Uddhav Thackeray : నేను మోదీకి వ్యతిరేకిని కాను : ఉద్ధవ్ థాకరే
ABN , First Publish Date - 2023-05-04T16:01:04+05:30 IST
ప్రతిపక్షాలు ‘ప్రతిపక్షం’ అనే పదానికి అతీతంగా ప్రవర్తించాలని, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓ శక్తిగా మారాలని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే
ముంబై : ప్రతిపక్షాలు ‘ప్రతిపక్షం’ అనే పదానికి అతీతంగా ప్రవర్తించాలని, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓ శక్తిగా మారాలని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) పిలుపునిచ్చారు. తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి వ్యతిరేకం కాదని, తాను నియంతృత్వానికి వ్యతిరేకినని చెప్పారు. మహావికాస్ అగాడీ కూటమిలోని ఎన్‌సీపీలో ప్రస్తుత పరిణామాలపై ఆయన తొలిసారి గురువారం స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన (యూబీటీ) కలిసి మహా వికాస్ అగాడీగా కొనసాగుతున్నాయి. ఎన్‌సీపీ అధ్యక్ష పదవి నుంచి శరద్ పవార్ వైదొలగి, ఆ స్థానంలో మరొకరిని ఎన్నుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలపై ఉద్ధవ్ థాకరే తొలిసారి గురువారం విలేకర్ల సమావేశంలో స్పందించారు. ఎన్‌సీపీలో జరుగుతున్న పరిణామాల ప్రభావం తమ కూటమిపై ఉండదని చెప్పారు. నియంతృత్వాన్ని వ్యతిరేకించే శక్తులు కలవడాన్ని ఎవరూ ఆపలేరన్నారు. తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి వ్యతిరేకం కాదని, తాను నియంతృత్వానికి వ్యతిరేకినని చెప్పారు.
శరద్ పవార్ ఎన్‌సీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నప్పటికీ కూటమి విచ్ఛిన్నం కాబోదని కాంగ్రెస్, ఉద్ధవ్ సేన చెప్తున్నాయి. అయితే ఎన్‌సీపీలో పరిస్థితులు అనిశ్చితంగా కనిపిస్తున్నాయి. శరద్ పవార్ జీవిత చరిత్రలో ఉద్ధవ్ థాకరే బలహీనమైన ముఖ్యమంత్రి అని, పార్టీలో లుకలుకలను చక్కదిద్దలేకపోయారని, పోరాడకుండానే పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఉద్ధవ్ స్పందిస్తూ, ముఖ్యమంత్రిగా తాను ఏం చేశానో ప్రపంచం చూసిందన్నారు.
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో బజరంగ్‌బలిని ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలపై ఉద్ధవ్ విరుచుకుపడ్డారు. కర్ణాటకలో మరాఠీ మాట్లాడేవారు ‘జై భవానీ’, ‘జై శివాజీ’ అనే నినాదాలు చేయాలని పిలుపునిచ్చారు. ‘జై బజరంగ్‌బలి’ అని అనాలని ఓటర్లను ప్రధాని మోదీ కోరుతున్నారని, రాజకీయాలు మారి ఉండవచ్చునని అన్నారు.
ఇవి కూడా చదవండి :
Congress Vs BJP : ముస్లింలను కాంగ్రెస్ తప్పుదోవపట్టిస్తోంది : కర్ణాటక సీఎం