AP Election Result: బెట్టింగ్ రాయుళ్లు జాగ్రత్త.. అవి నమ్మితే నట్టేట మునిగినట్లే..
ABN , Publish Date - May 30 , 2024 | 11:42 AM
ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆసక్తిగా మారింది. మరో రెండు రోజుల్లో అంటే జూన్1 సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్ వెల్లడవుతాయి. పలు సర్వే సంస్థలు తాము సేకరించిన డేటాను విశ్లేషించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చనేదానిపై ఓ అంచనా వచ్చి ఎగ్జిట్ పోల్స్‌ను విడుదలచేస్తాయి.
ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆసక్తిగా మారింది. మరో రెండు రోజుల్లో అంటే జూన్1 సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్ (Exit pollls) వెల్లడవుతాయి. పలు సర్వే సంస్థలు తాము సేకరించిన డేటాను విశ్లేషించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చనేదానిపై ఓ అంచనా వచ్చి ఎగ్జిట్ పోల్స్‌ను విడుదలచేస్తాయి. ఎన్నికల సంఘం (Election Commission) నిబంధనల ప్రకారం అన్ని విడతల పోలింగ్ పూర్తయ్యేవరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయకూడదని నిబంధన విధించింది. దీంతో జూన్1 సాయంత్రం వరకు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేయకూడదు. ఈలోపు చాలామంది తమ అంచనాలను, అభిప్రాయాన్ని సామాజిక మాద్యమాల్లో తెలియజేస్తున్నారు. అయితే ఇది పూర్తిస్థాయిలో సర్వేచేసి వెల్లడించిన అభిప్రాయాలు కాదు.. కేవలం ఓటింగ్ సరళి ఆధారంగా.. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులతో మాట్లాడి తెలుసుకున్న సమాచారం ఆధారంగా చాలామంది తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఈలోపు కొన్ని సంస్థల పేరిట ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయో కొన్ని ఎగ్జిట్ పోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సర్వేలు వాస్తవం కాదని.. కొంతమంది వివిధ రకాల పేర్లతో సృష్టించిన సర్వేలు మాత్రమేనని కొన్ని సర్వే సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్న సర్వేలు నిజమని కొందరు బెట్టింగ్‌లు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సర్వేలను నమ్మి బెట్టింగ్‌లు కడితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని.. ఫేక్ సర్వేలను నమ్మవద్దని.. అసలు ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌లు కట్టడం చట్టవ్యతిరేకమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే చర్యలు తప్పవంటున్నారు.
అవ్వన్నీ ఫేక్..
ఏపీలో వైసీపీ ప్రభంజనం అంటూ సోషల్ మీడియాలో కొన్ని సర్వే సంస్థల పేరిట పోస్టులు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని సర్వే సంస్థల పేర్లు పెద్దగా ప్రాచుర్యంలోనూ లేవు. వైసీపీ కనీసం 110కి పైగా సీట్లు గెలుస్తోందంటూ సర్వే సంస్థల పేరిట పోస్టులు వైరల్ అవుతుండగా.. ఇవ్వన్నీ ఫేక్‌గా తెలుస్తోంది. ఏవైనా సర్వే సంస్థలు తమ ఎగ్జిట్‌పోల్స్‌ను జూన్1 సాయంత్రం 6గంటల తర్వాత మాత్రమే ప్రకటించాల్సి ఉంటుంది. అలాకాదని ముందుగా వెల్లడిస్తే ఆ సంస్థలు, సదరు వ్యక్తులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే అధికారికంగా ఏ సంస్థ అయినా ఎగ్జిట్‌పోల్స్ విడుదల చేసే అవకాశం లేదు. దీంతో ప్రస్తుతం వైరల్ అవుతున్నవన్ని అధికారికంగా వెల్లడించిన పోల్స్ కాదని.. అవ్వన్నీ ఫేక్ సర్వేలని రాజకీయ విశ్లేషకులు, సెఫాలజిస్టులు పేర్కొంటున్నారు.
అందరిచూపు జూన్1 వైపు..
ఎన్నికల ఫలితాలు జూన్4న వెలువడతాయి, కానీ అంతకంటే మూడు రోజుల ముందు విడుదలయ్యే ఎగ్జిట్‌పోల్స్ కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కాకపోయినా.. అసలు ఫలితాలకు కొంత సమీపంలో ఉండే అవకాశం ఉంటుంది. చాలా ఎన్నికల్లో రియల్ రిజల్ట్‌కు ఎగ్జిట్‌పోల్స్ దగ్గరగా ఉండటంతో ప్రజలు వీటిని నమ్మడం మొదలుపెట్టారు. దీంతో జూన్4కంటే ముందు జూన్1న వెల్లడయ్యే ఎగ్జిట్‌పోల్స్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read more Andhra Pradesh and Telugu News