Year Ender2022: ఆటుపోట్లు తట్టుకుని నిలబడ్డ భారత ఆర్థికం.. 2022లో కీలక ఘట్టాలివే..

ABN , First Publish Date - 2022-12-27T19:29:39+05:30 IST

ఆర్థికపరంగా (Indian Economy) 2022 భారత్‌కు ఎంతో ముఖ్యమైన ఏడాది. కరోనా సంక్షోభం (Corona Crisis) నుంచి కోలుకునే క్రమంలో ఈ సంవత్సరం ఎంతగానో ఉపకరించింది. కరోనా ప్రభావం, ఆంక్షలు క్రమంగా సడలిపోవడంతో పలు కీలక రంగాలు గాడినపడ్డాయి.

Year Ender2022: ఆటుపోట్లు తట్టుకుని నిలబడ్డ భారత ఆర్థికం.. 2022లో కీలక ఘట్టాలివే..

ఆర్థికపరంగా (Indian Economy) 2022 భారత్‌కు ఎంతో ముఖ్యమైన ఏడాది. కరోనా సంక్షోభం (Corona Crisis) నుంచి కోలుకునే క్రమంలో ఈ సంవత్సరం ఎంతగానో ఉపకరించింది. కరోనా ప్రభావం, ఆంక్షలు క్రమంగా సడలిపోవడంతో పలు కీలక రంగాలు గాడినపడ్డాయి. అయితే ధరల పెరుగుదల (Inflation) దేశవాసులను తెగ ఇబ్బంది పెట్టింది. ద్రవ్యోల్బణం పెరుగుదలకుతోడు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) వడ్డీ రేట్ల పెంపు (Rates hike) కూడా జనాలను ఆందోళనలకు గురిచేసింది. ఇక విదేశీ మారక నిల్వల్లో (Foreign exchange reserves) క్షీణత, రూపాయి (Rupee) విలువ పతనం, అంతర్జాతీయంగా మాంద్యం (Global recession) భయాలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయి. అయితే పలు అవరోధాల ప్రభావంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడిదొడుకులకు లోనైనప్పటికీ.. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం సవాళ్లను తట్టుకుని స్థిరంగా నిలబడింది. నూతన సంవత్సరం- 2023లోకి అడుగుపెట్టబోతున్న తరుణంలో 2022 ఏడాదిని పునరావలోకనం చేసుకుందాం..

1. సవాళ్లను అధిగమించి స్థిరత్వం బాటలో..

Untitled-8.jpg

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను (Global Economy) మాంద్యం (recession) భయాలు వెంటాడినప్పటికీ 2022లో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా నిలబడింది. జూన్ 2022 త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 13.5 శాతంగా నమోదయ్యింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే వృద్ధి రేటు చాలా ఎక్కువ. ఇక సెప్టెంబర్ 2022 త్రైమాసికంలో 6.3 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదయ్యింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia- Ukrain War) వంటి అంతర్జాతీయ పరిణామాలు, క్రూడ్ ఆయిల్ ధరల (Crude Oil rates) పెరుగుదల పరిణామాలు ఈ ఏడాదిలో భారత ఆర్థిక వ్యవస్థపై ఒకింత అవరోధాలుగా మారాయి. అయినప్పటికీ ఈ ప్రతికూలతలను అధిగమించి దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా నిలబడింది. కరోనా సంక్షోభంతో విలవిల్లాడిన పలు కీలక రంగాలు, సంస్థలు, కంపెనీలు, బ్యాంకులు, కార్పొరేటు సంస్థలు 2022లో రికవరీ బాట పట్టాయి. ముఖ్యంగా బ్యాంకులు చక్కటి ప్రగతిని నమోదు చేశాయి. అందుకే 2022 పటిష్ట ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచింది. ఇదే ఏడాది ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన అమెరికా(US), యూకేలు (UK) గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నాయి. మాంద్యం భయాలతో వృద్ధి రేటులో క్షీణతను చవిచూశాయి.

