Panipuri: పానీ పూరీ తిన్న వెంటనే ఈ అమ్మాయికి భరించలేనంత కడుపునొప్పి.. ఆస్పత్రిలో మృతి.. అసలేం జరిగిందంటే..!
ABN , First Publish Date - 2023-09-19T16:10:33+05:30 IST
స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేసే వారిలో వయసుతో నిమిత్తం లేకుండా ఎక్కువ మంది పానీపూరీని ఇష్టపడతారనడంతో అతిశయోక్తి లేదు. పానీపూరీ చేయడంలో చాలా మంది అపరిశుభ్రంగా వ్యవహరించడం చూస్తూనే ఉంటాం. కొందరు అపరిశుభ్రమైన చేతులతో పూరీ వడ్డిస్తుంటే.. మరికొందరు...
స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేసే వారిలో వయసుతో నిమిత్తం లేకుండా ఎక్కువ మంది పానీపూరీని ఇష్టపడతారనడంతో అతిశయోక్తి లేదు. పానీపూరీ చేయడంలో చాలా మంది అపరిశుభ్రంగా వ్యవహరించడం చూస్తూనే ఉంటాం. కొందరు అపరిశుభ్రమైన చేతులతో పూరీ వడ్డిస్తుంటే.. మరికొందరు ఏకంగా పానీలో మురుగు నీటిని కలుపుతూ అందరినీ షాక్‌కి గురి చేస్తుంటారు. అయినా యువతీయువకులు మాత్రం పానీపూరీ తినకుండా మాత్రం ఉండలేరు. ఇవేమీ పట్టించుకోకుండా తమకు నచ్చిన ప్రాంతానికి వెళ్లి మరీ పానీపూరీని ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇటీవల ఓ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. పానీపూరీ తిన్న వెంటనే ఆ అమ్మాయికి భరించలేనంత కడుపునొప్పి వచ్చింది. చివరకు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ వైరల్ అవుతోంది. రాజస్థాన్ ఉదయపూర్ జిల్లా (Rajasthan Udaipur District) అంబా మాత పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓద్ బస్తీకి చెందిన నిషా అనే యువతి తన సోదరుడితో కలిసి ఇటీవల ఓ రోజు స్థానికంగా జరుగుతున్న జాతరకు వెళ్లింది. అక్కడ తోటి పిల్లలతో కలిసి సరదా సరదా గడిపారు. ఆ సమయంలో అక్కడే రోడ్డు పక్కన ఉన్న పానీపూరీ (panipuri) బండి వద్దకు వెళ్లారు. నిషా, ఆమె తమ్ముడితో పాటూ మరికొంత మంది చిన్నారులు అక్కడి పానీపూరీ తిన్నారు. అయితే తర్వాత అక్కడి నుంచి ఇంటికి చేరుకునే లోపు వారికి కడుపునొప్పి, వాంతులు ఎక్కువై తీవ్ర (Illness) అస్వస్థతకు గురయ్యారు.
దీంతో కుటుంబ సభ్యులు కంగారుపడి వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిషా మృతి చెందింది. ఆమె సోదరుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అలాగే మరో ఆరుగురు చిన్నారులు కూడా చికిత్స పొందుతున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అయితే వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చివరకు కలెక్టర్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాలిక మృతి ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించడంతో పోలీసులు స్పందించారు. అయితే ఈలోగా పానీపూరీ విక్రయదారుడు పరారయ్యాడు. పానీ కలుషితం అవడం వల్లే బాలిక మృతి చెందిందని అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.