CM Chandrababu: ఏపీలో భారీ వర్షాలు.. సహాయక చర్యలపై కేంద్రంతో చర్చించిన చంద్రబాబు
ABN , Publish Date - Sep 01 , 2024 | 08:17 PM
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో వరద పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వంతో ఏపీ సీఎం చంద్రబాబు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు వర్చువల్ గా సమావేశం అయ్యారు.
అమరావతి: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో వరద పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వంతో ఏపీ సీఎం చంద్రబాబు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై సహాయక చర్యలపై చర్చించారు. అనంతరం కేంద్ర హోం సెక్రటరీతో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అత్యవసరంగా పవర్ బోట్లు రాష్ట్రానికి తెప్పించే అంశంపై చర్చించారు. 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లు ఇతర రాష్ట్రాల నుంచి తక్షణమే ఏపీకి పంపుతున్నట్లు హోం సెక్రటరీ తెలిపింది. ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లో 25 మంది సిబ్బంది ఉన్నారు.
ఒక్కో టీమ్‌కు నాలుగు పవర్ బోట్లు ఉంటాయి. ఇవన్నీ రేపు ఉదయంలోపు విజయవాడకు చేరుకుంటాయని హోం సెక్రటరీ తెలిపింది. మొత్తం 40 పవర్ బోట్లు రాష్ట్రానికి పంపుతున్నట్లు పేర్కొంది. వాయు మార్గంలో మరో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లను రేపు రాష్ట్రానికి పంపుతున్నట్లు హోం సెక్రటరీ చెప్పింది. సహాయక చర్యలకు 6 హెలికాఫ్టర్లు పంపుతున్నట్లు చెప్పింది. రేపటి నుంచి సహాయక చర్యల్లో హెలికాఫ్టర్లు పాల్గొననున్నాయి.