Pawan Kalyan: పదవులన్నీ ఒకే కులంతో నింపేస్తారా
ABN , First Publish Date - 2023-10-02T19:16:11+05:30 IST
వైసీపీ(YCP) కీలక పదవులన్నీ ఒక కులంతో నింపేస్తే..అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్(Pawan Kalyan) వ్యాఖ్యానించారు.
మచిలీపట్నం: వైసీపీ(YCP) కీలక పదవులన్నీ ఒక కులంతో నింపేస్తే..అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్(Pawan Kalyan) వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లాలో నాలుగో విడత వారాహి యాత్ర(Varahi Yatra)లో భాగంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ..‘‘ ఒక్క కులం వల్ల అధికారం రాదు. జనసేన ప్రాంతీయ పార్టీ కాదు..దేశ సమగ్రతను దృష్టిలోపెట్డుకొని ఆవిర్బవించిన పార్టీ. జనసేన విశాల భావం ఉన్న పార్టీ. భవిష్యత్‌లో జనసేన(Janasena) ఆలోచన దేశవ్యాప్తంగా వెళుతుంది. నేను కాపు కులంలో పుట్టాను. అలా అని కేవలం కాపు ఓటు బ్యాంక్ తీసుకుంటే ఎక్కడ ఎదుగుతాం. అలా ఆలోచిస్తే కుల నేతల్లా మిగిలిపోతాం. ఒక కులానికి అంటగట్డి నన్ను ఎందుకు కులనేతను చేస్తారు. కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించమన్నాను. ఏపీలో కాపులు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టే అలా అన్నా. కాపు కులంలో పుట్టినా.. అన్ని కులాలను సమదృష్టిలో చూస్తా. నేను కులాలను వెదుక్కుని స్నేహాలు చేయను. ఒక కులానికి మరో కులం పట్ల ఎందుకు ద్వేషం ఉండాలి? సామాజిక వెనుకుబాటును ఎలా రూపుమాపాలా అని ఆలోచించాలి.
బీఎస్పీ(BSP) 20 ఏళ్లు కష్టపడితే మాయావతి(Mayawati) సీఎం అయ్యారు. పార్టీ పెట్టగానే సీఎం అయిపోవాలని, లేడికి లేచిందే పరుగులా ఆలోచించను. ఎన్టీఆర్‌కి మాత్రమే అలా సాధ్యమైంది. రాజధాని ఎక్కడ అంటే మూడు చోట్ల అని చెప్పుకోవాలా..? తెలుగుదేశాన్ని పాలసీ పరంగానే విభేదించాను.. రాజధానికి ముప్పైవేల ఎకరాల గురించి విభేదించాను.వైసీపీ మీద వ్యక్తిగతం ద్వేషంలేదు. చిన్నప్పటి నుంచి జగన్‌ని చూస్తున్నాను. టీనేజ్‌లో ఎస్ఐని కొట్డిన ఘటన చూశాను. జగన్ రాష్ట్రానికి సరికాదని మద్దతు ఇవ్వలేదు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ భారత రాష్ట్ర సమితి అయిపోయింది. సనాతన ధర్మాన్ని బలంగా నమ్ముతాను, సర్వమతాలను ఆదరించే నేల అదే సనాతన ధర్మం. లోతైన దృష్టితోనే రాజకీయాలను చూడాలి.నైతిక బలం ఉంటే ఎవరిపైనైనా పోరాటం చేయగలం.వెన్నుపోటు పొడిచేవాడు ఎప్పుడూ మనలోనే ఉంటాడు.ఇది ప్రాంతీయ పార్టీ కాదు.మున్ముందు జనసేన భావజాలమే దేశమంతా వ్యాప్తిస్తుంది’’ అని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.