Share News

AP Cabinet: ఎస్పీలపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్.. ఫోన్ చేస్తే రియాక్ట్ కావడం లేదు..

ABN , Publish Date - Nov 06 , 2024 | 03:26 PM

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. కొంతమంది పోలీసులు వైసీపీ నేతల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

AP Cabinet: ఎస్పీలపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్.. ఫోన్ చేస్తే రియాక్ట్ కావడం లేదు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పోస్టులపై కీలక చర్చ జరిగింది. కూటమి నేతలు, రాష్ట్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చ లేవనెత్తారు. కొంతమంది వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా మళ్లీ మళ్లీ పోస్టులు పెడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి పవన్ తీసుకెళ్లారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లనూ వదిలిపెట్టకుండా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని డిప్యూటీ సీఎం ధ్వజమెత్తారు.


సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. కొంతమంది పోలీసులు వైసీపీ నేతల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్‌కు వత్తాసు పలికిన కొంత మంది అధికారులు ఇప్పటికీ కీలక పోస్టుల్లో ఉన్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పరిస్థితి ఇలానే ఉంటే నిందితులను శిక్షించేదేలా అని ఆయన ప్రశ్నించారు. సమస్యలు వచ్చినప్పుడు కొంత మంది ఎస్పీలకు ఫోన్ చేస్తే రియాక్ట్ కావడం లేదని ఉప ముఖ్యమంత్రి మండిపడ్డారు. కిందిస్థాయిలో ఉన్న డీఎస్పీలు, సీఐలపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లపైనా పోస్టులు పెడితే చూస్తూ ఎలా ఊరుకుంటామని అన్నారు. అందుకే తాను రియాక్ట్ అయ్యానని సీఎంకు తెలిపారు.


ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. గత ప్రభుత్వం వల్లే ఏపీ పోలీసులు ఇలా తయారయ్యారని చంద్రబాబు అన్నారు. వారందరినీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రికి చెప్పారు. కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారనీ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. నెల రోజుల్లో మొత్తం పోలీస్ వ్యవస్థను దారిలోకి తెస్తానని పవన్‌కు చంద్రబాబు చెప్పారు. లా అండ్ ఆర్డర్ అంటే ఎలా ఉంటుందో వైసీపీ నేతలకు చూపిద్దామని సీఎం అన్నారు. ఇకపై సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వారిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


సీఎం చంద్రబాబు మాటలకు రియాక్టయిన పవన్ కల్యాణ్.. పోలీస్ డిపార్ట్మెంట్‌లో కొంతమంది అవినీతిపరులూ ఉన్నారని చెప్పారు. కొన్ని కేసులు గురించి సరైన ఫీడ్ బ్యాక్ కూడా ఇవ్వడం లేదని సీఎం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ఎస్పీలు సీరియస్‌గా పని చేయడం లేదని మండిపడ్డారు. అందరినీ దారిలోకి తీసుకువస్తే బాగుంటుందని ముఖ్యమంత్రికి సూచించారు. తప్పనిసరిగా మనం ఎప్పటికప్పుడు చర్చించి నెల రోజుల్లో అందరినీ దారిలోకి తీసుకువద్దామని పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు చెప్పారు.


ఏపీ క్యాబినెట్ సమావేశంలో వాడీవేడీ చర్చ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పవన్ కల్యాణ్, టీడీపీ అగ్రనేతలు సహా మహిళలపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టిన వారి పని పట్టేందుకు సిద్ధమైంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులపైనా చర్యలకు దిగుతోంది. వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అలాంటి అధికారులను గుర్తించారు. ఇవాళ సాయంత్రం లోగా పలువురు పోలీసు అధికారులపై వేటు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

AP Cabinet: ఈ అంశాలే ప్రధాన ఎజెండాగా ఏపీ కేబినెట్ భేటీ

Tirumala: తిరుమలకు వస్తే పాజిటివ్‌ ఫీలింగ్‌ వస్తుంది..

Updated Date - Nov 06 , 2024 | 04:40 PM