AP Elections: పాలకొండను పాలించేదెవరు..?
ABN , Publish Date - Apr 11 , 2024 | 10:35 AM
పోలింగ్ సమయం సమీపిస్తోంది. నోటిఫికేషన్‌కు ముందే రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి చోట గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా వాటిలో పాలకొండ ఒకటి.
పోలింగ్ సమయం సమీపిస్తోంది. నోటిఫికేషన్‌కు ముందే రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి చోట గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా వాటిలో పాలకొండ ఒకటి. ఇక్కడి నుంచి వైసీపీ (YSRCP) తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి పోటీ చేస్తుండగా.. ఎన్డీయే కూటమి నుంచి జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏమిటి.. పార్టీలు, అభ్యర్థుల బలాబలాలు తెలుసుకుందాం.
వైసీపీ ఐదేళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గాల్లో పాలకొండ ఒకటి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఈ నియోజకవర్గంలో సీతంపేట, భామిని, వీరఘట్టం, పాలకొండ మండలాలు ఉన్నాయి. లక్షా 70 వేల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువుగా ఉండే నియోజకవర్గాల్లో ఇదొకటి. 2019 ఎన్నికల్లో పాలకొండ నుంచి వైసీపీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో అక్షరాస్యత 58 శాతం మాత్రమే. నాడు-నేడు ద్వారా విద్యారంగం రూపురేఖలు మార్చామంటూ జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. ఈ నియోజకవర్గంలో అక్షరాస్యత శాతం అంతంతమాత్రంగానే ఉంది.
AP Elections 2024: ఇక మంచి రోజులు!
నియోజకవర్గంలో పరిస్థితులు..
నియోజకవర్గంలో వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారి శాతం ఎక్కువ. వేరుశనగ, జీడీ, పైనాపిల్, అల్లం, పసుపు వంటి వాణిజ్య పంటలను అధికంగా పండిస్తారు. నాగావళి నది మండలంలోనే ఉన్నా సాగు, తాగు నీరందక ప్రజలు అనేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో సరైన మౌలిక వసతులు లేవు. ఎక్కడ చూసినా పాడైన రహదారులే కనిపిస్తాయి. గిరిజన గ్రామాలు ఎక్కువుగా ఉండే ఈ నియోజకవర్గం అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఇక్కడి ప్రజలు చెబుతున్న మాట. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, సాగు, తాగు నీరు, పారిశుద్ధ్యం, మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో విద్యా, వైద్య సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. నియోజకవర్గంలో నిరుద్యోగం అధికంగా ఉంది. అన్ని రకాల వనరులు కలిగి అభివృద్ధికి అవకాశాలున్నా వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాలకొండ ఇంకా వెనకబడే ఉందని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు.
అభ్యర్థులు ఎవరంటే..
ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కళావతి ఇక్కడి ప్రజలను పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణది రాజకీయ కుటుంబం. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలకంగా పనిచేసిన ఆయన ఇటీవల కాలంలో జనసేనలో చేరి టికెట్ పొందారు.
AP Politics: అవినీతి నేలగా తణుకు, దోచిన సొమ్ముతో మంత్రి కారుమూరి ఫ్యాక్టరీలు పెట్టారు : పవన్ కల్యాణ్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..