Rishikonda : ప్రజావేదిక అక్రమమైతే.. ‘రుషికొండ’ సక్రమమా..?

ABN , First Publish Date - 2023-08-14T02:50:17+05:30 IST

‘మాట తప్పను.. మడమ తిప్పను’.. ముఖ్యమంత్రి జగన్‌ ఎప్పుడూ చెప్పే మాట ఇది. ఏదైనా ఓ నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉండాలి కదా..! తాను చెప్పిన మాటను తానే ఉల్లంఘిస్తే..? విశాఖ (Visakhapatnam)లోని రుషికొండపై నిర్మాణాల విషయంలో జగన్‌ వైఖరి ఇలాగే ఉంది. నాడు అక్రమ కట్టడమని ప్రజావేదిక (Prajavedika)ను కూల్చివే యించారు.

Rishikonda : ప్రజావేదిక అక్రమమైతే.. ‘రుషికొండ’ సక్రమమా..?

జగన్‌ లెక్క ప్రకారం కూల్చాల్సిందేగా!

రుషికొండపై అడ్డగోలుగా నిర్మాణాలు

కోస్తా నియంత్రణ మండలి పరిధిలో కొండ

అక్కడ పర్యాటకుల కోసమే నిర్మాణాలు

పాలనా కార్యాలయాలకు అనుమతి లేదు

అయినా పర్యాటకుల కోసమని చెప్పి

సీఎం కార్యాలయం కోసం నిర్మాణాలు

సీఆర్‌జెడ్‌ నిబంధనలు తుంగలోకి

రిసార్ట్‌ కూల్చి.. మట్టిని తవ్వి అమ్మేశారు

ఉల్లంఘనలు నిజమేనన్న కేంద్ర కమిటీ

హైకోర్టు, ఎన్జీటీలో కొనసాగుతున్న కేసులు

అయినా ఆగని అడ్డగోలు నిర్మాణాలు

జగన్‌ లెక్క ప్రకారం కూల్చాల్సిందేగా!

రుషికొండపై అడ్డగోలుగా నిర్మాణాలు

‘‘కలెక్టర్లు, సెక్రటరీలు, విభాగాధిపతులు, నాతో (ముఖ్యమంత్రి) సహా మంత్రులందరూ ఇక్కడే (ప్రజావేదిక) ఉన్నాం. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవనమిది. చట్టానికి వ్యతిరేకంగా, అవినీతితో కట్టిన భవనం. ఇది చెప్పడానికే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించా. ప్రభుత్వంలో ఉన్న మనమే నిబంధనలను అతిక్రమిస్తే... రేప్పొద్దున ఇలా చేయొద్దని ఇతరులకు చెప్పే నైతికత మనకుంటుందా? మనం రోల్‌ మోడల్‌గా ఉండాలి. ఇదే హాలు నుంచి ఆదేశాలు జారీ చేస్తున్నా. ఈ హాలులో ఇదే ఆఖరి సమావేశం. రేపు ఎస్పీల సమావేశం అయిపోతోంది. ఎల్లుండి ఈ భవనం నుంచే కూల్చివేత మొదలవుతుంది’’

- ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో

ప్రజావేదిక నుంచి జగన్‌ చేసిన వ్యాఖ్యలివి.

మరి రుషికొండ నిర్మాణాల సంగతేమిటి..? సీఆర్‌జెడ్‌ నిబంధనలకు విరుద్ధంగా కడుతున్న ఆ నిర్మాణాలు సక్రమమెలా అవుతాయి.. అసలు అక్కడ సాగుతున్న ఉల్లంఘనలపై ప్రత్యేక కథనం..

నాడునేడు

పదవిలోకి వస్తూనే ప్రజావేదిక నిబంధనలకు విరుద్ధమంటూ కూల్చివేతకు ఆదేశాలిచ్చిన జగన్‌. రుషికొండ(Rushikonda)లో చేస్తున్నదేంటి? అక్కడ సాగుతున్న నిర్మాణాలు సక్రమమేనా..? సీఆర్‌జెడ్‌ నిబంధనల ప్రకారం అక్కడ పర్యాటకుల కోసం తప్ప పరిపాలనా భవనాలు నిర్మించరాదు. అయినా రుషికొండను ఇష్టానుసారం తవ్వేసి బోడిగుండు చేసేశారు. అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించారని సాక్షాత్తూ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కమిటీనే స్పష్టం చేసింది. గతంలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తామన్న జగన్‌(Jagan)... ఇప్పుడు రుషికొండలో ఎలా కడుతున్నారు? అక్రమంగా నిర్మిస్తున్న భవనాల్లో ఎలా ఉంటారు? ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ప్రజావేదిక లాగా ఈ నిర్మాణాలను కూడా కూల్చి వేయాల్సిందే కదా..! నిబంధనల ప్రకారం కూడా కూల్చాల్సిందే..!

