Minister Atchannaidu: ఆ ముగ్గురూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు..
ABN , Publish Date - Nov 05 , 2024 | 05:24 PM
ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో వాసంశెట్టి వెనకబడి ఉండడం వల్లే సీఎం చంద్రబాబు అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
అమలాపురం: ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు మందలించడంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. ఈ విషయంలో వాసంశెట్టిని కొంత మంది కావాలనే అతిగా ట్రోల్ చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో సీఎం తమకు టార్గెట్ ఇచ్చారని, అది రీచ్ కాకపోవడం వల్లే వాసంశెట్టిని చంద్రబాబు మందలించారని చెప్పారు. అమలాపురంలో నిర్వహించిన ఎన్డీయే కూటమి సమావేశంలో కోమసీమ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అచ్చెన్న పాల్గొన్నారు.
ట్రోల్ చేయడం అవసరమా?
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. " రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ను గెలిపించాలని సీఎం చంద్రబాబు మాకు ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా టార్గెట్ రీచ్ అవ్వని మంత్రి సుభాశ్‌ను తండ్రిలాగా ఆయన మందలించారు. దాన్ని ఇంతగా ట్రోలింగ్ చేయటం మంచి పద్ధతి కాదు. అది మా పార్టీ అంతర్గత సమావేశంలో జరిగిన విషయం. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పట్టభద్రుల ఓటర్ల నమోదులో వాసంశెట్టి వెనకబడి ఉండడం వల్లే ముఖ్యమంత్రి అలా మాట్లాడాల్సి వచ్చింది. దీన్ని కొంతమంది కావాలనే రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రతి పార్టీలోనూ ఇలాంటి విషయాలు సర్వసాధారణం. కూటమి పార్టీల మధ్య విభేదాలకు చెక్ పెట్టాలి. ఎన్డీయే కుటుంబంలో చిన్నచిన్న విభేదాలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలి. ఎలాంటి సమస్యలైనా నేను పరిష్కరిస్తా.
జగన్ విర్రవీగాడు..
గత ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా తగలపెట్టిన వ్యక్తి వైసీపీ అధినేత జగన్. 30 సంవత్సరాలపాటు తానే సీఎం అని విర్రవీగిన జగన్‌కు ప్రజలు చరమగీతం పాడారు. ముఖ్యమంత్రిగా వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించిన వ్యక్తి ఫ్యాన్ పార్టీ అధినేత. ఆయన పాలన పూర్తయ్యే సరికి రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఏపీకి ఆక్సిజన్ అందించింది. ఆయన అవినీతి డబ్బుతో పెట్టిన సాక్షి పేపర్, టీవీ.. ఎన్డీయే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయి.
అభివృద్ధి చేద్దాం..
వెనకబడిన కోనసీమ జిల్లాను అభివృద్ధి చేసుకుందాం. అమలాపురం పట్టణాన్ని సుందరంగా డెవలప్ చేయటానికి నేను సిద్ధం. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కోమసీమ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి అన్ని విధాలా సహకారం అందిస్తా. చంద్రబాబు, పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ ఈ ముగ్గురూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది" అని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Former Minister Roja: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి రోజా..
Pawan Kalyan: పెట్రోల్ బాంబులు వేసి భయభ్రాంతులకు గురిచేశారు