Share News

Amaravati : అందలం దిగని అక్రమార్కులు

ABN , Publish Date - Jul 05 , 2024 | 03:34 AM

జగన్‌ ప్రభుత్వంలో పాలకులు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారు. అవినీతికి ఆస్కారమున్న ప్రతిచోటా కోట్లకు కోట్లు దోచేశారు.

Amaravati : అందలం దిగని అక్రమార్కులు

  • గత ప్రభుత్వంలో చేసిన పాపాలకు అగ్గి

  • అవినీతి బయటపడకుండా సర్దేస్తున్నారు

  • ఎక్సైజ్‌, గనులు, సీఐడీలో ఫైళ్ల దహనం

  • తాజాగా పీసీబీ ఫైళ్లకూ అదేగతి

  • ఎన్నికల ఫలితాలు వెలువడి నెలయినా ఇంకా ఎక్కడి అధికారులు అక్కడే

  • ఆధారాలన్నీ చెరిపేశాక చేసేదేమిటి?

  • ఇప్పటి వరకు ఒక్కదానిపైనా విచారణ లేదు

  • కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?

  • గత ప్రభుత్వంలో చేసిన పాపాలకు పాత

ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులు పూర్తయింది. టీడీపీ ప్రభుత్వం కొలువుదీరి మూడు వారాలు దాటింది. అయినా గత ప్రభుత్వంలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు ఇప్పటికీ అవే స్థానాల్లో కొనసాగుతున్నారు. గతంలో జరిగిన అక్రమాల ఆనవాళ్లు కనిపించకుండా అన్నీ సర్దేస్తున్నారు. ఆధారాలను మాయం చేస్తున్నారు. ఫైళ్లను తగలబెడుతున్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆధారాలన్నీ ధ్వంసం చేశాక అక్రమాలు బయట పెట్టేదెలా? శాఖల్లో పాతుకుపోయిన అవినీతి అధికారులను కదల్చకుండా నిజాలు నిగ్గు తేల్చడం సాధ్యమా?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌ ప్రభుత్వంలో పాలకులు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారు. అవినీతికి ఆస్కారమున్న ప్రతిచోటా కోట్లకు కోట్లు దోచేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో.. నాటి అక్రమాలు, అవినీతి, అరాచకాలు బయటపడకుండా వైసీపీ పెద్దల వీరభక్త అధికారులు నిజాలకు నిప్పుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చాలా శాఖల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులను మార్చకపోవడమే ఈ పరిస్థితికి కారణం. తాజాగా కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)లో ఓ పెద్ద మనిషి కీలకమైన ఫైళ్లను బయటకు తీసుకెళ్లి తగులబెట్టించే ప్రయత్నం చేశారు. ఇంత జరుగుతున్నా కొత్త ప్రభుత్వం జగన్‌ వీరభక్త అధికారులపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆధారాలన్నీ చెదిరిపోయేదాకా అక్రమాలపై విచారణకు ఆదేశించరా? బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోరా?

ఎన్నికల ఫలితాల రోజే...

జగన్‌ అక్రమాలకు వంతపాడిన అధికారుల్లో నాటి బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి ఒకరు. మద్యం పాలసీల పేరిట జే బ్రాండ్‌ మద్యం తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు. రెగ్యులర్‌ మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో లేకుండా చేసి జగన్‌కు కప్పం కట్టే అనుకూల బ్రాండ్లు మాత్రమే వ్యాపారం చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. జూన్‌ 4వ తేదీన ఎన్నికల ఫలితాల సరళిని చూసి అప్పటికప్పుడు జాగ్రత్తపడ్డారు. తన కార్యాలయంలోని కీలకమైన ఫైళ్లను రెండు దఫాలుగా వాహనాల్లో తరలించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయంపై ఆయనపై పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి.


అయినా కొత్త ప్రభుత్వం అప్రమత్తం కాలేదు. ఫిజికల్‌ ఫైళ్లను తరలించినా, ఆన్‌లైన్‌లో ఫైళ్లు ఉంటాయి. ఆన్‌లైన్‌లోని నోట్‌ఫైళ్లను కూడా తొలగించే అవకాశం ఉందని జాగ్రత్తపడి జగన్‌ భక్త అధికారుల ఈ-ఆఫీసు లాగిన్స్‌ను బ్లాక్‌ చేయలేదు. దీంతో మద్యం వ్యవహారాలకు సంబంధించిన కీలకమైన నోట్‌ఫైల్స్‌ను ఈ-ఆఫీసు సర్వర్‌ నుంచి తొలగించినట్లు ఆ తర్వాత గుర్తించారు. ప్రభుత్వం నింపాదిగా స్పందించి వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు చేయించింది. కానీ అప్పటికే కీలక ఫైౖళ్లు మాయమయ్యాయి.

ఎక్సైజ్‌ శాఖలో ఏయే ఫైళ్లు ఉన్నాయి? ఏవేవి మాయమయ్యాయి? వాసుదేవరెడ్డి చేసిన ఘనకార్యాలు ఏమిటి? వంటివాటిని నిగ్గుతేల్చేందుకు ఇతమిద్దమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించలేదు. సీఐడీ స్వీయ విచారణ తప్ప శాఖాపరమైన విచారణేది జరగడం లేదు. దీంతో అక్రమార్కులు కీలకమైన ఆధారాలను తొలగించే పనిలో ఉన్నారు.

