Share News

CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. వరద బాధితులకు ప్యాకేజీ.. వివరాలు ఇవే..

ABN , Publish Date - Sep 18 , 2024 | 10:17 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులకు ప్యాకేజీ ప్రకటించారు. ఈ మేరకు ప్యాకేజీ వివరాలతో కూడిన సమాచారాన్ని తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. వరద బాధితులకు ప్యాకేజీ.. వివరాలు ఇవే..

అమరావతి: ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, ఫలితంగా వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బుడమేరుకు మూడు చోట్ల గండ్లు పడి వరదనీరు విజయవాడ నగరంలోని ఇళ్లను ముంచెత్తింది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. అయితే సీఎం చంద్రబాబు స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారికి ఆహారం, తాగునీరు అందేలా పక్కాగా చర్యలు చేపట్టారు. నష్టపోయిన ప్రతి కుటుంబాన్నీ ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు వరద బాధితులకు సాయం అందజేస్తున్నట్లు ప్యాకేజీ వివరాలను తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు.


సీఎం ట్వీట్ ఇదే..

"భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు మంచి ప్యాకేజీని ప్రకటించాం. విజయవాడ వరదల సమయంలో 10రోజులపాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌నే సచివాలయంగా మార్చుకుని మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి బాధితులకు సాయం చేశా. ఇప్పుడు నష్టం అంచనాలను పూర్తి చేసి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం ఇవ్వని స్థాయిలో సాయం చేస్తూ ప్రజలకు అండగా నిలబడ్డాం. విజయవాడ నగరంలో వారం, పది రోజులపాటు వరదలో చిక్కుకుని ముంపునకు గురైన ప్రతి ఇంటికీ రూ.25వేలు ఆర్థికసాయం, పైఅంతస్తుల్లో ఉన్న వారికి రూ.10వేలు ఆర్థికసాయం చేస్తాం.


రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వరదలకు ఇల్లు మునిగి ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి రూ.10వేలు అందిస్తాం. కిరాణా షాపులు, చిన్న వ్యాపారాలు కోల్పోయిన వారికి రూ.25వేలు, ఎంఎస్ఎంఈలకు, వ్యాపార సంస్థ స్థాయిని బట్టి రూ.50 వేల నుంచి రూ.1.50లక్షల వరకూ ఆర్థికసాయం చేయాలని నిర్ణయించాం. దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు రూ.3వేలు, ఆటోలకు రూ.10వేలు చొప్పున అందిస్తాం.


అలాగే దెబ్బతిన్న ధాన్యం, పత్తి, చెరకు, వేరుసెనగ పంటలకు హెక్టారుకు రూ.25వేలు, అరటి, పసుపు వంటి ఉద్యానవన పంటలకు హెక్టారుకు రూ.35వేలు సాయం చేస్తాం. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కష్టాల్లో ఉన్న ప్రజలకు సాయంగా నిలబడాలనే ఉద్దేశ్యంతో బెస్ట్ ప్యాకేజ్ ఇచ్చి వారికి తోడుగా నిలుస్తున్నాం. బ్యాంకులు, ఇన్‌స్యూరెన్స్ ఏజెన్సీల ద్వారా కూడా మంచి సాయం అందేలా చేస్తున్నాం. మత్స్యకారుల బోట్లకు, చేనేత కార్మికులకు, పశువుల కోల్పోయిన రైతులకూ పరిహారం అందిస్తున్నాం. వరదల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి అన్నీ పరిశీలించి ఈ ప్యాకేజీని ప్రకటిస్తున్నామని" సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:
CM Chandrababu: కూటమి ఎమ్మెల్యేలతో నేడు సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ

AP Cabinet: నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం.. చర్చించే అంశాలివే..

సీఎంతో సునీతారెడ్డి దంపతుల భేటీ

Updated Date - Sep 18 , 2024 | 10:27 AM