Share News

Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాకిచ్చిన రోహిత్ శర్మ అభిమానులు.. ఫస్ట్ ప్లేసుకు సీఎస్కే

ABN , Publish Date - Dec 16 , 2023 | 10:48 AM

Mumbai Indians: ఐపీఎల్ 2024 వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ ద్వారా ముంబైలో చేరాడు.

Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాకిచ్చిన రోహిత్ శర్మ అభిమానులు.. ఫస్ట్ ప్లేసుకు సీఎస్కే

ఐపీఎల్ 2024 వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ ద్వారా ముంబైలో చేరాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అతి పెద్ద ట్రేడింగ్‌గా నిలిచిపోయింది. ఇది మరిచిపోకముందే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్‌ను మార్చింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించింది. తమకు ఐదు ట్రోఫీలను అందించాడనే విషయాన్ని కూడా మర్చిపోయి తొలగించింది. ఇది పెద్ద సంచలనంగా మారింది. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో తన అద్భుత కెప్టెన్సీతో జట్టును ఫైనల్ చేర్చాడు. ఇంత సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం ఎవరికీ మింగుడుపడడం లేదు. దీంతో సోషల్ మీడియాలో రోహిత్ శర్మకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. విరాట్ కోహ్లీ అభిమానులు సైతం హిట్‌మ్యాన్‌కు మద్దతుగా నిలుస్తుండడం గమనార్హం. రోహిత్ శర్మ అభిమానులైతే ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.


ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్ అభిమానులు ముంబై ఫ్రాంచైజీకి భారీ షాకిచ్చారు. ఎక్స్ (ట్విటర్), ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ముంబై ఇండియన్స్ ఖాతాను ఆన్‌ఫాలో చేశారు. దీంతో గంటల వ్యవధిలోనే ముంబై ఇండియన్స్ భారీగా ఫాలోవర్లను కోల్పోయింది. ఇప్పటివరకు ఎక్స్‌లో 4 లక్షల మంది రోహిత్ అభిమానులు ముంబై ఇండియన్స్‌ను ఆన్‌ఫాలో చేశారు. దీంతో గతంలో 8.6 మిలియన్లుగా ఉన్న ముంబై ఇండియన్స్ ఫాలోవర్లు సంఖ్య 8.2 మిలియన్లకు పడిపోయింది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే 2 లక్షల మంది ఆన్‌ఫాలో చేశారు. దీంతో 13.1 మిలియన్లుగా ఉన్న ముంబై ఇండియన్స్ ఫాలోవర్ల సంఖ్య 12.9 మిలియన్లకు పడిపోయింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ దెబ్బతో ఇన్‌స్టాగ్రామ్‌లో ముంబై ఇండియన్స్ నంబర్ వన్ స్థానాన్ని కూడా కోల్పోయింది. ఇంతకుముందు వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న ఐపీఎల్ ఫ్రాంచైజీగా ముంబై ఇండియన్స్ ఉండేది. తాజాగా ముంబైకి 2 లక్షల మంది ఫాలోవర్లు తగ్గడంతో చైన్నైసూపర్ కింగ్స్ మొదటి స్థానంలోకి వెళ్లింది. ప్రస్తుతం చెన్నైకి 13 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కాగా ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ ముంబైకి 5 సార్లు ట్రోఫీ అందించాడు. రోహిత్ కెప్టెన్సీలో ముంబై 2013, 2015, 2017, 2019, 2020లో ట్రోఫి గెలిచింది. ముంబై గెలిచిన 5 ఐపీఎల్ ట్రోఫీలు రోహిత్ కెప్టెన్సీలోనే వచ్చాయి. ఓ సారి చాంపియన్స్ లీగ్ ట్రోఫీ కూడా గెలిచింది. మొత్తంగా ముంబైకి రోహిత్ శర్మ 163 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేయగా 91 విజయాలు సాధించింది. 4 మ్యాచ్‌లు టైగా.. 68 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

Updated Date - Dec 16 , 2023 | 10:48 AM