గనుల్లో ఇష్టారాజ్యం

జగన్‌ ప్రభుత్వంలో ఇసుక తవ్వకాల్లో భారీ అవినీతి జరిగింది. గనుల శాఖలో ఇసుక అమ్మకం టెండర్లతో పాటు బొగ్గు తవ్వకం, వేలం టెండర్లు, బీచ్‌శాండ్‌, క్వార్ట్జ్‌, మైనర్‌ మినరల్స్‌ లీజులు, వేలం పాటలు, వాటి రెన్యువల్‌కు ఇచ్చే లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌ఓఐ)లు, అధిక ధరలకు సర్వేరాళ్ల కొనుగోలు, సర్వేరాళ్ల ఎంగ్రేవింగ్‌ యూనిట్ల వ్యవహారాల్లో వేల కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. జూన్‌ 5న గనుల శాఖ ఉన్నతాధికారి తాటిగడపలోని ఏపీఎండీసీ, ఇబ్రహీంపట్నంలోని గనుల డైరెక్టరేట్‌ పరిధిలోని అత్యంత కీలకమైన ఫైళ్లను తన సహాయకుడి ద్వారా రెండు వాహనాల్లో బయటకు తరలించి తగలబెట్టించారనే ఫిర్యాదులున్నాయి.

రెండు బస్తాల నిండా ఫైళ్లు తీసుకె ళ్లి అగ్గిలో కాల్చడం సహ ఉద్యోగులు సైతం చూశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దర్జాగా 180 లీజుల రెన్యువల్‌, మరో 120 లీజులకు కొత్తగా అనుమతులు ఇస్తూ ఎల్‌ఓఐలు జారీ చేశారు. వాటికి సంబంధించిన నోట్‌ఫైల్స్‌ను తొలగించారు. ఎన్నికల ఫలితాలు రావ డానికి ముందు జేపీ వెంచర్స్‌కు 120 కోట్ల బ్యాంక్‌ గ్యారెంటీలు చెల్లించారు. వాటికి సంబంధించిన నోట్‌ఫైల్స్‌ను మాయం చేశారని తాజాగా గుర్తించారు.


గుట్టంతా పీసీబీలోనే...

పీసీబీ చైర్మన్‌గా మాజీ సీఎస్‌ సమీర్‌శర్మ పనిచేశారు. జగన్‌కు అత్యంత సన్నిహితుడు. గత ఐదేళ్లు పీసీబీ అడ్డగోలుగా వ్యవహరించింది. ఇసుక రీచ్‌లు, బెరైటీస్‌, క్వార్ట్జ్‌, బీచ్‌శాండ్‌ సహా మైనర్‌ మినరల్స్‌ తవ్వకాలకు కన్సెంట్‌ ఆఫ్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌(సీటీఈ), కన్సెంట్‌ ఆఫ్‌ ఆపరేషన్‌ (సీటీఓ)లు అదే ఇవ్వాలి. పర్యావరణ అనుమతులు, సీటీఈ, సీటీఓలు లేకున్నా ఇసుక తవ్వకాలు జరిగాయి. కలెక్టర్లు, పీసీబీ అధికారులు అనేక దఫాలుగా సమీర్‌శర్మకు లేఖలు రాశారు. కేంద్రం నుంచి కూడా అనేక రిమైండర్లు, సూచనలతో కూడిన ఉత్తర్వులు వచ్చాయి. అయినా చర్యలు తీసుకోలేదు.

రుషికొండపై జగన్‌ సర్కారు నిర్మించిన ప్యాలె్‌సకు సంబంధించి హైకోర్టు, సుప్రీం కోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసులు నడిచాయు. అడ్డగోలు అక్రమ నిర్మాణాలకు పీసీబీ వంతపాడింది. రాష్ట్రంలోని పలు పరిశ్రమలపై అనేక ఫిర్యాదులు వచ్చినా పీసీబీ పట్టించుకోలేదు.

కానీ గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబానికి చెందిన అమరరాజా బ్యాటరీ్‌సపై వచ్చిన ఫిర్యాదులపై ఆగమేఘాల మీద స్పందించి పీసీబీ అధికారులు దాడులు చేశారు. ఆ సంస్థను వేధించడమే లక్ష్యంగా పనిచేశారు. పీసీబీలో కీలకమైన ఫైళ్లు ఉన్నాయి. జగన్‌ పభుత్వాన్ని ఇరకాటంలో పడేసే కీలకమైన ఫైళ్లు, నివే దికలు, హార్డ్‌ డిస్క్‌లను గుట్టుగా తరలించి తగుల బెట్టించారని సమీర్‌శర్మపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

అక్రమాలపై విచారణ ఏదీ?

జగన్‌ సర్కారులో ఆయా శాఖల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ టీడీపీ ఆరోపణలు చేసింది. అధికారంలోకి వచ్చాక అవి కనిపెట్టేందుకు విచారణకు ఆదేశిస్తూ ఒక్క ఉత్తర్వు కూడా ఇవ్వలేదు. జగన్‌ అక్రమాలకు వంతపాడిన అధికారులను కాపాడేలా కీలక పోస్టింగ్‌లు ఇచ్చారంటూ టీడీపీ కార్యకర్తలే సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాక సీఐడీ అధికారులు కీలకమైన అమరావతి రాజధాని, ఐఆర్‌ఆర్‌ కేసు ఫైళ్లను తగలబెట్టించారు. టీడీపీ వచ్చాక విచారణకు ఆదేశించకపోవడంపై ఆ పార్టీ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - Jul 05 , 2024 | 03:43 AM