసింది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు పెంచినట్లు గొప్పలు చెబుతున్నారు. కానీ ఈ కార్డులు తీసుకుని రైతులు వెళ్తే బ్యాంకులు రుణం ఇవ్వడం లేదు.

-పశ్యపద్మ, రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి


తెలంగాణ ఊసే లేదు

16.jpg

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ఊసే లేదు. మోదీ ప్రభుత్వానికి తెలంగాణ అంటే ఎంత చిన్నచూపో మరోసారి రుజువైంది. గత బడ్జెట్‌లో తెలంగాణ పేరు ఎత్తలేదు. ఈసారైనా ఉపయోగకరమైన ప్రాజెక్టులు ఏమైనా చేపడుతారని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తే.. మోదీ ప్రభుత్వం తన బుద్ధి చూపించింది. బిహార్‌లో ఎన్నికలు ఉన్నందున ఆ రాష్ట్రానికి బంగారుపళ్లెంలో వడ్డించారు.

- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌


జీడీపీకి 5.1% ఇస్తున్నా కూడా..

ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద ఎత్తున వరాలు ప్రకటించి ఎన్నికలు లేని రాష్ట్రాలను పట్టించుకోలేదు. తెలంగాణ నుంచి 8 బీజేపీ మంది ఎంపీలు, వారిలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా రాష్ట్రానికి సాధించిందేమీలేదు. కేంద్ర జీడీపీకి 5.1ు వాటా ఇస్తున్న తెలంగాణ మరోసారి మోసపోయింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం గిరిజన యూనివర్సిటీకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకపోవడం బాధాకరం. ఏడాది కాలంలో 30సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి తెలంగాణకు ఏం సాధించారో ప్రజలకు చెప్పాలి.

- బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు


తెలంగాణకు ఒక్కపైసా ఇవ్వలేదు

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలంగాణతో సత్సంబంధాలు ఉండి కూడా బడ్జెట్‌లో ఒక్కపైసా ఇవ్వలేదు. మామునూరు, కొత్తగూడెం, ఆదిలాబాద్‌ విమానాశ్రయాల గురించి ఎన్నో వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడిని స్వయంగా కలిపి విజ్ఞప్తి చేసినా స్పందించలేదు. పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇచ్చి నిధులు కేటాయించాలనే తెలంగాణ ప్రజల కోరికను పెడచెవిన పెట్టారు. రూ.12లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం మాత్రం బాగుంది.

- బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర


8 మంది బీజేపీ ఎంపీలు+8 మంది కాంగ్రెస్‌ ఎంపీలు= సున్నా

15.jpg

కాంగ్రెస్‌, బీజేపీలకు ఎనిమిది మంది చొప్పున ఎంపీలున్నా సాధించిన నిధులు సున్నా. తెలంగాణ పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని వెల్లడైంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం తన అసమర్ధతను మరోసారి నిరూపించుకుంది. పసుపు బోర్డు తరహాలోనే పనిచేస్తున్న స్పైసెస్‌, టీ, కాఫీ, రబ్బర్‌ బోర్డులకు నిధులు కేటాయించారు కానీ తెలంగాణ పసుపు బోర్డుకు గుండుసున్నా పెట్టారు. రైతు లు, ప్రజాసంక్షేమం, మహిళా సాధికారికత ఊసు లేని నిరర్థక బడ్జెట్‌ ఇది.

- కవిత, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ

Updated Date - Feb 02 , 2025 | 04:31 AM