NRIs in UK: బ్రిటన్‌లోని ఎన్నారైలకు తీపి కబురు.. ఇకపై స్వదేశంలోని బిల్స్ నేరుగా చెల్లించవచ్చు..!
ABN , First Publish Date - 2023-09-10T10:50:37+05:30 IST
బ్రిటన్‌లోని ఎన్నారైలకు (NRIs) భారత ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నారైలకు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (Bharat Bill Payment System) ద్వారా స్వదేశంలో నేరుగా బిల్లులు చెల్లించే సదుపాయాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.
ఎన్నారై డెస్క్: బ్రిటన్‌లోని ఎన్నారైలకు (NRIs) భారత ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నారైలకు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (Bharat Bill Payment System) ద్వారా స్వదేశంలో నేరుగా బిల్లులు చెల్లించే సదుపాయాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే మధ్యప్రాచ్య దేశాలైన ఒమాన్, కువైత్, బహ్రెయిన్, యూఏఈలోని ఎన్నారైలకు ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. దీంతో ఆయా దేశాలలోని భారత ప్రవాసులు బీబీపీఎస్ (BBPS) ద్వారా ఇండియాలో బిల్లులు చెల్లిస్తున్నారు. ఇక తాజా నిర్ణయంతో బ్రిటన్ ఎన్నారైలు సైతం త్వరలో భారత్‌లోని కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కోసం నేరుగా బిల్లులు చెల్లించవచ్చు.
ఈ సందర్భంగా శనివారం ఎన్‌పీసీఐ (NPCI) భారత్ బిల్‌పే లిమిటెడ్ సీఈఓ నూపూర్ చతుర్వేది (Noopur Chaturvedi) ఢిల్లీలో మాట్లాడుతూ.. "క్రాస్ బోర్డర్స్ పేమెంట్స్ ఫెసిలిటీ అందించాలని ఎన్నారైల నుంచి అభ్యర్థనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. త్వరలోనే యూకేలోని ఎన్నారైలకు ఈ ఫెసిలిటీని తీసుకురావాలని ప్లాన్ చేశాం" అని అన్నారు. ఈ సదుపాయం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, గత నెలలో కేవలం 300-400 క్రాస్-బోర్డర్స్ ట్రాన్సాక్షన్లు (Cross-border Transactions) మాత్రమే జరిగాయని పేర్కొన్నారు.
ఇక గత కొంతకాలంగా మోదీ ప్రభుత్వం యూపీఐ (UPI), ఇతర డిజిటల్ చెల్లింపుల ప్రొడక్ట్స్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలకు అందుబాటులో తీసుకురావాలనే యోచనలో ఉంది. ఈ మేరకు ఇతర దేశాలతో కలిసి యూపీఐని వారి ఫాస్ట్ పేమెంట్ సేవలతో లింక్ చేయాలని చూస్తోంది. దీనివల్ల ఎన్నారైలు (NRIs) ఎక్కడ నివసిస్తున్న సరే స్వదేశంలోని బిల్లులు చెల్లించడం వీలు పడుతుంది. ఇదిలాఉంటే.. భారత్ వేదికగా జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit) లో భారతీయ రిజర్వు బ్యాంక్ (RBI) ఇన్నోవేషన్ పెవిలియన్‌లో డిజిటల్ పేమెంట్స్ రంగంలో సాధించిన పురోగతిని కూడా సగర్వంగా ప్రదర్శిస్తోంది. అర్జెంటీనా, బ్రెజిల్, చైనా, జర్మనీ, రష్యా, బ్రిటన్, ఐక్యరాజ్య సమితితో సహా 20 ప్రతినిధి బృందాల అధికారులు పెవిలియన్‌లో యూపీఐ ద్వారా లావాదేవీలు చేసి దాని పనితీరుకు ఫిదా అయినట్లు సమాచారం.