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ‘మాట తప్పను.. మడమ తిప్పను’.. ముఖ్యమంత్రి జగన్‌ ఎప్పుడూ చెప్పే మాట ఇది. ఏదైనా ఓ నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉండాలి కదా..! తాను చెప్పిన మాటను తానే ఉల్లంఘిస్తే..? విశాఖ (Visakhapatnam)లోని రుషికొండపై నిర్మాణాల విషయంలో జగన్‌ వైఖరి ఇలాగే ఉంది. నాడు అక్రమ కట్టడమని ప్రజావేదిక (Prajavedika)ను కూల్చివే యించారు. ఇప్పుడు నిబంధనలన్నీ ఉల్లంఘించి రుషికొం డపై నిర్మాణాలు చేపడుతున్నారు. అయినా అధికార పార్టీ నేతలు, మంత్రులు అడ్డగోలుగా సమర్థించుకుంటున్నారు. రుషికొండపై ప్రభుత్వ భూమిలో ప్రభుత్వమే నిర్మాణం చేపడుతుంటే... అది అక్రమమని ప్రతిపక్షాలు గోల చేయడం దారుణమని ఆరోపిస్తున్నారు. అక్కడ ఉల్లంఘనలేమీ జరగడం లేదని, అంతా నిబంధనల ప్రకారమే చేస్తున్నామని, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికే అవాస్తవాలు మాట్లాడుతున్నారని అంటున్నారు. అయితే రుషికొండ నిర్మాణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక వాస్తవాలను దాచిపెడుతోంది. పలు నిబంధనలను ఉల్లంఘించింది. ఇచ్చిన అనుమతుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు జరుగుతున్నాయని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్‌) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీయే స్పష్టం చేసింది.

సీఆర్‌జెడ్‌ పరిధిలో ఉన్నా..

రుషికొండ కోస్తా నియంత్రణ మండలి (సీఆర్‌జెడ్‌) పరిధిలో ఉంది. అటువంటి ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి కోసం, పర్యాటకులకు ఉపయోగపడే గదులు, రిసార్టులు మాత్రమే నిర్మించాలి. ఇది సీఆర్‌జెడ్‌ నిబంధన. కానీ ఇక్కడ పర్యాటకుల కోసమని చెప్పి సీఎం కార్యాలయం కోసం భవనాలు నిర్మిస్తున్నారు. సీఆర్‌జెడ్‌లో పరిపాలనా కార్యాలయాలు నిర్మించరాదు. జీవీఎంసీకి సమర్పించిన ప్లాన్‌లో కూడా పర్యాటక భవనాలంటూ బ్లాక్‌లకు కళింగ, చోళ వంటి పేర్లు పెట్టారు. కానీ ఇక్కడ సీఎం కోసం పెద్ద ఎత్తున నిర్మాణాలు చేస్తున్నారు.

రిసార్ట్స్‌ కూల్చివేసి..

రుషికొండపై గతంలో హరిత రిసార్ట్స్‌(Harita Resorts) ఉండేవి. 1984లో కేంద్రం అనుమతితో పర్యాటకుల కోసం 34 గదులు నిర్మించారు. 2004-09 మధ్య కాలంలో రూ.15 కోట్లు ఖర్చు చేసి మరో 25 గదులు నిర్మించారు. 2019లో రెండు కోట్ల రూపాయలతో 22 గదులను ఆధునికీకరించారు. వీటి ద్వారా ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థకు ఏటా రూ.30 కోట్ల ఆదాయం వచ్చేది. అయితే విశాఖలో సీఎం కార్యాలయం నిర్మాణం కోసం హరిత రిసార్ట్స్‌ కూల్చేశారు. భవనాలు పటిష్ఠంగా ఉన్నా, వాటి ద్వారా ఆదాయం వస్తున్నా, పర్యాటక ఆదరణ ఉన్న రిసార్ట్స్‌ను కేవలం సీఎం కొత్త కార్యాలయం కోసం నేలమట్టం చేశారు.


ఎన్నో ఉల్లంఘనలు

ఒక కొండపై భారీ నిర్మాణం (59 గదులు) కూల్చినప్పుడు వచ్చే పర్యావరణ నష్టం ఏమిటో అంచనా వేసి దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలి. కానీ ఇక్కడ అటువంటిదేమీ లేకుండా కూల్చేశారు.

రుషికొండపై ఏపీటీడీసీకి 69 ఎకరాల భూమి ఉన్నా... అందులో 9.88 ఎకరాల్లోనే నిర్మాణాలకు గతంలో ఎంఓఈఎఫ్‌ అనుమతి ఇచ్చింది. 4.5 ఎకరాల్లో హరిత రిసార్ట్స్‌ నిర్మించారు. వాటిని కూల్చి ఆ స్థానంలో కొత్త భవనాలు నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కోరింది. పాత నిర్మాణాలు ఎంత విస్తీర్ణంలో ఉంటే అంతే విస్తీర్ణంలో కొత్త భవనాలు నిర్మించాలని ఎంఓఈఎఫ్‌ స్పష్టం చేసింది. అంటే 4.5 ఎకరాల్లోనే కొత్త భవనాలు నిర్మించాలి. కానీ కొండను ఇష్టానుసారం తవ్వేశారు. హైకోర్టు సూచన మేరకు ఎంఓఈఎఫ్‌ నిపుణులతో వేసిన కమిటీ ఈ విషయాన్ని నిర్ధారించింది.