2. భయపెట్టిన ద్రవ్యోల్బణం

Untitled-9.jpg

ష్యా - ఉక్రెయిన్ యుద్ధం(Russia- Ukrain War), క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల (Crude Oil rates), దేశీయంగా పలు ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో 2022లో భారత్ తీవ్ర ద్రవ్యోల్బణం (Inflation) సవాళ్లను ఎదుర్కొంది. ఇంధనం నుంచి నిత్యావసరాలైన కూరగాయాలు, పప్పులు, వంటనూనెల ధరలు భగ్గుమన్నాయి. ధరల సెగతో సామాన్యులు గగ్గోలు పెట్టారు. ముఖ్యంగా ఏప్రిల్‌లో 8 ఏళ్ల గరిష్ఠ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) 7.79 శాతంగా నమోదయ్యింది. మే నెలలో 7.04 శాతం, జూన్‌లో 7.01 శాతం, జులైలో 6.71 శాతం, ఆగస్టులో 7 శాతం చొప్పున ఆందోళనకర స్థాయిలో ద్రవ్యోల్బణం రికార్డయ్యింది. సెప్టెంబర్‌లో మరింత ఎక్కువయ్యి 7.41 శాతంగా పెరిగి అక్టోబర్‌లో మూడు నెలల కనిష్ఠం 6.77 శాతానికి తగ్గింది. ఇక నవంబర్‌‌లో కాస్త ఉపశమనం కల్పిస్తూ 11 నెలల కనిష్ఠ స్థాయి 5.88 శాతానికి సడలింది. ధరల్లో గణనీయ తగ్గుదల ఇందుకు కారణమైంది. ఇక 2023లో ధరలు ఎలా ఉండబోతున్నాయో వేచిచూడాలి.

3. టాటా గ్రూప్ గూటికి ఎయిరిండియా..

Untitled-10.jpg

వ్యాపార - వాణిజ్య రంగాల్లో కంపెనీల విలీనాలు, కొనుగోళ్లు కొత్తమే కాదు. అయితే 2022లో చరిత్రలో నిలిచిపోయే పలు ముఖ్యమైన ఒప్పందాలు చోటుచేసుకున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయి దాదాపు మూత అంచున నిలిచిన విమానయాన సంస్థ ఎయిరిండియాను (AirIndia) టాటా గ్రూప్ (TATA Group) తిరిగి హస్తగతం చేసుకుంది. 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌గా జేఆర్‌డీ టాటా స్థాపించిన ఈ విమానయాన సంస్థను సుధీర్ఘకాలం తర్వాత 2022 జనవరిలో తిరిగి టాటా గ్రూపు గూటికి చేరింది. సుమారు రూ.18 వేల కోట్ల బిడ్‌తో దీనిని దక్కించుకుంది. స్పైస్‌జెట్ కంటే ఏకంగా రూ.2900 కోట్లు ఎక్కువ బిడ్‌తో దక్కించుకుంది. దేశీయంగా ఇతర కీలక ఒప్పందాల్లో ఎన్‌డీటీవీలో (NDTV) గౌతమ్ అదానీ(Gautham adani) అతిపెద్ద షేర్‌హోల్డర్‌గా అవతరించడం ముఖ్యమైనది. అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ (Adani Group) మీడియా విభాగం ఎన్‌డీటీవీలో (New Delhi Television Ltd) మెజారిటీ వాటా 29.18 శాతాన్ని కొనుగోలు చేసింది. మరోవైపు మల్టిఫ్లెక్స్ దిగ్గజాలు పీవీఆర్, ఐనాక్స్ లీజర్‌లు విలీనమయ్యి దేశంలోనే అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ ఉమ్మడి కంపెనీగా అవతరించాయి. ఇక అంబుజా సిమెంట్స్ (Ambuja cements), ఏసీసీ సిమెంట్(ACC cements) కంపెనీలను కొనుగోలు చేసి దేశంలోనే రెండవ అతిపెద్ద సిమెంట్ కంపెనీగా అదానీ గ్రూప్ నిలిచింది. మరోవైపు గత కొన్నేళ్లుగా ఊహాగానాలకే పరిమితమైన హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ (HDFC Limited), హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) విలీనం 2022లోనే కార్యరూపం దాల్చింది. ఇక అంతర్జాతీయంగా చూస్తే 44 బిలియన్ డాలర్ల భారీ డీల్‌తో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విటర్‌ను (Twitter) టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కొనుగోలు చేశారు.

4. ఆకాశమే హద్దుగా క్రూడ్ ధరలు..

