Dhulipalla Narendra: రాబోయే ఎన్నికల్లో వైసీపీ పాలనను ప్రజలు బొందపెట్టడం ఖాయం
ABN , Publish Date - Jan 30 , 2024 | 03:37 PM
రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి వైసీపీ పాలనను బొందపెడతారని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర(Dhulipalla Narendra) హెచ్చరించారు.
గుంటూరు: రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి వైసీపీ పాలనను బొందపెడతారని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర(Dhulipalla Narendra) హెచ్చరించారు. పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న ‘రా.. కదలి రా‘ సభ విజయవంతం అయిందని తెలిపారు. ఈ సభను అడ్డుకోవడానికి జగన్ ప్రభుత్వం ఎన్నో రకాలుగా కుట్రలు చేసిందని మండిపడ్డారు. ఆర్పీలు నియోజకవర్గ పరిధిలో డ్వాక్రా మహిళలను ఆడుకున్నారని.. సభకు వెళ్తే.. ఆసరా చెక్కులు నిలిపివేస్తామని భయపెట్టారని.. అయినా మహిళల నుంచి చంద్రబాబుకు విశేష ఆదరణ లభించిందని తెలిపారు. జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొన్నారని తెలిపారు.గుంటూరు టీడీపీ ఎమ్మెల్యేను మభ్యపెట్టి వైసీపీలో చేర్చుకుని.. చివరకు ఆయనకు టికెట్ లేకుండా చేసి జగన్ నమ్మించి గొంతు కోశారన్నారు. ఆర్యవైశ్యులకు టీడీపీ ప్రాధాన్యం ఇస్తే.. వైసీపీ వారిని మోసం చేసిందని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ప్రకృతి సంపదలను సహజ వనరులను దోచుకున్నా వైనాన్ని ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేశామని చెప్పారు. టీడీపీ - జనసేన పొత్తు ఆవశ్యకతను ఈ సభ ద్వారా చంద్రబాబు ప్రజలకు వివరించారని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.
యువతకు చంద్రబాబు హామీ..
జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, దోపిడీలను అడ్డుకోవటానికి ఒక మార్పు కోసం టీడీపీ - జనసేన పొత్తు పెట్టుకుందని అన్నారు. ఇరు పార్టీల అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసిన కలిసి పనిచేసే విధంగా నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో మోసపోయిన యువతకు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కల్పించే అవకాశాలపై యువతకు చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. జగన్ హామీలు ఇచ్చి మోసం చేసిన విధానాన్ని ప్రజల ముందు ఉంచారన్నారు. రాష్ట్ర మంత్రులు చెప్పిన మాటలు బూటకమని వేదిక ద్వారా చంద్రబాబు చెప్పటం జరిగిందన్నారు. పోలీస్ యంత్రాంగం బందోబస్తు కల్పించడంలో విఫలం అయిందని మండిపడ్డారు. సీఎం సభ అంటే చాలు అధికారాన్ని దుర్వినియోగం చేసి జనాన్ని తరలిస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చంద్రబాబు చెప్పారన్నారు. ఈ సభ ప్రజా తిరుగుబాటుకు సంకేతమని ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.