Nitish Kumar: దీదీకి కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతను నితీశ్ తొలగించగలరా?

ABN , First Publish Date - 2023-04-23T20:30:57+05:30 IST

నితీశ్ కుమార్ ఏప్రిల్ 25న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో సమావేశం కానున్నారు.

Nitish Kumar: దీదీకి కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతను నితీశ్ తొలగించగలరా?
Nitish Kumar to meet Mamata

న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి, జేడియూ అధినేత నితీశ్ కుమార్ (JDU chief Nitish Kumar) ఏప్రిల్ 25న టీఎంసీ(TMC) అధినేత్రి మమతా బెనర్జీతో (Mamata Banerjee) సమావేశం కానున్నారు. కోల్‌కతాలో దీదీతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. అలాగే 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో విపక్షాల ఐక్యత గురించి చర్చిస్తారు. మమత పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌కు దాదాపు ఉనికి లేకుండా చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ గెలిచేసరికి బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్‌కు సహకరించడం వల్లే కాంగ్రెస్ అభ్యర్ధి గెలిచారని, లోక్‌సభ ఎన్నికల్లో తాను కాంగ్రెస్‌తో చేతులు కలపబోనని స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్‌పై మమతకున్న వ్యతిరేకతను నితీశ్ తొలగించగలరా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

నితీశ్ ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను(Delhi Chief Minister Arvind Kejriwal) కలుసుకున్నారు. ప్రతిపక్షాల ఐక్యత గురించి చర్చించారు. కేంద్రంలో బలంగా ఉన్న నరేంద్ర మోదీ(PM Modi) సారథ్యంలోని బీజేపీ(BJP) ప్రభుత్వాన్ని నిలువరించాలంటే ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని చర్చించారు. ప్రతిపక్షాలు కలిసి కట్టుగా ఉంటూ కేంద్రం నుంచి మోదీ సర్కారును సాగనంపాలని నిర్ణయించినట్లు సమావేశానంతరం కేజ్రీవాల్, నితీశ్ చెప్పారు.

వాస్తవానికి ఏప్రిల్ 12న నితీశ్ బీహార్‌ కేజ్రీవాల్‌ను కలిసే ముందు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Congress president Mallikarjun Kharge) ఢిల్లీ నివాసానికి వెళ్లారు. అప్పటికే అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వీరికి స్వాగతం పలికారు. అనంతరం అందరూ గ్రూప్ ఫొటోలు దిగారు. ఆ తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల మధ్య ఐక్యతను సాధించడంపై చర్చించారు. కాంగ్రెస్ అనుకూల పార్టీలతో పాటు కాంగ్రెసేతర పార్టీలను కూడా సంప్రదించాలని నిర్ణయించారు. ప్రధాని అభ్యర్ధి ఎవరనేదానికన్నా, ప్రతిపక్షాలన్నింటినీ ఒకేతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా చర్చలు సాగాయి.

2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి నితీశేనని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వానికి మద్దతు కూడా ఇచ్చారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. రాహుల్‌పై అనర్హత వేటు పడటంతో కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్ధి ఎవరనేది తేలాల్సి ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వాన్ని ఇష్టపడని అనేక పార్టీలున్నాయి. కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే యూపిఏలో కొనసాగుతున్నారు. ఎన్సీపీ, ఉద్దవ్ శివసేన ఇప్పటికే కాంగ్రెస్ కూటమిలోనే ఉన్నాయి. స్టాలిన్ కూడా యూపిఏ భాగస్వామిగానే ఉన్నారు. బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ దాదాపు అన్ని కూటములకూ దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి ఈ ఏడాది ఆఖరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి స్పష్టమౌతుంది.

మరోవైపు నితీశ్- కేజ్రీవాల్ (Nitish Kumar-Arvind Kejriwal) కలుసుకున్న వారం రోజుల వ్యవధిలోనే ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన తాజా ప్రకటనతో అంతా తారుమారైంది. 2024 లోకసభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఒంటరిగానే పోటీ చేస్తామని, ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని ఆ పార్టీ నేషనల్‌ జనరల్‌ సెక్రటరీ సందీప్‌ పాఠక్‌ ప్రకటించారు. కేజ్రీవాల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారా.. అన్న ప్రశ్నకు పాఠక్‌ సమాధానమిస్తూ... ‘ప్రధాని ఎవరన్నది దేశాన్ని నిర్ణయించనివ్వండి’ అని జవాబిచ్చారు. దీంతో ఒక్కసారిగా అంతా మారిపోయింది. నితీశ్- కేజ్రీవాల్ భేటీతో ప్రతిపక్షాల మధ్య ఐక్యత పక్కా అనుకున్న వేళ ఐక్యత హుష్ కాకీ అయింది.