Untitled-11.jpg

క్రూడ్ ఆయిల్ ధరలు (Crude Oil Prices) 2022లో భయపెట్టాయి. ఆకాశమే హద్దుగా దూసుకెళ్లడంతో భారత్ వంటి చమురు దిగుమతి ఆధారిత దేశాలు బెంబేలెత్తాయి. 2014 తర్వాత రికార్డ్ స్థాయిలో తొలిసారి బ్యారెల్ క్రూడ్ ధర 100 డాలర్ల మార్క్ దాటింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయం ఫిబ్రవరిలో గరిష్ఠంగా బ్యారెల్ క్రూడ్ (Barrel Crude) ఏకంగా 140 డాలర్ల మార్క్‌ను తాకింది. అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, ఫైనాన్షియల్ మార్కెట్లలో (Financial markets) అనిశ్చితి పరిస్థితులు ఇందుకు ఆజ్యం పోశాయి. ఈ ప్రభావంతో పేద దేశాలు ఆయిల్ దిగుమతుల భారాన్ని మోయలేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఈ పరిణామం కూడా ఒక కారణమే. గత రెండు నెలలుగా భారత్‌లో ఇంధన, ఆహార, నిత్యావసరాల ధరలు కాస్త అదుపులోకి వచ్చినట్టు కనిపిస్తున్నా కొన్ని దేశాల పరిస్థితుల్లో ఇంకా ఆందోళనకరంగానే కనిపిస్తున్నాయి.

5. రెపో రేటు పెంపు.. పెరిగిన ఈఎంఐల భారం..

Untitled-12.jpg

రోనా సమయంలో భారీగా తగ్గిన రెపో (Repo), రివర్స్ రెపో (Riverse Repo) రేట్లు 2022లో గణనీయంగా పెరిగాయి. ద్రవ్యోల్బణం కట్టడికిగానూ రంగంలోకి దిగిన కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) పలుమార్లు వడ్డీ రేట్లను పెంచింది. ఈ మేరకు ఆర్బీఐ మోనిటరీ కమిటీ నిర్ణయాలు తీసుకుంది. తదనుగుణంగా మే, జూన్, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో ఒక్కోసారి చొప్పున రెపో రేటు పెరిగింది. దీంతో ఫిబ్రవరి 2022లో 4 శాతంగా ఉన్న రెపో రేటు డిసెంబర్ 2022 నాటికి 6.25 శాతానికి చేరింది. దీంతో రుణగ్రహీతలపై ఈఎంఐల భారం పెరిగింది.

6. గింగిరాలు తిరిగిన రూపాయి..

Untitled-13.jpg

దేశీయ కరెన్సీ రూపాయి (Rupee) 2022లో గడ్డుకాలాన్ని చవిచూసింది. డాలర్ (Dollar) పరుగుల కారణంగా ఈ ఒక్క ఏడాదే రూపాయి దాదాపు 10 శాతం మేర బలహీనమైంది. ఆల్‌టైం కనిష్ఠ స్థాయిని (All time low) తాకాల్సి వచ్చింది. ఈ క్రమంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ తొలిసారి రూ.83 మార్క్‌ను దాటింది. అంతర్జాతీయంగా డాలర్‌ మరింత బలపడటం, ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణ, ఇతర కారణాలు రూపాయిని తెగఇబ్బందులు పెట్టాయి. ముడిచమురు ధరలు ఎగబాకడం, ట్రేడర్ల రిస్క్‌ తగ్గించుకునే వైఖరి కూడా రూపాయిపై ఒత్తిడికి కారణమయ్యాయి. ఆందోళనకర స్థాయిలో రూపాయి విలువ తగ్గడంతో కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంది.

7. స్టాక్ మార్కెట్ల కంటే బ్యాంకు ఎఫ్‌డీలు నయం..

Untitled-14.jpg

రోనా సంక్షోభం తర్వాతి ఏడాదయిన 2022లో దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock markets) ప్రదర్శన ఇన్వెస్టర్లను నిరాశపరించిందనే చెప్పాలి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంపు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం, మాంద్యం హెచ్చరికల భయాలు మార్కెట్ల అటుపోట్లకు కారణమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 52 వారాల కనిష్ఠ స్థాయి నుంచి 6 నెలల్లోనే 25 శాతం మేర కోలుకున్నప్పటికీ.. ఏడాది మొత్తంగా చూస్తే 3 శాతానికి (26 డిసెంబర్ 2022 నాటికి) దగ్గరగా మాత్రమే వృద్ధిని నమోదు చేశాయి. సెన్సెక్స్ (sensex) కంటే బ్యాంక్ ఎఫ్‌డీలు (Bank deposites) మెరుగైన ఫలితాలు అందించాయి. ఇక ఫిబ్రవరి 15, 2022న మార్కెట్లు అత్యధికంగా లాభపడగా.. ఫిబ్రవరి 24, 2022 అత్యధిక నష్టాలను చవిచూశాయి. దీనినిబట్టి కొవిడ్ తర్వాత మార్కెట్లలో డబ్బు సంపాదించడం అంత సులభం కాదనే పాఠాన్ని 2022 ఇన్వెస్టర్లు గ్రహించేలా చేసింది.

