MP Raghurama: రాబోయే ఎన్నికల్లో టీడీపీ - జనసేనల తరపునే బరిలోకి
ABN , Publish Date - Jan 13 , 2024 | 04:15 PM
రాబోయే ఎన్నికల్లో తాను టీడీపీ - జనసేన ( TDP - Janasena ) పార్టీల తరపునే పోటీకి సిద్ధంగా ఉన్నానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ( MP Raghurama Krishnamraju ) స్పష్టం చేశారు. నాలుగేళ్ల అనంతరం శనివారం నాడు ఏపీలోని భీమవరానికి రఘురామ వచ్చారు.
ప. గో: రాబోయే ఎన్నికల్లో తాను టీడీపీ - జనసేన ( TDP - Janasena ) పార్టీల తరపునే పోటీకి సిద్ధంగా ఉన్నానని వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు ( MP Raghurama Krishnamraju ) స్పష్టం చేశారు. నాలుగేళ్ల అనంతరం శనివారం నాడు ఏపీలోని భీమవరానికి రఘురామ వచ్చారు. ఢిల్లీ నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఆయనకు ఎయిర్‌పోర్టులో అభిమానులు భారీ స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్ మధ్య భీమవరానికి చేరుకున్నారు. రఘురామపై అడుగడుగునా అభిమానులు పూలవర్షం కురిపించారు. భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రఘురామ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం రఘురామ మాట్లాడుతూ.. ‘‘భీమవరం రావడం చాలా ఆనందంగా ఉంది. నాలుగేళ్ల అనంతరం ఇక్కడికి వచ్చాను. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాకు ఎంతగానో సహకరించారు. మా నాన్నమ్మ చనిపోయినప్పుడు కూడా నేను మా ఊరు రాలేదు.. ఈ విషయం నన్ను ఎంతగానో బాధించింది’’ అని ఎంపీ రఘురామ తెలిపారు.
ఆ విషయంలో వైసీపీ తీరు నచ్చలేదు
‘‘దేవతలు ఎంత శక్తివంతం అయినా దుష్టశక్తులను అంతం చేయాలంటే త్రిమూర్తులు అవసరం పడింది. నేను అవకాశవాదిని కాదు. వైసీపీ అయిదేళ్లు అధికారంలో ఉంటుందని నాకు తెలుసు.. అయినా వైసీపీ వచ్చిన నాలుగు నెలల్లోనే వారి తీరు నచ్చక బయటకు వచ్చాను. అమరావతి రాజధాని నిర్ణయంపై సీఎం జగన్ మాట మార్చారు. అందుకే నా నిర్ణయం మార్చుకుని బయటకు వచ్చాను. నాపై కేసులకు సంబంధించి నేను వేసిన పిటీషన్‌పై జనవరి 25వ తేదీ తర్వాత సుప్రీంకోర్టులో హియరింగ్ జరిగే అవకాశం ఉంది. నా స్థాయిలో నేను పోరాటం చేస్తున్నానని... తన తరఫున లాయర్లు ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని ఎంపీ రఘురామ పేర్కొన్నారు.