Share News

Mrinank Singh: ఐపీఎస్‌ అని చెప్పి లగ్జరీ హోటళ్లను ముంచేసిన మాజీ క్రికెటర్.. రిషబ్ పంత్‌ను కూడా..

ABN , Publish Date - Dec 28 , 2023 | 12:53 PM

తానొక స్టార్ క్రికెటర్‌ని అని, ఐపీఎస్ ఆఫీసర్‌ని అని చెప్పి లగ్జరీ హోటళ్లను మోసం చేసిన మాజీ క్రికెటర్ మృణాంక్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెజ్‌తో సహా పలు హోటళ్లలో మృణాంక్ సింగ్ రూ.5.5 లక్షల మోసం చేశాడు.

Mrinank Singh: ఐపీఎస్‌ అని చెప్పి లగ్జరీ హోటళ్లను ముంచేసిన మాజీ క్రికెటర్.. రిషబ్ పంత్‌ను కూడా..

ఢిల్లీ: తానొక స్టార్ క్రికెటర్‌ని అని, ఐపీఎస్ ఆఫీసర్‌ని అని చెప్పి లగ్జరీ హోటళ్లను మోసం చేసిన మాజీ క్రికెటర్ మృణాంక్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెజ్‌తో సహా పలు హోటళ్లలో మృణాంక్ సింగ్ రూ.5.5 లక్షల మోసం చేశాడు. మృణాంక్ సింగ్ బాధితుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. పంత్‌ను మృణాంక్ సింగ్ ఏకంగా రూ.1.6 కోట్లు మోసం చేసినట్టు సమాచారం. డీసీపీ రవికాంత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘జూలై 2022లో తాజ్ ప్యాలెస్ హోటల్‌కు వెళ్లిన మృణాంక్ సింగ్ తానొక స్టార్ క్రికెటర్‌ని అని, ఐపీఎల్‌లో కూడా ఆడానని చెప్పాడు. దాదాపు వారం రోజులపాటు మృణాంక్ సింగ్ ఆ హోటళ్లోనే బస చేశాడు. దీంతో అతని హోటల్ బిల్లు రూ.5.6 లక్షలు అయింది. తన స్పాన్సర్ అయిన అడిడాస్ బిల్లు చెల్లిస్తుందని చెప్పి హోటల్ నుంచి వెళ్లిపోయాడు. అయితే అతను ఇచ్చిన బ్యాంకు అకౌంట్ నంబర్లు, కార్డు వివరాలు నకిలీవని తేలింది.’’ అని చెప్పారు.


దీంతో హోటల్ సిబ్బంది మృణాంక్, అతని మేనేజర్‌ను సంప్రదించారు. కానీ డబ్బులు చెల్లిస్తామని చెప్పి వాగ్దానాలు చేసినప్పటికీ వాటిని నెరవేర్చలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో గతేడాది ఆగస్టులో 25 ఏళ్ల మాజీ క్రికెటర్ మృణాంక్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే గత సోమవారం హాంకాంగ్‌కు పారిపోతున్న మృణాంక్ సింగ్‌ను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు కూడా తాను సీనియర్ ఐపీఎస్ అధికారినంటూ ఇమ్మిగ్రేషన్ అధకారులను మృణాంక్ సింగ్ బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. కానీ అతని వ్యూహాలు పని చేయలేదు. చివరకు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాను కర్ణాటకకు చెందిన పోలీస్ అధికారిని అని చెప్పి కూడా మృణాంక్ సింగ్ పలు హోటళ్లను మోసం చేశాడు. ‘‘కొన్ని హోటళ్ళలో అతను కర్ణాటకకు చెందిన సీనియర్ పోలీస్ అధికారిగా ఫోజులిచ్చారు. మరికొన్నింటిలో తానొక స్టార్ క్రికెటర్‌ను అని చెప్పుకున్నాడు. మృణాంక్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తనకు చాలా మంది అభిమానులు ఉన్నారని చెప్పుకోవడానికి మహిళలతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు.’’ అని తెలిపారు.

పలు మీడియా నివేదికల ప్రకారం తాను లగ్జరీ వాచీలు, అభరణాల వ్యాపారం చేసే వ్యాపారవేత్తగా నటిస్తూ టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్‌ను మృణాంక్ సింగ్ రూ.1.6 కోట్లు మోసం చేశాడు. మృణాంక్ సింగ్‌కు రిషబ్ పంత్ తన వాచీలు ఇచ్చాడు. అలాగే మృణాంక్ నుంచి పంత్ తీసుకున్న చెక్కులు బౌన్స్ అయినట్టు సమాచారం. దీంతో రిషబ్ పంత్ గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా హర్యాణా అండర్ 19 జట్టు తరఫున మృణాంక్ సింగ్ ఆడాడు. అలాగే తాను ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిని అని కూడా మృణాంక్ సింగ్ చెప్పుకున్నాడు.

Updated Date - Dec 28 , 2023 | 12:53 PM