Sharmila: జగన్ స్వలాభం కోసం హోదా పేరు ఎత్తలేదు
ABN , Publish Date - Feb 11 , 2024 | 07:43 PM
సీఎం వైఎస్ జగన్ స్వలాభం కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అడగడం లేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila) అన్నారు. ఆదివారం నాడు తిరుపతిలో షర్మిల పర్యటించారు. వనక్కం అంటూ తమిళంలో మాట్లాడి క్యాడర్‌ను ఉత్సాహపరిచారు.
తిరుపతి: సీఎం వైఎస్ జగన్ స్వలాభం కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అడగడం లేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila) అన్నారు. ఆదివారం నాడు తిరుపతిలో షర్మిల పర్యటించారు. వనక్కం అంటూ తమిళంలో మాట్లాడి క్యాడర్‌ను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. పగతో ఏపీకి రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. ఏపీలో ఏ అభివృద్ధి పనులు జరగలేదన్నారు. పదేళ్లుగా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఏపీ పరిస్థితి ఉందన్నారు. జగన్ సీఎం కాకముందు హోదా కోసం నిరహారదీక్ష చేశాడని.. ఎంపీలతో రాజీనామా చేయించారన్నారు. ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక హోదా గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదని ధ్వజమెత్తారు.
బీజేపీ ఆశీస్సులు కోసం జగన్, చంద్రబాబు వంగివంగి దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి ఒక్క పేపరు ముక్క ఇచ్చి వచ్చాడన్నారు. నమ్మి ఓట్లు వేసినా ప్రజల కోసం జగన్ ఒక్క మంచిపని చేయలేదన్నారు. వైఎస్సార్ ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారని మండిపడ్డారు. ఏపీలో అప్పు లేని రైతు లేడని పాలన అంటే ఇదేనా అని జగన్ తీరును ప్రశ్నించారు. జల యజ్ఞం వైఎస్ అషయమని.. జగన్ ప్రకటించిన నవరత్నాలలో జలయజ్ఞం ఒకటి అని చెప్పారు. జలయజ్ఞం కోసం ఏం చేశారని నిలదీశారు. 54 ప్రాజెక్టులో 12 ప్రాజెక్టులను వైఎస్సార్ పూర్తి చేశారని.. జగన్ ఒక తట్ట మట్టి కూడా వేయలేదని షర్మిల ఆరోపించారు.