బీచ్‌ నుంచి 200 మీటర్ల దూరం అవతల నిర్మాణాలు చేపట్టాలనేది నిబంధన. కానీ ఇప్పుడు నిర్మిస్తున్న వాటిలో కొన్ని భవనాలు బీచ్‌కు 200 మీటర్ల లోపలే ఉన్నాయి.

నిర్మాణాలకు అవసరమైన నీటి కోసం అక్కడ ఎటువంటి బోర్లు వేయకూడదు. నీటిని యంత్రాలతో తోడకూడదు. కానీ బోర్లు వేసి నీటిని తోడుతున్నారు.

భారీ నిర్మాణాల కోసం కొండను 20 ఎకరాలకు పైగా తవ్వేశారు. ఆ మట్టిని ఏపీటీడీసీ ఇంజనీరింగ్‌ అధికారులు మొదట్లో అమ్మేసుకున్నారు. ఫిర్యాదులు వెళ్లడంతో ఆ తరువాత ఆ మట్టిని ఎక్కడ వేయాలో తెలియక తీసుకువెళ్లి తొట్లకొండ, మంగమారిపేట బీచ్‌ల్లో డంప్‌ చేశారు. ఇది కూడా ఉల్లంఘనే.

నిర్మాణాల కోసం తవ్విన మట్టిని ఎక్కడికీ తరలించకూడదని, అక్కడే నిల్వ చేయాలని, నిర్మాణాలు పూర్తయిన తరువాత దానిని ఉపయోగించాలని ఎంఓఈఎఫ్‌ సూచించింది. కానీ ఏపీటీడీసీ అధికారులు లక్షల టన్నుల మట్టిని బీచ్‌లలో నింపేశారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లడంతో కలెక్టర్‌ అనుమతితో ఓ చోట భూమి తీసుకొని అక్కడ వేశారు.

ఈ ప్రాంతం వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్‌-2021లో ‘కన్జర్వేటివ్‌’ జోన్‌లో ఉంది. అంటే పరిరక్షించాల్సిన ప్రాంతం. అలాంటి చోట నిర్మాణాలు చేపడితే వీఎంఆర్‌డీఏ నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలి. మట్టి తవ్వకాలకు గనుల శాఖ అనుమతి తీసుకోవాలి. చెట్లను తొలగించడానికి రెవెన్యూ, అటవీ శాఖల అనుమతి తీసుకోవాలి. అయితే ఏ శాఖలనూ అటువైపు కన్నెత్తి చూడనీయలేదు.

జీవీఎంసీకి 61 ఎకరాల్లో నిర్మాణాలు చేపడతామని భారీ ప్లాన్‌ సమర్పించారు. దాని ప్రకారం లెక్క గట్టి రూ.19.05 కోట్లు ఫీజు కట్టాలని నోటీసు ఇచ్చింది. ఆ మొత్తం ఇప్పుడు కట్టలేరని, తరువాత వాయిదాల ప్రకారం చెల్లిస్తారంటూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ చీఫ్‌ సెక్రటరీ శ్రీలక్ష్మి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.

పర్యాటకుల కోసం నిర్మిస్తున్న భవనాలు కాదు కాబట్టి నిబంధనల ప్రకారం కూల్చేయడానికి అవకాశం ఉంది. ఈ స్థలంలో ఎటువంటి కార్యాలయాలు నిర్వహించడానికి వీల్లేదు. పర్యాటకులు మాత్రమే అందులో ఉండాలి.

హైకోర్టు, ఎన్జీటీలో కేసులు

రుషికొండ నిర్మాణాలపై విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌లు వేర్వేరుగా హైకోర్టులో కేసులు వేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఎన్‌జీటీలో ఫిర్యాదు చేశారు. వీరంతా అక్రమ నిర్మాణాలపై ఫొటోలతో సహా ఫిర్యాదు చేయగా... అవన్నీ తప్పు అంటూ ప్రభుత్వం వాదించింది. దాంతో హైకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి పరిశీలనతో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ కమిటీ ఇక్కడ పరిశీలించింది. పలు నిబంధనలు ఉల్లంఘించారని, అనుమతించిన దాని కంటే అధిక విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టారని నివేదించింది. దీనిపై హైకోర్టు ప్రశ్నించగా.. కొద్దిగా నిబంధనలు మీరామని ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. వీటిపై ఎంఓఈఎఫ్‌నే చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది.

Updated Date - 2023-08-14T04:23:59+05:30 IST