Siddamaramaiah Sweraing-in: ఆహ్వానితుల జాబితాలో చోటుదక్కని బీజేపీయేతర సీఎంలు, ఎందుకంటే..?

ABN , First Publish Date - 2023-05-19T20:16:10+05:30 IST

బెంగళూరు: కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ ఓ 'బిగ్ ఈవెంట్'గా నిర్వహిస్తోంది. అయితే, ఆహ్వానితుల జాబితాలో అరవింద్ కేజ్రీవాల్, కె.చంద్రశేఖరరావు, జగన్మోహన్ రెడ్డి, పినరయి విజయన్ వంటి బీజేపీయేతర ముఖ్యమంత్రుల పేర్లు చోటుచేసుకోలేదు.

Siddamaramaiah Sweraing-in: ఆహ్వానితుల జాబితాలో చోటుదక్కని బీజేపీయేతర సీఎంలు, ఎందుకంటే..?

బెంగళూరు: కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని(Swearing-in ceremony) కాంగ్రెస్‌ (Congress) ఓ 'బిగ్ ఈవెంట్'గా బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ఈనెల 20న నిర్వహిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేయేతర పార్టీలతో 'ఐక్య కూటమి' ఏర్పాటుకు జరుగుతున్న యత్నాలను మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు దీనిని ఓ వేదికగా మలుచుకోవాలని కాంగ్రెస్ ఆసక్తిగా ఉంది. హేమాహేమీలను ఈ వేదికపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు తగ్గట్టుగా కాంగ్రెస్ ఆహ్వానితుల జాబితా కూడా పెద్దగానే ఉంది. ఆహ్వానితుల్లో ఎంతమంది వస్తారు? ఎంతమంది గైర్హాజరవుతారు? అనే మాట అంటుంచితే... ఆహ్వానితుల జాబితాలో అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), కె.చంద్రశేఖరరావు (K.Chandrasekhar Rao) పినరయి విజయన్ (Pinarayi Vijayan) వంటి బీజేపీయేతర ముఖ్యమంత్రుల పేర్లు చోటుచేసుకోలేదు. విపక్షాల ఐక్యతను చాటిచెప్పే ప్రయత్నంలో ఇదొక అపశ్రుతి అవుతుందా? లేక దీనివెనుక కాంగ్రెస్ వ్యూహాత్మక ఎత్తుగడ ఉందా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

ఆహ్వానితుల్లో 11 మంది విపక్ష అగ్రనేతలు

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆహ్వానించిన 11 మింది విపక్ష అగ్ర నేతల్లో బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ ఉన్నారు. ఆహ్వానితుల జాబితా నుంచి మినహాయించిన ప్రముఖుల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఉన్నారు. వీరిని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించకపోవడానికి కారణం ఏమిటి?

కేసీఆర్‌కు... దెబ్బకు దెబ్బ..!

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సుప్రీం అయిన కేసీఆర్ 2022 చివరి నుంచి దేశంలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. బీజేపీయేతర, కాంగ్రెస్సేతర పార్టీలను 2024 లోక్‌సభ ఎన్నికల్లో మట్టికరిపించేందుకు ఆయన తృతీయ ఫ్రంట్ అవసరాన్ని బలంగా చెబుతున్నారు. ఈ ఏడాది జనవరిలో బీఆర్ఎస్ ఒక గ్రాండ్ ర్యాలీ నిర్వహించింది. సీపీఎం నేత పినరయి విజయన్, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ కుమారస్వామి వంటి పలువురు నేతలను ఆహ్వానించారు. కాంగ్రెస్ నేతలెవరికీ ఆహ్వానం పంపలేదు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత ఆ పార్టీకి దూరమై 2001 సొంత పార్టీ పెట్టుకున్నారు.

కేజ్రీవాల్‌తో కాంపటీషన్...

కేసీఆర్‌కు చెందిన బీఆర్ఎస్‌ తరహాలోనే అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సైతం బీజేపీ, కాంగ్రెస్‌లకు తాము ప్రత్యా్మ్నాయంగా చెబుతూ వస్తోంది. ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉండగా, అక్కడ కాంగ్రెస్‌తో ఆ పార్టీ తలబడుతోంది. ఢిల్లీలో షీలా దీక్షిత్ సారథ్యంలోని కాంగ్రెస్‌ను ఓడించి 2013లో ఆప్ ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. తొమ్మిదేళ్ల తర్వాత పంజాబ్‌ విషయంలోనూ ఇదే పునరావృతమైంది. పంజాబ్‌లో తిరిగి అధికారంలోకి రావాలనే కాంగ్రెస్ ప్రయత్నాలకు ఆప్ గండికొట్టింది.

తక్కిన ముగ్గురి విషయంలో...

జగన్ మోహన్ రెడ్డి, పినరయి విజయన్, నవీన్ పట్నాయక్‌ల విషయానికి వస్తే, ఆయా రాష్ట్రాల్లో ఆ పార్టీలతో కాంగ్రెస్ నేరుగా తలపడుతోంది. అయితే ఆ పార్టీలు యుక్తిగా వ్యవహరిస్తూ బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్నాయి. 2019లో ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీని జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్‌సీపీ ఓడించింది. కేంద్రంలోని ఎన్డీయేకు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. అదీగాక, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జగన్ సన్నిహితుడనే పేరు కూడా ఉంది.

కేరళలో కాంగ్రెస్ సారథ్యంలోని యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 2021లో పినరయి విజయన్ సారథ్యంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌ పోటీ పడింది. ఇక, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ వ్యవహార శైలి అందరికీ తెలిసిందే. రాబోయే లోక్‌సభ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిరిగానే తాము పోటీ చేస్తామని, కాంగ్రెస్‌తో భాగస్వామాన్ని తాము కోరుకోవడం లేదని పట్నాయక్ ఇటీవల ప్రకటించారు. కేంద్రంలో ఎప్పుడు, ఎవరు అధికారంలో ఉన్న బీజేడీ వారికి బాసటగా ఉంటోందన్నారు. ఏతావాతా..సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానితుల జాబితాలో ఇచ్చిన మినహాయింపుల ప్రకారం కాంగ్రెస్ పార్టీ తమ మిత్రులుగా ఎవరిని విశ్వసిస్తోందో, ఎవరిని శత్రువులుగా భావిస్తోందో పరోక్షంగా చెప్పినట్టయింది.

మమత...కొసమెరుపు!

బీజేపీయేతర ప్రతిపక్షాల ఐక్యతకు పట్టుదలగా ఉన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పంపినప్పటికీ ఆమె గైర్హాజర్ కావచ్చని సమాచారం. తన ప్రతినిధిగా టీఎంసీ నేత కకోలి ఘోష్ దస్తిదార్‌ను ఆమె పంపనున్నట్టు తెలుస్తోంది. నిజానికి మమత హాజరు కావడం అనేది విపక్షాల ఐక్యతకు కీలకమనే చెప్పాలి. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలంగా ఉన్న చోట్ల ఆ పార్టీకి టీఎంసీ మద్దతిస్తుందని ఇటీవల మమతా బెనర్జీ ప్రకటించారు.

Updated Date - 2023-05-19T21:20:45+05:30 IST