కేజ్రీవాల్ మొదట్నుంచీ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. బీజేపీకి ధీటైన జాతీయ ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీదేనని కేజ్రీవాల్ విశ్వాసం. ఇదే విషయాన్ని ఆయన అనేక వేదికలపై ప్రకటించారు. ఇప్పటికే ఆప్ ఢిల్లీ, పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించి, గోవా, గుజరాత్‌లో ఉనికి చాటుకుని జాతీయ పార్టీ హోదా కూడా పొందింది. ప్రతిపక్షాలకు కాంగ్రెస్ నేతృత్వం అనే అంశంపై కేజ్రీవాల్- నితీశ్‌తో ఏకీభవించరని రాజకీయ పరిశీలకులు వారం క్రితమే చెప్పారు.

అంతకు ముందు అదానీ అంశం ప్రజాసమస్య కాదని, అదానీ (Adani) చేసిన మేలును కూడా గుర్తించాలంటూ ఎన్సీపీ(NCP) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) వ్యాఖ్యానించడంతో ప్రతిపక్షాలు అయోమయంలో పడిపోయాయి. అంతేకాదు ప్రధాని విద్యార్హత అంశం కూడా ప్రజా సమస్య కాదని పవార్ వ్యాఖ్యానించడంతో ప్రతిపక్షాల్లో ఐక్యత లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. దీంతో పరిస్థితిని చక్కబెట్టేందుకు కాంగ్రెస్ నేతలు వెనువెంటనే నితీశ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. అందులో భాగంగానే నితీశ్ కుమార్ బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌తో (Tejashwi Yadav) కలిసి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) నివాసంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో (Rahul Gandhi) సమావేశమయ్యారు. ప్రతిపక్షాల ఐక్యత గురించి చర్చించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు సంఘటితమవ్వాలని సంకల్పం తీసుకున్నారు. డీఎంకే(DMK), ఎన్సీపీతో కాంగ్రెస్‌ నేతలు చర్చించాలని.. టీఎంసీ(TMC), ఆప్‌(AAP), బీఆర్‌ఎస్‌(BRS) తదితరపార్టీల అధినేతలతో నితీశ్‌ కుమార్‌ చర్చించాలని ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్చల్లో విస్తృత ఏకాభిప్రాయం ఏర్పడితే మొత్తం విపక్ష నేతలందరితో సమావేశమై బీజేపీని ఎదుర్కొనేందుకు వ్యూహం రూపొందించాలని నిర్ణయించారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష నేతలందరినీ సంఘటితం చేయడమే తమ లక్ష్యమని ఖర్గే ప్రకటించారు. సాధ్యమైనన్ని పార్టీలను సంఘటితం చేసి కలిసికట్టుగా పనిచేయాలన్నదే తమ ప్రయత్నమని నితీశ్‌ కుమార్‌ అన్నారు. ఈ సమావేశంలో నితీశ్ కీలక ప్రతిపాదన తెచ్చినట్లు సమాచారం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే 543 నియోజకవర్గాల్లోనూ ప్రతిపక్షాల తరపున ఒక్క అభ్యర్థే ఉండాలని నితీశ్ చెప్పినట్లు తెలిసింది. ఇదే జరిగితే బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటుందని, బీజేపీ అభ్యర్థులను ఓడించడం సులభమౌతుందని నితీశ్ రాహుల్, ఖర్గేలకు వివరించినట్లు సమాచారం. దీనికి వారినుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ ఫార్ములాకు మిగతా పార్టీల స్పందన చూశాక ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.

పవార్ షాక్‌ నుంచే ప్రతిపక్షాలు కోలుకోలేకపోతుంటే తాజాగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తామని కేజ్రీవాల్ పార్టీ ప్రకటించడం అటు నితీశ్‌కు, ఇటు విపక్షాలకు షాకింగ్ పరిణామంగా మారింది. ఇప్పుడు మమతనైనా నితీశ్‌కు సానుకూల సంకేతాలిస్తారా లేక కాంగ్రెసేతర ఫ్రంట్‌కే పట్టుబడతారా అనేది వేచి చూడాలని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Updated Date - 2023-04-23T20:31:00+05:30 IST