8. ఇన్వెస్టర్లను నిరాశపరిచిన ఎల్‌ఐసీ ఐపీవో...

Untitled-15.jpg

దేశీయ, అంతర్జాతీయ పరిణామాల కారణంగా 2022లో భారత ఈక్విటీ మార్కెట్లు అనిశ్చితిని చవిచూశాయి. అయితే ఒడిదొడుకుల పరిస్థితులు ఉన్నప్పటికీ పలు కంపెనీలు ఐపీవోకి (initial public offering) వచ్చాయి. ఇందులో ఎల్‌ఐసీ ఐపీవో (LIC IPO) ప్రధానమైనది. రూ.6 లక్షల కోట్ల మార్కెట్ వ్యాల్యూయేషన్‌తో దేశంలోనే అతిపెద్ద ఐపీవో(initial public offering)గా చరిత్ర సృష్టించిన ఎల్ఐసీ(Life Insurance Corp of India) ఇన్వెస్టర్లను తీవ్రంగా నిరాశపరిచింది. ఐపీవో ప్రైస్ ఒక్కో షేరు రూ.949 కంటే 7.8 శాతం నష్టంతో లిస్టయ్యాయి. ఆ తర్వాత కూడా షేర్లు నష్టాల బాటులోనే కొనసాగాయి. ఇన్వెస్టర్ల ఆశలను తలకిందులు చేస్తూ లిస్టింగ్ అయిన 20, మే 2022 నుంచి డిసెంబర్ 23, 2022 వరకు మొత్తం 20.3 శాతం క్షీణించింది. మరోవైపు ఇదే 2022లో డెలివరీ ఐపీవో (Delhivery IPO), క్యాంపస్ యాక్టివేర్ ఐపీవో (Campus Activewear), రెయిన్‌బో చిల్డ్రెన్ మెడికేర్ (Rainbow Children's Medicare), అదానీ విల్మర్ ఐపీవో (Adani Wilmar IPO), బికజీ ఫుడ్స్ ఐపీవో (Bikaji Foods), హర్ష ఇంజనీర్స్, డ్రీమ్‌ఫోల్క్స్ సర్వీసెస్, సుల వినెయార్డ్స్, రుచి సోయ ఎఫ్‌ఫీవోలు (Ruchi Soya FPO) దేశీయ మార్కెట్లలో లిస్టింగ్ అయ్యాయి.

8. నిరుద్యోగం కోరలు.. ఐటీలో తొలగింపులు..

Untitled-16.jpg

2022లో నిరుద్యోగం కోరలు చాచింది. జనవరి - నవంబర్ 2022 మధ్య నిరుద్యోగం రేటు 1.4 శాతం మేర పెరిగినట్టు సీఎంఐఈ (సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ) గణాంకాలు చెబుతున్నాయి. ఏడాది ఆగస్టులో నిరుద్యోగం గరిష్ఠ స్థాయికి చేరిందని చెప్పడం పరిస్థితులకు అద్దంపడుతోంది. ఇందుకు బలం చేకూర్చేలా దేశీయ ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఊడిపోయాయి. గ్లోబల్ దిగ్గజ కంపెనీలు సైతం ఉద్వాసనలకు దిగాయి. మరోవైపు దేశీయ ఐటీ రంగంలో మూన్‌లైటింగ్ (Moonlighting) పెద్ద చర్చనీయాంశమైంది. ఒక కంపెనీ ఉద్యోగిగా కొనసాగుతూనే మరో కంపెనీకి పనిచేయడాన్ని వ్యవహరించిన ‘మూన్‌లైటింగ్‌’ను పలు ఐటీ కంపెనీలు బాహాటంగానే వ్యతిరేకించాయి. విప్రో సహా పలు కంపెనీ తమ ఉద్యోగులపై వేటు కూడా వేశాయి. అయితే కంపెనీలు సడలింపులు ఇవ్వడం వంటి పరిణామాలు వార్తల్లో నిలిచాయి.

9. విదేశీ మారక నిల్వల్లో హెచ్చుతగ్గులు..

