IND vs SL: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ..10 వేల రన్స్‌తో సచిన్ రికార్డు బద్దలు!
ABN , First Publish Date - 2023-09-12T16:29:42+05:30 IST
ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
కొలంబో: ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. సిక్సు కొట్టి మరి హిట్‌మ్యాన్ ఈ రికార్డును అందుకోవడం గమనార్హం. శ్రీలంక పేసర్ రజిత వేసిన 7వ ఓవర్‌లో సిక్సు కొట్టిన రోహిత్ శర్మ 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ మైలురాయిని చేరుకున్నాడు. దీంతో వన్డేల్లో వేగంగా 10 వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలుకొట్టాడు. సచిన్ 259 వన్డే ఇన్నింగ్స్‌లో 10 వేల రన్స్ పూర్తి చేయగా.. రోహిత్ శర్మ 241 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. తన వన్డే కెరీర్‌లో మొదటి 2 వేల పరుగులు చేయడానికి 82 ఇన్నింగ్స్‌లు తీసుకున్న రోహిత్ శర్మ.. మిగతా 8 వేల పరుగులను 159 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించడం గమనార్హం. కాగా ఈ జాబితాలో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 205 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కు అందుకున్నాడు. అలాగే వన్డేల్లో 10 వేల రన్స్ చేసిన ఆరో భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. మొత్తంగా 15వ ఆటగాడిగా నిలిచాడు. తన వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 248 మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ 241 ఇన్నింగ్స్‌ల్లో 49 సగటుతో 10,031 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలున్నాయి. ఏకంగా 3 సెంచరీలను డబుల్ సెంచరీలుగా మలిచాడు.
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మరోసారి శుభరంభాన్ని అందించారు. వీరిద్దరు మొదటి వికెట్‌కు 11 ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. అయితే లంక స్పిన్నర్ దునిత్ వెల్లలాగే ఎంట్రీతో సీన్ మారిపోయింది. 11 పరుగుల వ్యవధిలోనే టీమిండియా టాప్ 3ని వెల్లలాగే పెవిలియన్ చేర్చాడు. రోహిత్, కిషన్ భాగస్వామ్యాన్ని దునిత్ వెల్లలాగే 12వ ఓవర్‌లో విడదీశాడు. 19 పరుగులు చేసిన గిల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే రోహిత్ శర్మ సిక్సు కొట్టి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 7 ఫోర్లు, 2 సిక్సులతో 44 బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేశాడు. దీంతో ఆసియా కప్‌లో వరుసగా మూడో హాఫ్ సెంచరీని కొట్టాడు. కాగా వన్డే కెరీర్‌లో రోహిత్‌కు ఇది 51వ హాఫ్ సెంచరీ. అయితే ఆ వెంటనే మరోసారి చెలరేగిన వెల్లలాగే విరాట్ కోహ్లీని 3 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే హాఫ్ సెంచరీతో చెలరేగుతున్న రోహిత్ శర్మను(53) వెల్లలాగే క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 91 పరుగులకు టీమిండియా 3 వికెట్లు కోల్పోయింది.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరన