Hyderabad Woman: అమెరికా వీధుల్లో హైదరాబాద్ యువతి.. చదువుకునేందుకు వెళ్లి.. చివరకు పేరు కూడా గుర్తు లేని స్థితిలో..
ABN , First Publish Date - 2023-07-26T18:43:52+05:30 IST
ఉపాధి నిమిత్తం కొందరు, ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో మరికొందరు విదేశాలకు వెళ్తుంటారు. కొందరు తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతూ తమ పిల్లల భవిష్యత్ బాగుండాలనే ఉద్దేశంతో విదేశాల్లో చదివిస్తుంటారు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు...
ఉపాధి నిమిత్తం కొందరు, ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో మరికొందరు విదేశాలకు వెళ్తుంటారు. కొందరు తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతూ తమ పిల్లల భవిష్యత్ బాగుండాలనే ఉద్దేశంతో విదేశాల్లో చదివిస్తుంటారు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు ఊహించని సమస్యలు ఎదురవుతుంటాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది విదేశాల్లో ఉంటూ అవస్థలు పడుతున్న వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. తాజాగా, హైదరాబాద్‌కు యువతి.. అమెరికాలో దీన స్థితిలో ఉంది. మాస్టర్స్ చేయాలని రెండేళ్ల క్రితం షికాగో వెళ్లిన ఆమె.. ప్రస్తుతం తన పేరు కూడా గుర్తులేని స్థితిలో ఉంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లోని మౌలాలికి (Hyderabad woman) చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ అనే యువతి.. మాస్టర్స్ చేసేందుకు 2021 ఆగస్టులో అమెరికాకు (America) వెళ్లింది. అక్కడి డెట్రాయిట్లో ఉన్న TRAIN విశ్వవిద్యాలయంలో చేరింది. రోజూ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉన్న యువతి.. సడన్‌గా రెండు నెలల నుంచి ఫోన్లు చేయడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. అక్కడి తెలుగు వారికి ఫోన్లు చేసి మరీ తమ కూతురి క్షేమ సమాచారం గురించి వాకబు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన కొందరు యువతీయువకులకు.. సదరు యువతి రోడ్లపై తిరుగుతూ కనిపించింది. విచారించగా.. కొన్నాళ్ల కిందట ఆమెకు సంబంధించిన వస్తువులన్నింటినీ ఎవరో చోరీ చేసినట్లు తెలిసింది.
అప్పటి నుంచి యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. చివరకు రోడ్ల వెంట తిరుగుతూ ఎవరైనా ఏదైనా పెడితే తినడం, లేదంటే పస్తులు పడుకుంటూ ఉంది. చివరకు తన పేరును తానే గుర్తుపెట్టుకోలేని స్థితికి చేరుకుంది. రోడ్డు పక్కన ఉన్న ఆమెను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. కూతురు పరిస్థితి గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. యువతి తల్లి ఇటీవలే కేంద్ర విదేశాంగ మత్రి జై శంకర్‌కు (Union Foreign Minister Jai Shankar) లేఖ రాసింది. తమ కూతురును భారత్ తీసుకురావాలంటూ వేడుకుంది. కాగా, యువతికి సంబంధించిన వీడియోలతో పాటూ తల్లి రాసిన లేఖను.. బీఆర్ఎస్ నాయకుడు ఖలీకర్ రెహమాన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.