Untitled-17.jpg

యూఎస్ డాలర్ (Dollar) ఆకాశమే హద్దుగా దూసుకెళ్లడం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, దిగుమతుల చెల్లింపుల ప్రభావ ఫలితంగా 2022లో భారత విదేశీ మారక నిల్వల్లో (Foreign Exchange Reserves) హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణ ప్రభావంతో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఫారెక్స్ నిల్వలు ఆందోళనకర స్థాయిలో క్షీణించాయి. దిద్దుబాటు కోసం రంగంలోకి దిగిన ఆర్బీఐ (RBI) పలు కీలకమైన చర్యలు తీసుకుంది. ఈ ప్రభావంతో అక్టోబర్ 28 చివరి వారం నుంచి విదేశీ మారక నిల్వల్లో పెరుగుదల మొదలైంది. ఏదేమైనప్పటికీ 2022 పలు నెలల్లో ఫారెక్స్ రిజర్వులు కనిష్ఠ స్థాయిలను చవిచూశాయి. ముఖ్యంగా జులై 2020 నాటి అత్యుల్పస్థాయి 2022లోనే నమోదవ్వడం గమనార్హం.

10. నేలరాలిన పలువురు దిగ్గజాలు..

Untitled-18.jpg

దేశ ఆర్థిక వ్యవస్థకు పలు విధాల ఎంతో ముఖ్యమైన 2022లో దేశం పలువురు వ్యాపార-వాణిజ్య రంగాల ప్రముఖలను కోల్పోయింది. ఇండియన్ ఆటో ఇండస్ట్రీ ఛాంపియన్‌గా పేరొందిన బజాజ్ గ్రూప్ గౌరవ చైర్మన్ రాహుల్ బజాజ్ (Rahul Bajaj) ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూశారు. షాపూర్జీ పల్లోంజి గ్రూప్ దిగ్గజం, ఇండియన్-ఐరిష్ బిజినెస్ టైకూన్ పల్లోంజి షాపూర్జీ మిస్త్రీ (shapoorji mistry) ఈ ఏడాది జూన్‌లో చనిపోయారు. కాగా ఇదే షాపూర్జీ పల్లోంజి గ్రూప్‌ ఎండీ, బిజినెస్‌మ్యాన్ సైరస్ మిస్త్రీ (Cyrus Mistry) ఈ ఏడాది సెప్టెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. మరో భారత దిగ్గజం, ఇండియన్ వారెన్ బఫెట్‌గా గుర్తింపు పొందిన దలాల్ స్ట్రీట్ మొఘల్ ‘రాకేష్ ఝున్‌ఝున్‌వాలా’ (rakesh jhunjhunwala) ఆగస్టు 14, 2022న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఇక ఇండియా స్టీల్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన ‘జెంషెడ్ జే ఇరానీ’ అక్టోబర్‌లో, టొయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ నవంబర్‌లో కన్నుమూశారు. మరోవైపు బెవరేజీ బ్రాండ్ రస్నా అరిజ్ పిరోజ్‌షా ఖంబటా కూడా నవంబర్‌లో, సుజ్లాన్ ఎనర్జీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తులసి తంతి అక్టోబర్‌లో ప్రాణాలు వదిలారు.

11. గ్లోబల్ ఎకానమీని వెంటాడిన మాంద్యం..

Untitled-19.jpg

నూహ్య అనిశ్చితి పరిస్థితులు, అకస్మాత్తు పరిణామాలు 2022లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను (Globan Economy) ఒడిదొడుకులకు గురిచేశాయి. ఏడాది ఆరంభంలో కొవిడ్-19 (Covid-19) కొంత ప్రతికూల ప్రభావం చూపించినప్పటికీ ఆ తర్వాత కరోనా పరిస్థితులు క్రమంగా తొలగిపోయాయి. దేశాల మధ్య వర్తక, వాణిజ్య కార్యకపాలు ఊపందుకున్నాయి. అయితే ఉక్రెయిన్-రష్యా యుద్ధం, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల పరిణామాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ఆందోళనకు గురిచేశాయి. ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడాయి. యూఎస్ఏ(USA), యూకే (UK), ఫ్రాన్స్ (France) సహా ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నీ తీవ్ర ద్రవ్యోల్బణంతో తెగ తంటాలు పడ్డాయి. యూఎస్, యూకే దేశాల జీడీపీ వృద్ధి (GDP Gwoth) రేటు వరుసగా రెండు త్రైమాసికాలపాటు క్షీణించింది. ఈ పరిస్థితులన్ని చూస్తే ఆర్థిక మాంద్యం వచ్చినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వంటి వ్యాపార దిగ్గజాలు ఆందోళనలు వ్యక్తం చేశారు. ఇక మెటా, అమెజాన్, సేల్స్‌ఫోర్స్, ట్విటర్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.

Updated Date - 2022-12-27T20:43:55+05:30 IST