Marriage: పెళ్లీడుకొచ్చిన కుర్రాళ్లూ.. జర జాగ్రత్త.. మేట్రిమోనీలో ప్రొఫైల్ పెట్టిన ఓ యువకుడికి ఏమైందంటే..
ABN , First Publish Date - 2023-08-01T20:51:17+05:30 IST
ఇంటర్నెట్ అందుబాటు లేని రోజుల్లో వివాహ సంబంధాలు కుదుర్చుకునేందుకు చాలా మంది పెళ్లిళ్ల బ్రోకర్లను సంప్రదించేవారు. వధూవరుల ఫొటోలను ముందుంచుతూ నచ్చిన అమ్మాయితో వివాహం కుదిర్చేవారు. కానీ ఇప్పుడలా కాదు.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు..
ఇంటర్నెట్ అందుబాటు లేని రోజుల్లో వివాహ సంబంధాలు కుదుర్చుకునేందుకు చాలా మంది పెళ్లిళ్ల బ్రోకర్లను సంప్రదించేవారు. వధూవరుల ఫొటోలను ముందుంచుతూ నచ్చిన అమ్మాయితో వివాహం కుదిర్చేవారు. కానీ ఇప్పుడలా కాదు.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. చదువు, ఉద్యోగం, వినోదం, వివాహాం.. ఇలా సమాచారం ఏదైనా చిటికెలో తెలుసుకునే వెసులుబాటు వచ్చేసింది. అయితే, దీన్నే కొందరు తమ స్వార్థం ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. మేట్రిమోనీలో ప్రొఫైల్ పెట్టిన ఓ యువకుడి పరిస్థితి చివరకు ఏమైందంటే..
యూకేలో (UK) ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ (Software Engineer) ఇటీవల పెళ్లి ప్రయత్నాలు చేసేవాడు. ఈ క్రమంలో అతను సొంత పని మీద బెంగళూరు (Bangalore) వచ్చాడు. పనిలో పనిగా పెళ్లి సంబంధం కుదుర్చుకునేందుకు గాను.. ఓ మ్యాట్రిమోనీ వెబ్సైట్లో (Matrimony website) తన వివరాలను నమోదు చేసుకున్నాడు. ఇతడి ప్రొఫైల్ చూసిన ఓ యువతి (young woman) నుంచి మెసేజ్ వచ్చింది. ఫొటోలో యువతి చాలా అందంగా ఉండడంతో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. తర్వాత ఇద్దరూ ఫోన్ నంబర్లను కూడా మార్చుకున్నారు. ముఖాముఖిగా కలుసుకోకున్నా రోజూ ఫోన్లలో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో కొన్ని రోజులకు సదరు యువతి తన ప్లాన్‌ను అమలు చేసింది. ఇలావుండా, జూలై 2న అతడికి ఫోన్ చేసి.. ‘‘మా అమ్మకు ఆరోగ్యం క్షీణించింది.. వెంటనే వైద్యం చేయించాలి’’.. అని చెప్పి రూ.1500లు తన బ్యాంక్ అకౌంట్లో వేయించుకుంది.
తర్వాత జూలై 4న అతడికి ఏకంగా వీడియో కాల్ చేసింది. మాట్లాడుతూ మాట్లాడుతూ తన దుస్తులు మొత్తం విప్పేసింది. అతన్ని కూడా దుస్తులు విప్పేయమని చెప్పింది. ఈ తంతంగం మొత్తం రికార్డు చేసుకుని, ఆ మరుసటి రోజు వీడియోను అతడికి పంపించింది. వీడియో చూడగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్ షాక్ అయ్యాడు. తాను అడిగిన మొత్తం ఇవ్వకపోతే వీడియోను అందరికీ పంపిస్తానంటూ బెదిరించింది. ఇలా విడతలా వారీగా అతడితో కోటి రూపాయలకు పైగా డబ్బులను తన బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకుంది. అంతటితో ఆగకుండా మరింత డబ్బులు కావాలంటూ బెదిరించడం మొదలెట్టింది. దీంతో చివరకు విసిగిపోయిన అతను పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితురాలి బ్యాంక్ అకౌంట్‌ను సీజ్ చేశారు. అప్పటికి ఆమె ఖాతాలో రూ.84లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆమె కోసం గాలిస్తున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.