Share News

Purandeswari: ఉదయనిధి స్టాలిన్‌పై పురందేశ్వరి ధ్వజం

ABN , Publish Date - Sep 29 , 2024 | 09:53 PM

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి తప్పుమట్టారు. ఈమేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.సనాతన ధర్మాన్ని నిర్మూలించే వరకు విశ్రమించమని చెప్పిన ఉదయనిధి స్టాలిన్ పార్టీతో కాంగ్రెస్ అంటకాగుతుందని ఆరోపించారు.

Purandeswari: ఉదయనిధి స్టాలిన్‌పై  పురందేశ్వరి ధ్వజం

అమరావతి: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి తప్పుబట్టారు. ఈమేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించే వరకు విశ్రమించమని చెప్పిన ఉదయనిధి స్టాలిన్ పార్టీతో కాంగ్రెస్ అంటకాగుతుందని ఆరోపించారు. సనాతన ధర్మంపై ఆయన గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. ఇండియా కూటమి మాత్రం ఆయనను తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా నియమించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ తీరును తప్పుబడుతూ ఆయన వ్యాఖ్యల వీడియోను ట్విట్టర్‌లో పురందేశ్వరి పోస్ట్ చేశారు.


హిందూ తత్వాన్ని కించపరిచేలా జగన్ వ్యాఖ్యలు: సోము వీర్రాజు

తూర్పుగోదావరి జిల్లా: శ్రీవారి లడ్డూ అపవిత్రతపై ‘‘గోవు ఘోష వినండి గోవిందా’’ కార్యక్రమం సందర్భంగా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో సుందర గోవిందుడు ఆలయంలో గోవులకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ... జగన్ హిందుత్వం మీద హేయమైన భాషలో మాట్లాడారని మండిపడ్డారు. ఇదేం హిందుత్వం ఇదేమి భారతదేశమని మాజీ సీఎం జగన్ మాట్లాడారని .. ఈ రెండు మాటలను జగన్ వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. 320 రూపాయలకు అసలు నెయ్యి వస్తుందా అని ప్రశ్నించారు.


అసలు నెయ్యి కల్తీ జరగలేదని జగన్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఆ ధరకి ఆవు నెయ్యి వస్తుందా అని అడిగారు. రూ. 6 వేల కోట్ల బడ్జెట్‌లో నెయ్యికి రూ. 600 కోట్లు బడ్జెట్ ఖర్చుపెట్టడానికి జగన్ ఎందుకు ఆలోచించారని నిలదీశారు. హిందూ తత్వాన్ని కించపరిచేలా జగన్ వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. డిక్లరేషన్‌లో సంతకం పెట్టి తిరుమల దర్శనానికి వెళ్లడానికి జగన్‌కి అంత ఇబ్బంది ఏంటని సోము వీర్రాజు ప్రశ్నించారు.

Updated Date - Sep 29 , 2024 | 09:54 PM